అంచెలంచెలుగా...

అద్భుతాలనేవి మనిషి కోరికల్ని దేవుడు పర్యవేక్షిస్తుండటం వల్ల జరగడం లేదు. మనిషి దేవుడి సంకల్పాలను తెలుసుకుంటూ సత్ప్రవర్తనతో సానుకూల దృక్పథంతో నడుచుకోవడం వల్ల జరుగుతాయి. సృష్టిలో మనిషికి ఒక విశిష్ట స్థానముంది. అతడు సృష్టించి, విడిచిపెట్టి, ఆ తరవాత అమరత్వాన్ని పొందగలడు.

Published : 02 Oct 2022 00:49 IST

ద్భుతాలనేవి మనిషి కోరికల్ని దేవుడు పర్యవేక్షిస్తుండటం వల్ల జరగడం లేదు. మనిషి దేవుడి సంకల్పాలను తెలుసుకుంటూ సత్ప్రవర్తనతో సానుకూల దృక్పథంతో నడుచుకోవడం వల్ల జరుగుతాయి. సృష్టిలో మనిషికి ఒక విశిష్ట స్థానముంది. అతడు సృష్టించి, విడిచిపెట్టి, ఆ తరవాత అమరత్వాన్ని పొందగలడు. ఈ ప్రపంచాన్ని అద్భుతంగా, స్వర్గతుల్యంగా, అంతా ఆనందంగా జీవించగలిగేలా చేయగలిగే సామర్థ్యాన్ని, నిగూఢశక్తుల్ని ఆ భగవంతుడు మనిషికి ప్రసాదించాడు. అవి సద్వినియోగమయ్యేలా అతడి వివేకం పనిచేయాలి.

రెక్కలు లేని పక్షులు ఎగరలేవు. ఎగరలేని పక్షుల్ని ఊహించలేం. అలాగే మనుషుల విషయం కూడా. దైవం మనిషికి కనిపించే రెక్కల్ని ఇవ్వకపోయినా, ఊహల రెక్కల్ని, తెలియని గమ్యాలను శోధించే సంకల్పాన్నీ ప్రసాదించాడు. సహజంగా ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ఏదో రకమైన ప్రతిభ ఉంటుంది. ఎవరో వచ్చి సరైన మార్గం చూపించేంతవరకు ఏళ్ల తరబడి అది బహిర్గతం కాకపోవచ్చు. అంతవరకూ జీవితం అసంపూర్ణంగా తోస్తుంది. ఎవరూ జీవితంలో పదేపదే పడిపోవడాన్ని కోరుకోరు. పడిపోయి లేవడం జరిగినప్పుడే నేర్చుకోవడం మొదలవుతుంది. ఆటలోనైనా, జీవితం లోనైనా అపజయాలు లేకపోతే జయం విలువ తెలియదు.

నాకు ‘రేపు’ అంటే భయంలేదు. ఎందుకంటే ‘నిన్న’ చూసేశాను. అందుకే ‘ఈరోజు’ను ప్రేమిస్తున్నాను అనే ఆలో చన మనిషికి ఉండాలి. ఎవరైతే అన్ని జీవరాశులను తనలోను, తనను ఇతర జీవరాశుల్లోను చూడగలుగుతారో వారికి బతుకులో భయం ఉండదు అనేది ఈశోపనిషత్తు వాక్యం.

భూమి లోపలి పొరల్లో బంగారంతో పాటు రాళ్లూ ఉంటాయి. అవి భూమిలో నిక్షిప్తమై ఉన్నంతవరకు రెండింటికీ విలువలో తేడా ఉండదు. వాటిని వెలికితీసినప్పుడే దేని విలువ ఎంతో అర్థమవుతుంది. అలాగే మనిషికి మనిషికి మధ్య తేడా అన్నది వారిలో నిద్రాణమైన శక్తి బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. ప్రతి మనిషీ నిద్రిస్తున్న అగ్నిపర్వతం. అద్భుతాన్ని దాచుకున్న విత్తనం.

జన్మించడం, మరణించడం మనం చేసుకునే ఎంపిక కాదు. కానీ ఎలా జీవించాలి అన్నది కచ్చితంగా మనిషి చేసుకునే ఎంపికే.

అదృష్టం, దురదృష్టం అనేవి మనిషి చూసే దృక్పథంలో ఉంటాయి. మనిషి అంచెలంచెల ఎదుగుదల దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఆత్మావగాహన మనిషిలోని లోపలిగొంతుకు ప్రాణాన్నిస్తుంది. అది తిరిగి బతుకునిస్తుంది. అనుభవం సంపాదించడం అనేది జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కినప్పుడు సాధ్యపడుతుంది. ఎక్కే ప్రయత్నం చేయకుండా శిఖరం చేరుకోవడం అసాధ్యం.

భౌతిక ఉన్నతి మొదటి అంతస్తు. అది ‘ఇంకా కావాలి’ అన్నచోట వదిలిపెడుతుంది. ఎప్పుడూ పనిలో మునిగిపోయేలా చేస్తుంది. మేధాసంబంధమైన సంతృప్తి రెండో అంతస్తు. అసంతృప్తినే కలిగిస్తుంది. మనిషి నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల మూడో అంతస్తు. ‘నాకు అన్నీ ఉన్నాయి’ అన్న భరోసాను కలిగిస్తుంది. ఈ అనుభవం మనిషికున్న జ్ఞానాన్ని ధ్రువీకరిస్తుంది. అప్పుడు మనిషి అన్వయించుకోవడం మొదలుపెడతాడు. మనిషికి ఒక్కడికే ఆ అవకాశం ఉంది. జీవితంలో మనిషికి ఎప్పుడూ ప్రతి దశలోనూ ఎదురయ్యే ప్రశ్న- ‘తరవాత ఏమిటి’. ఇదే నిచ్చెనపై ఒక్కో మెట్టూ ఎక్కేందుకు మంత్రం.

వృక్షానికి ఉండే శక్తి, దాని వేళ్లు ఎంత లోతుగా ఉన్నాయన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఉన్నతమైన పరిపక్వత కలగాలంటే విశ్వాసం అవసరం. విశ్వాసం అంటే కంటికి కనిపించనిదాన్ని యథార్థంగా భావించి స్వీకరించే శక్తి. ‘విశ్వాసం’ ద్వారం గుండా అనంతమైన మేధకు సంబంధించిన విశ్వశక్తిని నియంత్రణలోకి తెచ్చుకుని ఉపయోగించుకుంటాడు మనిషి. విశ్వాసం విషయంలో మనిషి ఎంత లోతుల్లోకి వెడితే అంత ఎత్తులు చేరుకోవచ్చు.

- మంత్రవాది మహేశ్వర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని