Updated : 04 Sep 2022 17:43 IST

బడి దాటకున్నా... బడా ఆవిష్కరణలు!

పిల్లల మనసు సారవంతమైన చేనులాంటిదని చెబుతారు. సామాజిక స్పృహో, పర్యావరణహితమో, ఆవిష్కరణాభిలాషో... ఇలాంటి ఏ చిన్న విత్తనం పడ్డా అక్కడ అది ఏపుగా ఎదుగుతుంది. వాళ్లని మేధావులుగా మార్చి అద్భుతాలు చేయిస్తుంది. ఇంకా కాలేజీకి కూడా వెళ్లని ఈ ముగ్గురు విద్యార్థులూ అలా అద్భుతాలే చేశారు...

సోలార్‌ ఇస్త్రీ బండ్లు!

ఈ అమ్మాయి పేరు వినిషా ఉదయ్‌శంకర్‌. ఆరో తరగతిలో అందరిలాగే పర్యావరణ పరిరక్షణపైన పాఠం విన్న వినిషా... ఆ చైతన్యంతో తన పరిసరాలని కొత్తగా చూడటం ప్రారంభించింది. తమ ఇంటి దగ్గర బొగ్గులసాయంతో ఇస్త్రీ చేస్తున్నవాళ్లని గమనించింది. ‘కిరోసిన్‌తో మంట రాజేయడం, నిప్పుకణికలు చల్లారకుండా ఊదుతూ ఉండటం, చివరికి బూడిదగా మిగిలిన బొగ్గుల్ని కింద వదిలేయడం, ఆ బొగ్గుల కోసం చెట్ల కొమ్మల్ని నరికేయడం... ఇవన్నీ పర్యావరణానికి హానికదా!’ అని ఆ ఇస్త్రీవాళ్లని అడిగింది వినిషా. ‘ఇంకేం చేయాలో నువ్వే చెప్పు పాపా!’ అన్ని ప్రశ్నించారట వాళ్లు. ఆ ప్రశ్నని తన టీచర్ల ముందు ఉంచితే వాళ్లు ‘సోలార్‌తో వాళ్లకేమన్నా పరిష్కారం దొరకొచ్చు..!’ అన్నారట. అలా ఏడాదిపాటు టీచర్ల సాయంతో రకరకాల ప్రయోగాలు చేసిన వినిషా... సౌరవిద్యుత్తుతో పని చేసే ఇస్త్రీ బండ్లని తయారుచేసింది. ఎండ ఉన్నప్పుడు రీఛార్జ్‌ అయ్యి... రాత్రుల్లోనూ పనిచేసే ప్రత్యేక బ్యాటరీతో దీన్ని రూపొందించింది. ఆ ఆవిష్కరణే తమిళనాడు తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన ఈ చిన్నారికి... జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సాధించిపెట్టింది. నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫోరమ్‌(ఎన్‌ఐఎఫ్‌) దీనికి డాక్టర్‌ అబ్దుల్‌కలాం ‘ఇగ్నైటెడ్‌ మైండ్‌’ అవార్డుని అందించడమే కాక... పేటెంట్‌ హక్కుల్నీ ఇప్పించింది. ఆ తర్వాత స్వీడన్‌ నుంచి చిల్డ్రన్‌ క్లైమేట్‌ ప్రైజ్‌ అందుకుంది వినిషా. గత ఏడాది ఐరాస పర్యావరణ మార్పు సదస్సులో ప్రసంగించి ప్రశంసలు అందుకుంది. ఇటీవల ముగిసిన కామన్‌వెల్త్‌ పోటీలకి సంబంధించిన క్రీడాజ్యోతిని(క్వీన్స్‌ బ్యాటన్‌) చేతబూనే గౌరవాన్నీ దక్కించుకుంది వినిషా. స్థానిక బడిలో ప్లస్‌ వన్‌ చదువుతూనే... సోలార్‌ ఇస్త్రీబళ్లని తయారుచేయడానికి ఐరన్‌ మ్యాక్స్‌ అన్న స్టార్టప్‌ని ఏర్పాటుచేసి దానికి చీఫ్‌ ఇన్నోవేటివ్‌ ఆఫీసర్‌(సీఐఓ)గానూ వ్యవహరిస్తోంది!


గ్యాస్‌లీక్‌ని పసిగడుతుంది...

అంబేడ్కర్‌ నగర్‌... దిల్లీలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటి. ఇక్కడ తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండేవి. చాలావరకూ వాటికి కారణం గ్యాస్‌ లీకేజేనని తేలింది. పదహారేళ్ల అమన్‌ కుమార్‌ కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. ఓసారి అమన్‌ తాను ప్లస్‌ వన్‌ చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలోని లైబ్రరీలో సైన్స్‌ మేగజైన్‌ని తిరగేస్తుండగా... గ్యాస్‌ లీకేజీని పసిగట్టి హెచ్చరించే పరికరం పనితీరుని చదివాడు. యూట్యూబ్‌ సాయం తీసుకుని నాలుగురోజుల్లోనే దాని నమూనాని తయారుచేశాడు. మార్కెట్‌లో అలాంటి పరికరాలు సుమారు ఏడువేల రూపాయలదాకా ఉంటే... ఏడువందల రూపాయల ఖర్చుతో అందించేలా దీన్ని రూపొందించడం అమన్‌ ప్రత్యేకత. దానితో ‘సేఫ్‌ కిచెన్‌’ అన్న స్టార్టప్‌ని ప్రారంభించాడు అమన్‌. ‘షార్క్‌ట్యాంక్‌ ఇండియా’ కార్యక్రమంలాగే బడిపిల్లలు తమ బిజినెస్‌ ఐడియాల్ని వెల్లడించేందుకు... దిల్లీ ప్రభుత్వం ఓ లైవ్‌ టీవీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తే అమన్‌ బృందం అందులో పాల్గొంది. అతని ఆవిష్కరణకి లక్ష రూపాయల పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడితో ఉత్పత్తుల్ని తయారుచేసి... విక్రయాలూ మొదలుపెట్టేశాడు అమన్‌.


‘ఇంటర్న్‌’ కోసం ఓ ఆప్‌!

ఏ ప్రొఫెషనల్‌ కోర్సో చదువుకునేవాళ్లకే ఇంటర్న్‌షిప్‌ అవసరమని ఒకప్పుడు అనుకుంటూ ఉండేవాళ్లు. ఇప్పుడలా కాదు... పదో తరగతి విద్యార్థులకీ ఏదో ఒక రంగంలో ఇంటర్న్‌షిప్‌ ఉండాలంటున్నారు. స్టార్టప్‌లూ, ఎన్జీఓలూ, ఆశ్రమాలూ... ఇలా ఏదో ఒకచోటకి వెళ్లి కొద్దిరోజులైనా వాటి పనితీరుని గమనించమంటున్నాయి కొన్ని స్కూళ్లు. మరి చూస్తూచూస్తూ ఆ చిన్నారులకి ఎవరు ఇంటర్న్‌షిప్‌ కల్పిస్తారు... చొప్పదంటు ప్రశ్నలతో విసిగిస్తారని అనుకుంటారు తప్ప! రెండేళ్లకిందట అదే సమస్యని ఎదుర్కొంది శ్లోకా అశోక్‌ కుమార్‌. ఆ అమ్మాయి ఇంటర్న్‌షిప్‌ కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు... చివరికి వాళ్ల నాన్న సిఫార్సుతో ఓ చోట కుదురుకోగలిగింది. కానీ ఈ సమస్య మిగతా విద్యార్థులకి రాకుండా ‘ఇంటర్న్‌మీ’ అన్న ఆప్‌ని రూపొందించింది శ్లోక. విద్యార్థుల్ని ప్రోత్సహించాలన్న ఆసక్తి ఉన్న స్టార్టప్‌లూ, ఎన్జీఓలతో మాట్లాడి వాళ్ల వివరాలని ఆప్‌లో పెట్టింది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న విద్యార్థులు ఎవరైనా ఆ కంపెనీల దగ్గర సులభంగా ఇంటర్న్‌షిప్‌ చేయొచ్చన్నమాట! ఈ ఉచిత ఆప్‌ సేవల్ని దేశవ్యాప్తంగా విస్తరించడంతో దీనికి మంచి స్పందన లభించింది. ఈ సరికొత్త ఆలోచనకే ఇంగ్లండు దేశంలో అందించే ప్రతిష్ఠాత్మక డయానా అవార్డునీ ఇటీవల అందుకుంది... బెంగళూరులోని ఓ పాఠశాలలో ప్లస్‌ టూ చదువుతున్న శ్లోక! కర్టెన్‌... కనిపించకుండా చుట్టేయొచ్చు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts