పురుషోత్తమ క్షేత్రం

రథం... స్యందనం... తేరు... అరదం- ఇవన్నీ సమానార్థక పదాలు. సాధారణమైన అర్థంలో... రథమంటే ఒక రాజలాంఛనం, లేదా దేవుడి ఊరేగింపులో ఉపయోగపడే వాహనం. వేదాంతపరమైన అన్వయంలో

Published : 01 Jul 2022 00:16 IST

రథం... స్యందనం... తేరు... అరదం- ఇవన్నీ సమానార్థక పదాలు. సాధారణమైన అర్థంలో... రథమంటే ఒక రాజలాంఛనం, లేదా దేవుడి ఊరేగింపులో ఉపయోగపడే వాహనం. వేదాంతపరమైన అన్వయంలో రథమంటే... మానవ దేహం. అందులో ఆశీనుడయ్యే రథి... జీవాత్మ! పంచేంద్రియాలే- రథాన్ని పరుగులు తీయించే గుర్రాలు. పూరీ జగన్నాథుడి విషయంలో ఆ వేదాంతభావన విశ్వరూపం దాలుస్తుంది. ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణ భగవానుడి ఆత్మచైతన్యం- జగన్నాథుడి దారుశిల్పంలో నిక్షిప్తమై ఉంటుందన్న భక్తుల విశ్వాసమే దానికి ప్రధాన కారణం. ఆ విశ్వాసాన్ని అనుసరించి- ఈ విశ్వమే జగన్నాథుడి రథం. రథిగా అందులో ఊరేగేవాడు- పరమాత్మ స్వరూపుడు, ఈ జగతికే నాథుడైన శ్రీ జగన్నాథుడు... 44 అడుగుల ఎత్తున్న సర్వాంగ సుందరం, సాలంకృతమైన దివ్యరథంలో తన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరానగల గుండీచా మందిరానికి కోలాహలంగా సాగిపోయే శోభాయాత్ర- జగన్నాథ రథయాత్రగా ప్రసిద్ధికెక్కింది. అది భక్తకోటిని విశేషంగా ఆకర్షించే వైభవోపేతమైన ఊరేగింపు. అశేష ప్రజానీకం బలమైన పగ్గాలతో రథాన్ని లాగడానికి పోటీ పడతారు. అవకాశం దొరికినవారు జన్మ ధన్యమైందని ఉప్పొంగిపోతారు. ఉత్సవమూర్తులతో కాకుండా, నేరుగా మూలవిరాట్టులతోనే రథయాత్ర జరిపించడం పూరీక్షేత్ర ప్రత్యేకత.  మూలవిరాట్టులను దర్శించుకోవడానికి మహత్తరమైన అవకాశమిది. అందుకే అన్ని వర్గాలవారూ స్వామి దర్శనానికి ఉబలాటపడతారు.

రథయాత్ర కోసం ఏటా జగన్నాథుడితోపాటు బలరాముడికి, సుభద్రకు మూడు సరికొత్త రథాలను సిద్ధం చేస్తారు. అక్షయతృతీయ నాడు ఆరంభమయ్యే రథాల నిర్మాణం- రథయాత్రకు ముందురోజు ఆషాఢశుధ్ధ పాడ్యమి నాటికి పూర్తి అవుతుంది. మరునాడు జగన్నాథుడి రథం ‘నందిఘోష్‌’, బలరాముడి రథం ‘తాళధ్వజ్‌’, సుభద్రమ్మ రథం ‘దర్పదళన్‌’ రథయాత్రకు ఉపక్రమిస్తాయి.

జగన్నాథుడు రథాన్ని అధిరోహించే ఘట్టానికి ‘పొహండి’ అని పేరు. ముందుగా పూరీక్షేత్ర ఆనువంశిక ధర్మకర్త రథాల ముందు దారిని బంగారు చీపురుతో శుభ్రపరిచి, కస్తూరి కళ్లాపి చల్లుతారు. దీన్ని ‘చెర్రా పహన్రా’ అంటారు. పిదప వరసగా సుభద్ర బలభద్రుడు జగన్నాథుల రథాలు ముందుకు సాగుతాయి. ఈ సన్నివేశం భక్తుల హృదయాలను ఉర్రూతలూగిస్తుంది. దగ్గరగా చూడాలని జనం ముందుకు తోసుకొస్తారు.

జగన్నాథ రథయాత్రలో ఆధ్యాత్మికంగా ఎన్నో అంతరార్థాలు ఇమిడి ఉన్నాయి. గర్భస్థ శిశువు తన శరీర పోషణకు అవసరమైనవన్నీ తల్లినుంచే స్వీకరిస్తాడు. ఎదుగుతాడు. శిశువు, తల్లి ఇద్దరూ సజీవులే. ఇద్దరూ సత్యమే. గర్భస్థ శిశువుకు అమ్మను చూడటం వీలుకాదు. అలాగే విశ్వం అంతటినీ తన బొజ్జలో ఇముడ్చుకొన్న జగన్నాథుణ్ని- విశ్వంలో భాగమైన జీవుడు ప్రత్యక్షంగా చూడలేడు. ప్రతీకగా మాత్రమే దర్శించాలి. ఆ ప్రతీకే- జగన్నాథ రథం. సర్వం తానై, సర్వస్వాన్నీ తనలో ఇముడ్చుకొన్న సర్వేశ్వరుడి సజీవ చైతన్యాన్ని జగన్నాథుడి దారుప్రతిమలో గమనించడమే జగన్నాథ రథయాత్రను దర్శించడంలోని అంతరార్థం. కాబట్టే పూరీకి ‘పురుషోత్తమ క్షేత్రం’ అనే పేరు వచ్చింది.

- ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని