సచివాలయాల నిధుల్లో మాకేదీ భాగస్వామ్యం

గ్రామ, వార్డు సచివాలయానికి  పనుల కోసం రూ.20 లక్షల చొప్పున కేటాయించిన ప్రభుత్వం...పనుల గుర్తింపు, నిర్వహణ వంటి విషయాల్లో గ్రామాల్లో సర్పంచులు, నగరాలు, పట్టణాల్లో మేయర్‌, పుర ఛైర్మన్లను భాగస్వాములను

Published : 19 Aug 2022 04:18 IST

సర్పంచులు, పుర ఛైర్మన్ల అసంతృప్తి

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయానికి  పనుల కోసం రూ.20 లక్షల చొప్పున కేటాయించిన ప్రభుత్వం...పనుల గుర్తింపు, నిర్వహణ వంటి విషయాల్లో గ్రామాల్లో సర్పంచులు, నగరాలు, పట్టణాల్లో మేయర్‌, పుర ఛైర్మన్లను భాగస్వాములను చేయకపోవడంపై వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం కల్పించి తమను నిర్లక్ష్యం చేయడంపై ప్రథమ పౌరులు మండిపడుతున్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ బృందంలో ఎమ్మెల్యేతోపాటు పుర, నగరపాలక సంస్థల్లో కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీవోలను నోడల్‌ అధికారులుగా పెట్టిన ప్రభుత్వం...మేయర్‌, పుర ఛైర్మన్‌, సర్పంచులను నిర్లక్ష్యం చేసింది. ‘గడప గడపకు’ బృందంలో వీరికి ఎలాంటి భాగస్వామ్యం కల్పించలేదు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటయ్యాక  సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నుంచి పంపిణీ వరకు సచివాలయాల్లో ఉద్యోగులదే పైచేయి అయింది. ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖని తీసుకొచ్చింది. సచివాలయాల్లో ఉద్యోగులు కూడా సర్పంచులతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నామని పలువురు సర్పంచులు బాహాటంగానే వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. తాజాగా గ్రామాల్లో తాగునీరు, రహదారులు, కాలువలు, విద్యుత్తు సరఫరా మెరుగు పరిచేందుకు, ఇతర ముఖ్యమైన పనుల కోసం గ్రామ లేదా వార్డు సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున ఖర్చు చేసేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాల్లో సర్పంచుల ప్రస్తావనే లేదు.  ప్రజలతో నిత్యం ఉండి వారి సమస్యలు తెలుసుకునేది స్థానిక ప్రజాప్రతినిధులే. అలాంటి వారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు