
Farm Laws: చట్టాలకు చెల్లు
సాగు చట్టాల రద్దు బిల్లుకు తొలిరోజే పార్లమెంటు ఆమోదం
ప్రధాని మాట నిలబెట్టుకున్నారు
కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్
ఇతర రైతు సమస్యలపై ఉభయ సభల్లో విపక్షాల నిరసన
దిల్లీ
వివాదం రేకెత్తించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. సోమవారం శీతాకాల సమావేశాలు మొదలైన వెంటనే తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభ ఎలాంటి చర్చ లేకుండానే దీనికి మూజువాణి ఓటుతో సమ్మతి తెలిపాయి. మొత్తం ప్రక్రియ రెండు గంటల్లో ముగిసిపోయింది. బిల్లును శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఉభయ సభల్లోనూ బిల్లు ప్రవేశపెట్టారు. చట్టాల రద్దు నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించినా, దానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించాలని పట్టుపట్టాయి. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఉభయ సభల్లో సభ్యులు నిరసనలు తెలిపారు. పలుమార్లు సభా కార్యకలాపాలకు అంతరాయం వాటిల్లింది. మునుపటి వర్షాకాల సమావేశాల్లో అనుచిత ప్రవర్తనకు గానూ రాజ్యసభలో 12 మంది విపక్ష సభ్యుల్ని ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
మద్దతు ధరకు చట్టబద్ధత ఎప్పుడు?
వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారంటూ విపక్షాలు లోక్‌సభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారంపైనా స్పష్టమైన హామీ కావాలని పట్టుపట్టాయి. సభాపతి స్థానం వద్దకు వెళ్లి నినాదాలు చేశాయి. చర్చకు ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానిస్తే.. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మంత్రి తోమర్ విమర్శించారు. మూడు చట్టాల రద్దుకు ఉభయపక్షాలూ సమ్మతించినప్పుడు చర్చ అవసరం లేదన్నారు. వివిధ డిమాండ్లను విపక్షాలు లేవనెత్తి, సభలో ఇతర కార్యకలాపాలను అడ్డుకున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌ల నిరసనల నడుమ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాల నోటీసులను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. కొందరు సభ్యులు సభను ఆటంకపరిచే కృత నిశ్చయంతో వచ్చినట్లున్నారని వ్యాఖ్యానించారు.
నిబంధనలను గాలికి వదిలేశారు: కాంగ్రెస్
అన్నదాతల పేరుతో పార్లమెంటులో సోమవారం సూర్యోదయమైందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. చర్చ జరిగితే తప్పులు బయటపడిపోతాయని ప్రభుత్వం భయపడిందని విలేకరుల సమావేశంలో ఆయన ఎద్దేవా చేశారు. చర్చను అనుమతించకపోతే పార్లమెంటును మూసివేయడం మేలని అభిప్రాయపడ్డారు. బిల్లును ఆమోదించే విషయంలో పార్లమెంటరీ నిబంధనల్ని గాలికి వదిలేశారనీ, చర్చకు ఏమాత్రం ఆస్కారం కల్పించలేదని లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి విమర్శించారు. బిల్లుకు విపక్షాలే మద్దతు ఇస్తున్నప్పుడు చర్చను ఎందుకు అనుమతించలేదని పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఆయన ప్రశ్నించారు. చర్చ జరిగితే ఈ బిల్లుల వెనుక కుట్ర బయటపడేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. బిల్లుల్ని ప్రవేశపెట్టినప్పుడు, చట్టాల్ని రద్దు చేస్తున్నప్పుడు ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించిందని రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన
పార్లమెంట్ సమావేశాల ఆరంభానికి ముందు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వరకు ఎంపీలు ప్రదర్శన నిర్వహించారు. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నినాదాలిచ్చారు. పార్లమెంటు ఆవరణలో విపక్ష నేతలు సమావేశమై, వ్యూహాన్ని చర్చించారు. తృణమూల్ కాంగ్రెస్, ఆప్ నేతలు దీనికి హాజరు కాలేదు.
ఆనాటి ప్రవర్తనకు 12 మంది సభ్యులపై చర్య
ఈ ఏడాది ఆగస్టు 11 నాటి సమావేశంలో రాజ్యసభలో రభస సృష్టించినందుకు సెక్షన్-256 కింద 12 మంది సభ్యుల్ని ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ ప్రకటించారు. ఈ మేరకు తీర్మానాన్ని సభలో ఆమోదించారు. సస్పెండైన వారిలో ఛాయావర్మ (కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది (శివసేన), డోలాసేన్ (తృణమూల్), ఎలమారం కరీం (సీపీఎం), బినయ్ విశ్వం (సీపీఐ) తదితరులు ఉన్నారు. సభ్యుల సస్పెన్షన్ అవాంఛితం, అప్రజాస్వామికమని విపక్షాలు సంయుక్త ప్రకటనలో ధ్వజమెత్తాయి. సస్పెన్షన్లపై చర్చకు మంగళవారం విపక్షాలు అత్యవసరంగా భేటీ కానున్నాయి. సభను, సభాపతి స్థానాన్ని తీవ్రంగా అవమానించేలా ప్రవర్తించడం వల్లనే సభ్యులు సస్పెండయ్యారని ప్రభుత్వం సమర్థించుకుంది. ఆగస్టు 11న ఈ సభ్యులు అన్ని పరిధులు అతిక్రమించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ మేరకు ఆయన వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. టేబుళ్లపై నిల్చోవడం, సభాపతి పీఠంవైపు దస్త్రాలు విసరడం, పార్లమెంటరీ సిబ్బందిని అడ్డుకోవడం, మరికొన్ని హింసాత్మక ఘటనల ద్వారా ప్రజాస్వామ్యానికే వారు మచ్చ తెచ్చారని దానిలో పేర్కొన్నారు. ఛైర్మన్‌కు వారు క్షమాపణ చెబితే సస్పెన్షన్లు ఎత్తివేసే అవకాశం ఉంటుందని చెప్పారు. 256వ నిబంధన కింద గతంలోనూ కొందరు ఎంపీల్ని సస్పెండ్ చేసినా, ఒకేసారి 12 మందిపై చర్య తీసుకోవడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.
రద్దు బిల్లు.. 750 మంది రైతులకు నివాళి
ఇది కర్షక విజయం: టికాయిత్
ఇతర డిమాండ్లపై నేటిలోగా స్పందించాలి: ఎస్‌కేఎం
దిల్లీ: నూతన సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేయడం.. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మందికి నివాళి అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధర సహా వివిధ అంశాలపై చర్చ జరిగేవరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని చెప్పారు. చట్టాల రద్దును పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. చట్టాలను రద్దు చేయడం నిరసనకారుల విజయమని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్‌కేఎం) పేర్కొంది. తాము లేవనెత్తుతున్న డిమాండ్లపై ప్రభుత్వం మంగళవారంలోగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. తదుపరి కార్యాచరణ నిర్ణయించడానికి బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఎస్‌కేఎం నేతలు సోమవారం సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
-
Movies News
Ram: రూమర్స్‌తో విసిగిపోయిన రామ్.. ఇంట్లోవాళ్లకే సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి వచ్చిందంటూ పోస్ట్
-
Business News
Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
Ap-top-news News
Botsa: అందుకే నాకు భయమేస్తోంది: బొత్స
-
Ap-top-news News
Raghurama: రఘురామను హైదరాబాద్‌లోనే విచారించండి: ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం