మనసు మర్మం

ఆదిశంకరులంటారు- ‘నా మనసనే కోతి మోహమనే అడవిలో సంచరిస్తోంది. డబ్బు, కోరికలనే చెట్ల కొమ్మలపైన ఎగురుతోంది. ఈ కోతిని అధీనంలో ఉంచుకో ప్రభూ!’. ఈ ఆవేదన సకల మానవజాతిది. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత

Published : 11 Jan 2022 00:32 IST

దిశంకరులంటారు- ‘నా మనసనే కోతి మోహమనే అడవిలో సంచరిస్తోంది. డబ్బు, కోరికలనే చెట్ల కొమ్మలపైన ఎగురుతోంది. ఈ కోతిని అధీనంలో ఉంచుకో ప్రభూ!’. ఈ ఆవేదన సకల మానవజాతిది. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనే ఎనిమిది మనః ప్రసూనాలు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి, చిత్తశుద్ధితో స్వామికి వాటినర్పించాలి అంటారు స్వామి శివానందలహరిలో... మనం మనసులో నిర్మించుకున్న ఆలోచనలే కష్టాలు, సమస్యలు తెచ్చిపెడతాయి. మనసులో నిర్మాణమైన సృష్టినే ప్రత్యక్షంగా ప్రపంచంలో చూస్తున్నాం. మనసు, వాక్కు అన్యోన్యాశ్రితాలు. మంచి ఆలోచన మంచిమాటే పలికిస్తుంది. మంచిమాట మంచికర్మను ప్రేరేపిస్తుంది అని శ్రుతివాక్యం.

తన బలహీనతలను గుర్తించే వరకు మనసు అనిశ్చలంగానే ఉంటుంది. చిత్త చాంచల్యం పెరుగుతూంటుంది. లోకంలో మంచివాడే కనబడలేదట దుర్యోధనుడికి. అలాగే చెడ్డవాడు కనబడలేదట ధర్మరాజుకు. దీన్నిబట్టి వారి మానసిక స్థితులెలాంటివో అవగతమవుతుంది.

‘లాభం రావచ్చు, నష్టం రావచ్చు. గెలవచ్చు, ఓడిపోనూవచ్చు. ఏ మార్పునకూ చలించవద్దు. మనసును స్థిరంగా ఉంచుకో. అంతే... స్థిరంగా జీవన సమరంలో అడుగు పెట్టు’ అంటాడు గీతాచార్యుడు. నేటి మానవుడికీ ఇది అద్భుతమైన సందేశమే! ప్రవృత్తి, పరిస్థితుల్ని అనుసరించి వచ్చే ఆలోచనలు మనిషికి శత్రువులుగా మారకూడదు. అధీనంలో ఉంటే మనిషికి మనసును మించిన మంచి స్నేహితుడే ఉండడు. శుభ్రత బాహ్యం, ఆంతరంగికం అని రెండురకాలు. నిత్యస్నానం బాహ్య శౌచమైతే, మనసులోని అజ్ఞానాన్ని సాధన ద్వారా నిర్మూలించుకోవడం ఆంతరంగిక స్నానమవుతుంది. మనసు స్వచ్ఛంగా, శుచిగా లేకపోతే బాహ్యశౌచం ఏ ఫలితాన్నీ ఇవ్వదు. మనోవికారాలను దూరంగా ఉంచగలిగితేనే మానసిక శౌచం సాధ్యమవుతుంది.

మనిషికి మనసే మహావరం, మహాశాపం కూడాను! మనిషిని తోలుబొమ్మలానూ ఆడిస్తుంది. అందలమెక్కించి ఊరేగింపూ చేస్తుంది. దాన్ని నియంత్రించే శక్తి బుద్ధికే ఉంది. బుద్ధిని అనుసరించలేని మనసు వినాశానికి హేతువవుతుంది. బుద్ధికి ఎనిమిది గుణాలున్నాయి. సేవ చేయడం, వినడం, గ్రహించడం, గుర్తు పెట్టుకోవడం, ఊహించడం, సూచించడం, నియంత్రించడం, అనుభవించడం. ఇన్ని సద్గుణాలతో మనసును రాగద్వేషాలకు బానిస కాకుండా ధర్మమార్గం చెబుతూంటుంది బుద్ధి. అది చెప్పేది, హెచ్చరించేది పెడచెవిన పెట్టిన మనసుకు- వైఫల్యం, దుఃఖమే ఎదురవుతుంది. బుద్ధి వివేకాన్ని, జ్ఞానాన్ని, సంయమనాన్ని ఇస్తుంది. మనసు దాన్ని అందిపుచ్చుకోవాలి. విచక్షణ లేని మనసు ఏది తోస్తే అది చేస్తుంది. తరవాత అనుభవిస్తుంది.

అన్ని రకాల అనుభూతులను అనుభవించేది మనసే. అది అదుపులో ఉన్నంతకాలం జీవితం అనంత సౌఖ్యానందాలకు ఆలవాలం అవుతుంది. అలా ఉండాలంటే మనసుకు ధ్యానం, యోగా, నామస్మరణ, ప్రవచన శ్రవణం, సద్గ్రంథ పఠనం, ఆత్మీయుల మధ్య పండుగలు-పబ్బాలతో గడుపుకోవడం, బాంధవ్యాను బంధాలు బలపడేలా చూసుకోవడం, సామాజిక సేవాకార్యక్రమాలలో, కళా సంస్కృతులలో రసానుభూతి చెందడం లాంటివి అత్యంతావశ్యకం. దూషణ భూషణ తిరస్కారాలకు స్పందించని మనసే మనసు!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని