‘మెగా’ ప్రాజెక్టుకు దగా

ప్రకృతి అందాల నడుమ ఎత్తయిన కొండలపై చూడచక్కని గృహ సముదాయం నిర్మించాలన్న ప్రతిపాదన మూలకు చేరింది. సుమారు అయిదేళ్ల కిందట ప్రయత్నాలు జరగ్గా.. తర్వాత ఎలాంటి పురోగతి లేదు.

Published : 26 Nov 2022 06:09 IST

విశాఖపట్నంలో కొండెక్కిన ఇళ్ల పథకం
యారాడ భారీ గృహ సముదాయ ప్రణాళికపై నీలినీడలు

విశాఖపట్నం(గాజువాక), న్యూస్‌టుడే: ప్రకృతి అందాల నడుమ ఎత్తయిన కొండలపై చూడచక్కని గృహ సముదాయం నిర్మించాలన్న ప్రతిపాదన మూలకు చేరింది. సుమారు అయిదేళ్ల కిందట ప్రయత్నాలు జరగ్గా.. తర్వాత ఎలాంటి పురోగతి లేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో పెదగంట్యాడ- యారాడ సమీప కొండపై ఏర్పాటు చేయతలపెట్టిన మెగా గృహ సముదాయ ప్రాజెక్టు బృహత్తర ప్రణాళికను ప్రస్తుతం అటకెక్కించారు. ప్రతిపాదించిన స్థలం ముళ్ల కంపలు, తుప్పలతో వృథాగా మారింది. ఈ కొండపై 266 ఎకరాల విశాలమైన భూముల్లో 26 వేల గృహాలు నిర్మించే బృహత్తర ప్రాజెక్టుకు 2017లో నాటి యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. సర్వే నంబరు-274లోని 536 ఎకరాల కొండ పోరంబోకు భూములను రెవెన్యూశాఖ వీఎంఆర్‌డీఏకు అప్పగించింది. అందులో 266 ఎకరాల్లో పీఎంఏవై- ఎన్టీఆర్‌ పట్టణ గృహ నిర్మాణ పథకం (అర్బన్‌) కింద గృహాలు నిర్మించేందుకు నిర్ణయించారు. నగరవ్యాప్తంగా గృహ పథకాల అమలుకు స్థలాల సమస్య ఉన్నందున జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నగరానికి దగ్గరగా ఉండే యారాడ కొండపై ఈ నిర్మాణాలకు ప్రతిపాదించారు. సమీపంలోనే భారీ సంఖ్యలో నేవీ క్వార్టర్లు ఉండడం.. కొండకు అగ్రభాగంలో మాత్రమే ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల పర్యావరణపరంగా ఇబ్బందులేవీ ఉండవని భావించారు. అప్పట్లోనే అంతా సిద్ధమైనా.. ప్రస్తుత ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడంతో చివరకు అది వృథా ప్రయాసగా మిగిలింది.  

అన్ని హంగులతో నిర్మించేలా..

పెదగంట్యాడ సమీప దిబ్బపాలెం నుంచి యాతపాలెం మీదుగా యారాడ తీరానికి ప్రత్యామ్నాయంగా నాటి వుడా అధికారులు ఘాట్‌రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొండపై బొటానికల్‌ గార్డెన్‌ నిర్మించాలని నిర్ణయించారు. దాని సమీపంలోనే గృహ నిర్మాణానికి అనువుగా ఉంటుందని అప్పట్లో గుర్తించారు. ఆర్డీఓ తేజ్‌భరత్‌, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పెదగంట్యాడ తహసీల్దార్‌ ఉమామహేశ్వరరావు, వీఎంఆర్‌డీఏ అధికారులు భూములను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. సర్వేయర్లను రంగంలోకి దింపి సుదీర్ఘంగా చర్చించారు. ‘జీప్లస్‌ త్రీ’ పద్ధతిలో గృహాల కోసం నెల రోజుల పాటు స్థలాలను చదును చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో మెగా ప్రాజెక్టు చేపట్టేలా సన్నాహాలు సాగాయి. తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రతిపాదన మూలకు చేరింది. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత అధికారులు, పాలకులు ఆసక్తి చూపకపోవడమే దీనికి కారణమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్‌ సిటీ ప్రతిపాదన వల్లనే ఈ ప్రాజెక్టు నిర్ణయం వాయిదా పడిందని అధికారులు చెబుతున్నారు. ఇదే కొండకు మరోవైపున పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించిన 6 వేల టిడ్కో ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు