Ap High Court: వారిని ఇళ్ల వద్దే విచారించండి: మాజీ మంత్రి విషయంలో హైకోర్టు ఆదేశం
రాజధాని బృహత్ ప్రణాళిక రూపకల్పన, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, ఎన్‌ఎస్‌పీఐఆర్‌ఏ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగి ప్రమీలను వారి ఇళ్ల వద్దే విచారించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
ఈనాడు, అమరావతి: రాజధాని బృహత్ ప్రణాళిక రూపకల్పన, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, ఎన్‌ఎస్‌పీఐఆర్‌ఏ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగి ప్రమీలను వారి ఇళ్ల వద్దే విచారించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్, రాజధాని బృహత్ ప్రణాళిక రూపకల్పనలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ 2022లో కేసులు నమోదు చేసింది. ఆ కేసుల్లో ఈనెల 6న తాడేపల్లిలో తమ కార్యాలయానికి విచారణకు రావాలని సీఐడీ ఫిబ్రవరి 28న నోటీసులు ఇచ్చింది. వీటిని సవాలు చేస్తూ నారాయణ, రమాదేవి, ప్రమీల హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్లలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మహిళలను ఇంటివద్దే విచారించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇదే కేసులో నారాయణను ఇంటివద్దే విచారించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలిచ్చింది’ అని గుర్తుచేశారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్లను వారి ఇళ్ల వద్దే విచారించాలని సీఐడీని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.