విద్యుత్‌ వినియోగదారులకు వాయిదా పద్ధతిలో గృహోపకరణాలు

విద్యుత్‌ వినియోగదారులకు ఇంధన సామర్థ్య గృహోపకరణాలను అందించడానికి నిర్దిష్టమైన ఫైనాన్సింగ్‌ మోడల్‌ను రూపొందించాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)

Published : 14 Mar 2022 03:58 IST

ఈనాడు, అమరావతి: విద్యుత్‌ వినియోగదారులకు ఇంధన సామర్థ్య గృహోపకరణాలను అందించడానికి నిర్దిష్టమైన ఫైనాన్సింగ్‌ మోడల్‌ను రూపొందించాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి ఆదేశించారు. ఆసియాలో ప్రముఖ పరిశోధన సంస్థ కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ), డిస్కంల సీఎండీలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇంధన సామర్థ్య గృహోపకరణాల వినియోగంతో ఇంధన పొదుపు జరిగి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఆదా చేసిన మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు. దీనివల్ల డిస్కంలపై ఆర్థిక భారం ఉండదు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకం వర్తిస్తుంది’ అని పేర్కొన్నారు. సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే ఇంధన సామర్థ్య ఫ్యాన్లు సగం విద్యుత్‌నే వినియోగిస్తాయని సీఈఈడబ్ల్యూ సీనియర్‌ లీడ్‌ శాలు అగర్వాల్‌ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘సూపర్‌ ఎఫీషియంట్‌ ఫ్యాన్లను వినియోగించడంవల్ల రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లలో 7వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి, డిస్కంలకు రూ.4,500 కోట్లు ఆదా అవుతాయి’ అని పేర్కొన్నారు.

త్వరలో ఉద్యోగులకు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు

ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను నెలవారీ వాయిదా పద్ధతిలో అందించే పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. వారం రోజుల్లో సుమారు వెయ్యి వాహనాలను అందించాలని పునరుత్పాదక ఇంధన వనరులశాఖ (నెడ్‌క్యాప్‌) నిర్ణయించింది. హీరో.. టీవీఎస్‌.. ఏథర్‌తో పాటు పలు కంపెనీల వాహనాల సరఫరా కోసం ఎంవోయూ కుదుర్చుకునేలా పత్రాలను కంపెనీ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద కనీసం లక్ష ద్విచక్ర వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్‌ భావిస్తోంది. మొదటి వాయిదాను ఉద్యోగి చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని 9శాతం వడ్డీపై బ్యాంకర్లు రుణంగా అందిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని