Published : 05 Jul 2022 00:53 IST

చాణక్యం

రాజ్య పాలనలో (రాజ)దండం ప్రధాన పాత్ర వహిస్తుంది. అది పాలకుడి  ఆధిపత్యానికి చిహ్నం. దానికి స్వ,పర భేదం ఉండదు. కాబట్టి రాజనీతికి దండనీతి అని పేరు. దండనీతినే అర్థనీతి లేదా అర్థశాస్త్రమనే పేరుతో పిలిచేవారని మహాభారతం చెబుతోంది. మనుషుల జీవితాలకు మూలం ధనం(అర్థం). ఆనాటి ధనం భూమే. భూమిని సంపాదించే, పాలించే ఉపాయాలు, తెలిపే శాస్త్రం కాబట్టి అర్థశాస్త్రం అయింది. దాన్ని రచించిన వాడు చాణక్యుడు.

భూమిని సమకూర్చుకోవడం, రక్షించుకోవడం, వృద్ధి చేసుకోవడం, దాన్ని మంచివారి చేతుల్లో ఉంచడం, సుపరిపాలన జరిగేటట్లు చూడటం... అనే విషయాలు కూలంకషంగా  చెప్పినవాడు చాణక్యుడు. స్వయంగా అధ్యాపకుడైన తండ్రి చణకుడి పర్యవేక్షణలో చాణక్యుడు రాజనీతి కోవిదుడిగా, నైతిక బోధకుడిగా, ఆర్థికవేత్తగా ఎదిగాడు. 

పాలకులు, ప్రతి పౌరుడి యోగ క్షేమాలకు ప్రాధాన్యమిచ్చే పాలనా విధానాన్ని అవలంబించి, శాంతి సౌభాగ్యాలను వర్ధిల్లజేయడానికి అనుసరించవలసిన పద్ధతులను విపులంగా వివరించాడు.

‘తన మీద తనకుండే నమ్మకం, శత్రువును భయపెడుతుంది. అపనమ్మకం, శత్రువు బలాన్ని పెంచుతుంది. కాబట్టి పాలకుడు తన శక్తి యుక్తుల మీద నమ్మకం కలిగి ఉండాలి.  ఆ నమ్మకం ఉన్నప్పుడే ‘అధర్మాన్ని నాశనం చేయడానికి, ఎటువంటి మార్గాన్నైనా అనుసరించగలడు’ అనే మాట పాలకులకే కాకుండా ఇతరులకు సైతం స్ఫూర్తిదాయకమవుతుంది.

కుటిలం అంటే కొంటెతనం, మోసం అనే అర్థాలున్నాయి. రాజనీతి కోవిదుడు కాబట్టి రాజ్య/ ప్రజా సంరక్షణ కోసం అవసరమైతే కుటిలత్వాన్ని అనుసరించ వచ్చు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, అనుసరించినవాడు కావడంతో చాణక్యుణ్ని కౌటిల్యుడనీ పిలుస్తారు. విష్ణుగుప్తుడు అనే మరో పేరూ ఉంది.

‘కాలాన్ని వృథా చేసేవారు, సరైన సమయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేనివారు ఎప్పటికీ విజయం సాధించలేరు’ అని విజయార్థులకు ఆయన మార్గదర్శనం చేశాడు. 

కౌటిల్యుడి రచన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇందులో సామాన్య మానవ జీవితానికి సైతం ఉపయోగపడే అనేక అంశాలను పొందుపరచాడు.

‘మనిషి పుట్టుకతో కాకుండా, చేసే పనుల ద్వారా గొప్పవాడు అవుతాడు’ అని చెప్పిన ఆయనే, ‘గతంలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి’ అని కర్తవ్య బోధ చేశాడు.

వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడానికి సామ, దాన, భేద, దండోపాయాలను అనుసరించడం అనే సంప్రదాయాన్ని ప్రతిపాదించి, ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు చాణక్యుడే.

సామాన్యులు సైతం విజయం సాధించడానికి మార్గాలను సరళంగా చెప్పాడు. ఏ పనైనా మొదలు పెట్టే ముందు ‘ఈ పని ఎందుకు చేస్తున్నాం’ దీని ఫలితమేమిటి, ఇందులో విజయం సాధించగలనా... అనే మూడు ప్రశ్నలు వేసుకోవాలి’ అనేది వాటిలో ప్రధానమైనది.
ఆర్థిక విషయాల గురించి ఆయన చేసిన సూచనలు అనుసరించదగినవి. ‘సుఖమయ జీవితాన్ని పొందాలనుకునే వారు డబ్బు విలువ తప్పనిసరిగా తెలుసుకోవాలి’ అని బోధించాడు. దానితోపాటు ‘న్యాయ మార్గంలోనే ధనం సంపాదించాలి’ అనీ హెచ్చరించాడు.
ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ప్రత్యేకంగా ఉండరు. నీ నడవడే నీకు మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుందని ఉద్బోధించింది చాణక్యుడే. 

- అయ్యగారి శ్రీనివాస రావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని