కేంద్రాన్ని చూసైనా నేర్చుకోరా?
పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా... ఉపాధి అవకాశాలు, రవాణా సదుపాయాలు మెరుగుపడాలన్నా... రహదారులు, రైల్వేల వంటి ప్రధాన మౌలిక వసతులు అత్యంత కీలకం.
మౌలిక వసతుల కల్పనపై జగన్ ప్రభుత్వానికి శ్రద్ధేది?
రైల్వేలు, రహదారులకు ఏటా కేటాయింపులు పెంచుతున్న కేంద్రం
రాష్ట్రంలో దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి
ఈనాడు, అమరావతి: పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా... ఉపాధి అవకాశాలు, రవాణా సదుపాయాలు మెరుగుపడాలన్నా... రహదారులు, రైల్వేల వంటి ప్రధాన మౌలిక వసతులు అత్యంత కీలకం. అందుకే కేంద్ర ప్రభుత్వం... వాటికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ, ఏటా నిధుల కేటాయింపులను పెంచుతోంది. 2023-24 బడ్జెట్‌లోనూ రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు, జాతీయ రహదారులకు రూ.1.62 లక్షల కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం మాత్రం దానికి పూర్తి భిన్నంగా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు తక్కువ నిధులను కేటాయిస్తోంది. వాటిని కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదు. ఏపీకి కేంద్రం మంజూరు చేసిన అరకొర ప్రాజెక్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, వాటా నిధుల్ని సమకూర్చకపోవడంతో ముందుకు సాగడం లేదు.
అవి రాచబాటలు... ఇవి అధ్వానదారులు
కేంద్రం జాతీయ రహదారులు, ఎకనమిక్ కారిడార్లు, ఇంటర్ కారిడార్లు, ఫీడర్ రోడ్లు, ఓడరేవులను అనుసంధానిస్తూ నిర్మించే రోడ్ల వంటివాటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. తాజా బడ్జెట్‌లో జాతీయ రహదారుల నిర్మాణానికే రూ.1,62,207 కోట్లు కేటాయించింది. 2021-22లో హైవేల నిర్మాణానికి రూ.57,081 కోట్లు ఖర్చు చేసింది. 2022-23 బడ్జెట్‌లో కేటాయింపులను రూ.1,34,015 కోట్లకు పెంచింది. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.1,41,606 కోట్లకు చేరింది.
రాష్ట్రం ప్రభుత్వం ఇలా...!
రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ నిర్వహణలో 46 వేల కి.మీ.ల రహదారులు ఉన్నాయి. వాటిని ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించాలి. అంటే సగటున ప్రతి సంవత్సరం సుమారు 9 వేల కి.మీ.ల రోడ్లను పునరుద్ధరించాలి. వైకాపా అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లూ రహదారుల పునరుద్ధరణ జరగలేదు.
ఆందోళనలపై చలనమే లేదు
విపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా, పత్రికలు, టీవీ ఛానళ్లలో ఎన్ని కథనాలు వచ్చినా, సామాజిక మాధ్యమాల్లో ప్రజలు దుమ్మెత్తిపోసినా ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి రూ.2 వేల కోట్ల రుణం తెచ్చి, 7,900 కి.మీ.ల రహదారుల్ని మాత్రం పునరుద్ధరించింది.
కిలోమీటరు రైల్వే లైన్ నిర్మాణమైనా జరగలేదు
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం కేటాయించే రైల్వే ప్రాజెక్టులే అరకొర. రాష్ట్ర భాగస్వామ్యంతో ప్రతిపాదించిన కీలక రైల్వే ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం తన వాటా నిధులివ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో... అవి ముందుకి కదలడం లేదు. తాము నిధులివ్వలేమని, భూసేకరణ మాత్రం చేసిస్తామని కేంద్రానికి రాష్ట్రం లేఖ రాయడంతో రైల్వేశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేసింది.
* నడికుడి-శ్రీకాళహస్తి మధ్య 309 కి.మీ. మేర కొత్తలైన్ 2011-12లో మంజూరైంది. ప్రస్తుత అంచనా విలువ రూ.2,700 కోట్లు. ఈ ప్రాజెక్టుకు భూమిని పూర్తిగా రాష్ట్రమే సేకరించి ఇవ్వడంతోపాటు నిర్మాణ వ్యయంలో 50% భరించాలి. గత ప్రభుత్వాల హయాంలో రూ.6 కోట్లు ఇచ్చారు.
* కడప-బెంగళూరు మధ్య 255 కి.మీ. కొత్తలైన్‌ను 2008-09లో మంజూరు చేశారు. ప్రస్తుతం దీని అంచనా విలువ రూ.2,849 కోట్లు. 50% ఖర్చు రాష్ట్రమే భరించాల్సి ఉండగా... గత ప్రభుత్వాల హయాంలోనే రూ.189.95 కోట్లు డిపాజిట్ చేశారు. కడప-పెండ్లిమర్రి మధ్య 21 కి.మీ. పూర్తయింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు నిలిచిపోయింది.
* కోటిపల్లి-నరసాపురం మధ్య 57.21 కి.మీల రైల్వేలైన్ 2000-01లో మంజూరైంది. రైల్వేకు రాష్ట్రం రూ.525 కోట్లు చెల్లించాలి. గత ప్రభుత్వాల హయాంలో రూ.2.69 కోట్లు ఇచ్చారు.
* అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కర్ణాటకలోని తుముకూరు వరకు 207 కి.మీ. కొత్తలైన్ నిర్మాణ ప్రాజెక్టు 2007-08లో మంజూరైంది. మన రాష్ట్రపరిధిలో 80 కి.మీ.లు ఉంది. ఏపీ వాటా కింద రూ.485 కోట్లు చెల్లించాల్సి ఉండగా, గత ప్రభుత్వాల హయాంలో రూ.260 కోట్లు ఇచ్చారు. రాయదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు 63 కి.మీ.లు పూర్తయింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక మిగతా నిధులివ్వకపోవడంతో ప్రాజెక్టు పూర్తవలేదు.
* రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానం కోసం... ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు, అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లె-నరసరావుపేట మధ్య... 106 కి.మీ.ల కొత్త రైల్వే లైన్‌ని రూ.2,679 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం మంజూరు చేసింది. దానిలో ఎంత వాటా సమకూరుస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నీతిఆయోగ్ కోరింది. దానిపైనా రాష్ట్రం స్పందించలేదు.
అమరావతిపై కక్షతో ప్రజలకు అన్యాయం
అమరావతిపై కక్షతో ప్రభుత్వం ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది. అనంతపురం నుంచి అమరావతి వరకు 384 కి.మీ.ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేని తెదేపా హయాంలో కేంద్రం మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం దానికి అడ్డుపుల్ల వేసింది. దాన్ని అమరావతి ఓఆర్‌ఆర్ వరకు కాకుండా, కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలో భాగంగా చిలకలూరిపేట వద్ద నిర్మిస్తున్న బైపాస్‌లో కలపాలని ప్రతిపాదించింది. దానికి ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించినా... దాన్ని మళ్లీ మార్చేసి శ్రీసత్యసాయి జిల్లాలోని కోడూరు నుంచి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం మీదుగా ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలని కోరింది. దీంతో అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదనపక్కకు వెళ్లిపోయింది.
* అమరావతితోపాటు విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తెనాలి పట్టణాల చుట్టూ 189 కి.మీ. మేర ఓఆర్‌ఆర్ నిర్మాణానికి తెదేపా హయాంలోనే కేంద్రం అంగీకారం తెలిపింది. భూసేకరణకు చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ పదేపదే కోరినా వైకాపా ప్రభుత్వం స్పందించలేదు. దానికి బదులు విజయవాడకు 46 కి.మీ.ల తూర్పు బైపాస్ చాలని కేంద్రానికి తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Movies News
SS Karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!
-
Sports News
Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్