Kakani: అందరూ వరి పండిస్తే ప్రభుత్వం కొనడం కష్టం: ఏపీ మంత్రి కాకాణి

వరి పండించిన వారే రైతు అనే ఆలోచన నుంచి రైతులు బయటకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

Updated : 04 Dec 2022 11:25 IST

వరి సాగు చేస్తేనే రైతు అన్నఆలోచన వీడాలి
అగ్రిటెక్‌ సదస్సులో  మంత్రి వ్యాఖ్య

గుంటూరు (జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: వరి పండించిన వారే రైతు అనే ఆలోచన నుంచి రైతులు బయటకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురిసి, సీజన్‌కు తగినట్లుగా సాగునీరు సరఫరా చేస్తుండటంతో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తున్నారన్నారు. ఈ పంటంతా ప్రభుత్వం కొనాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తితో పాటు ఇతర పంటలను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాం ఫాంలో అగ్రిటెక్‌ సదస్సును మంత్రి శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక వ్యవసాయ పరికరాలు, సాంకేతికత, నూతన వంగడాలను ప్రదర్శనలో పెట్టడంతో రైతులకు ఉపయోగపడతాయన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారుచేసిన వరి, మొక్కజొన్న వంగడాలు దేశంలో 75 శాతం మంది రైతులు వినియోగిస్తున్నారని, దీనికి కారకులైన శాస్త్రవేత్తలను అభినందించారు.  రాష్ట్రంలో పత్తి సాగు తగ్గిపోవడంతో తెలంగాణ నుంచి ముడి సరకు దిగుమతి చేసుకుంటున్నామని, దీనివల్ల రాష్ట్రం జీఎస్టీ కోల్పోతోందని అన్నారు. విద్యార్థులు ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ చదవడంతో ఉద్యోగాలు ఇప్పించాలంటూ వారి తల్లిదండ్రులు మంత్రులకు వినతిపత్రాలు ఇస్తున్నారన్నారు. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ చిన్న పని కూడా చేయలేకపోయారంటూ తమను నిష్ఠూరమాడుతున్నారని చెప్పారు. ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నూతనంగా డ్రోన్‌ టెక్నాలజీని వినియోగించి 10 పంటల్లో సేద్యం చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటికే  30 వేల ఎకరాల్లో డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నారని వివరించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని పొగడ్తల్లో ముంచెత్తారు. గోవర్ధన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా, ఎన్జీ రంగా వర్సిటీని.. నాగార్జున విశ్వవిద్యాలయంగా ఆమె పలుమార్లు ఉదహరించడం గమనార్హం. సమావేశంలో వ్యవసాయ మార్కెటింగ్‌, సహకార శాఖ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అసోచామ్‌ డైరెక్టరు ఎం.దినేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని