విజయసాధన

సానుకూలమైన ఆలోచనలు చెయ్యడం రాకపోతే ప్రతికూలమైన ఆలోచనలు ఆపడం అభ్యాసం చెయ్యాలి. కీడెంచి మేలెంచమన్నారు కదా అని ఎప్పుడూ కీడు గురించి ఆలోచించకూడదు.

Published : 12 Jan 2023 00:03 IST

సానుకూలమైన ఆలోచనలు చెయ్యడం రాకపోతే ప్రతికూలమైన ఆలోచనలు ఆపడం అభ్యాసం చెయ్యాలి. కీడెంచి మేలెంచమన్నారు కదా అని ఎప్పుడూ కీడు గురించి ఆలోచించకూడదు. అపజయం పొందడానికి అవసరమైతే సిద్ధపడుతూ విజయం వైపు దృష్టి పెట్టాలి.

బ్రహ్మాండమైన ఆలోచనలు వాటంతట అవే రావు. గొప్ప ఆలోచనలు ఈగల్లా ముసరవు. మంచి ఆలోచనలు చీమల్లా వరసగా పాకవు. అనుకూలమైన ఆలోచనలు ఆకాశంలో కాకుల్లా ఎగరవు. అరుదైన మేలు జాతి పక్షుల్లా, రాజహంసల్లా- విజయాన్నిచ్చే ఆలోచనలు అప్పుడప్పుడు మాత్రమే మనసులోకి వస్తాయి. వచ్చినప్పుడు ఆ అరుదైన అవకా శాలను ఒడిసి పట్టుకోవాలి.

విజయం క్షీరసాగర మథనం తరవాత వచ్చిన కామధేనువు. కల్పవృక్షంలా అతి అరుదుగా కాకపోయినా ప్రయత్నించి వాళ్ల సంకల్పబలాన్ని బట్టి ఎవరినైనా వరిస్తుంది. ముందుకు వెళ్ళేటప్పుడు రాజకుమారుడికి కథలో అడ్డుపడే రాక్షసుల మాదిరిగా ప్రతికూల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటిని శక్తితో, యుక్తితో ఎదు ర్కోవాలి. కొన్ని మంచి ఆలోచనల సమాహారమే విజయం. పూలదండ మెడలో వేసినట్లు జీవితం అందరికీ పుష్పగుచ్ఛంలా విజయాన్ని చేతి కందించి చప్పట్లు కొట్టదు.

ఎవరు విజయ శిఖరాగ్రాన్ని చూస్తున్నారో, రక్తం స్వేదం చిందించడానికి ఎవరు సిద్ధపడ్డారో, ఎవరు భయాన్నే భయపెడుతున్నారో- వారిని చూసి ఆనందంతో వసంతంలో కోకిల కూసినట్లు జీవితం విజయశంఖం పూరిస్తుంది.

ప్రతికూల ఆలోచనలు వద్దన్నా వస్తాయి. వాటిని గుర్తుపట్టి, దూరంగా ఉంచాలి. వాటిని పట్టించుకోకుండా ఉండటమే మనం చేయాల్సిన ముఖ్యమైన సాధన. భయపడి వెనక్కి పారిపోతే ప్రతికూలతలు పగలబడి నవ్వుతాయి. నిలబడి ఎదురు తిరిగితే తోకముడిచిన పిల్లులవుతాయి. సాధించే శక్తి మనిషి అణువణువునా ఉందని చరిత్ర రుజువు చేసింది. ఏమీ చెయ్యకుండా, అపజయానికి భయపడి వంద సంవత్సరాలు బతికితే ఆ బతుకు ఎందుకు? అది మనిషి బతుకు కాదు. దానికంటే అల్పాయుష్షుతో చనిపోయే ఎన్నో సూక్ష్మజీవులు నయం.

పాకే పురుగులు, సూక్ష్మజీవులు, కంటికి కనిపించని అత్యంత సూక్ష్మక్రిముల కంటే మనిషి అధికుడు కాడా? కచ్చితంగా అధికుడే. సముద్రం మీద ఓడ ఎన్నో తుపానులను చూసినట్లు- మనిషి ఎన్నో యుద్ధాలను, భయోత్పాతాలను, పోరాటాలను చూశాడు. విజయకేతనం ఎగరేశాడు.

విజయం సాధించే ముందు భయాన్ని గెలవాలి. భయాన్ని చంపాలి. ప్రతికూల ఆలోచనలతో మనసులో పెరిగే కోటను క్షణక్షణం కూల్చెయ్యాలి. భయమే మరణం. మేధావులు దేహ మరణానికి భయపడరు. భయానికే భయపడతారు. ఆ భయాన్ని చంపాలి. అది ఒక ప్రతికూల ఊహ! దాన్ని ఎదుర్కోవాలి. గెలుపు పొందుతాం. గెలిచి తీరుతాం. ముందు మనసులో గెలవాలి. భయాన్ని ముక్కలు చేసి పారెయ్యాలి. సైన్యం, యుద్ధ సామగ్రి, సంకల్పబలం ఉన్నవారి రథానికి సారథి శ్రీకృష్ణుడే. యుద్ధం చెయ్యాలి! ప్రతికూలతలను తొలగించడం అనేది యుద్ధం చేస్తేనే అనుభూతిలోకి వస్తుంది. 

 ఆనందసాయి స్వామి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని