మొక్కుబడి తంతుగా ఇంటర్న్‌షిప్‌ వ్యవహారం

ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న డిగ్రీ ఇంటర్న్‌షిప్‌ మొక్కుబడి తంతుగా మారింది. విద్యార్థుల చదువుకు..వారి ఉపాధికి సంబంధం లేకుండా ఏదో ఒక దాంట్లో ఇంటర్న్‌షిప్‌ కేటాయించేస్తున్నారు.

Published : 23 Mar 2023 05:50 IST

విద్యార్థుల చదువు, ఉపాధికి సంబంధం లేకుండానే కేటాయింపు
మార్కుల కోసం ప్రైవేటులో కొనుగోళ్ళు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న డిగ్రీ ఇంటర్న్‌షిప్‌ మొక్కుబడి తంతుగా మారింది. విద్యార్థుల చదువుకు..వారి ఉపాధికి సంబంధం లేకుండా ఏదో ఒక దాంట్లో ఇంటర్న్‌షిప్‌ కేటాయించేస్తున్నారు. యువత ఆసక్తినీ పట్టించుకోవడం లేదు. విద్యార్థులను సర్దుబాటు చేసేందుకు స్థానికంగా పరిశ్రమలు లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. చిన్నచిన్న బేకరీలు, హోటళ్లు, బ్యూటీపార్లర్లు, ఎంబ్రైడరీ, కుట్టు, అల్లికలు, మండల కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా ఒకటేమిటి ఏది కనిపిస్తే దాంట్లో ఇంటర్న్‌షిప్‌కు పంపిస్తున్నారు. ద్రవిడ వర్సిటీలో చదివే 25మంది బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సు విద్యార్థులను గూడుపల్లి ఎండీవో కార్యాలయానికి కేటాయించారు. బీబీఏ చదివే 35మందిని శాంతిపురం, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్‌ చదివే 64మందిని కుప్పం ఎంపీడీవో కార్యాలయాలకు పంపించారు. వీరికి ఏం నేర్పించాలో కార్యాలయం అధికారులకు అవగాహన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2020-21 నుంచి 10 నెలల ఇంటర్న్‌షిప్‌తో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఉన్నత విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు కళాశాలల్లో మూడేళ్లకు కలిపి 6,52,671మంది విద్యార్థులు ఉన్నారు. రెండు, మూడు సంవత్సరాలు చదువుతున్న వారే 3,89,866మంది ఉన్నారు. ఇంతమందికి రెండు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను విడతల వారీగా ఇప్పించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. దీంతో అయా జిల్లాల్లోని ప్రతి సంస్థను ఇంటర్న్‌షిప్‌కు కేటాయించేస్తున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు వెళుతున్నదీ లేనిదీ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో చాలామంది పని ప్రదేశానికి వెళ్లకుండానే ప్రాజెక్టు నివేదికలు కొనుక్కొని సమర్పించేస్తున్నారు.

మూడు విడతలుగా..

నాలుగేళ్ల డిగ్రీలో మొదటి ఏడాది పూర్తయిన తర్వాత వేసవి సెలవుల్లో రెండు నెలలు కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టు పూర్తి చేయాలి. రెండో ఏడాది పూర్తయిన తర్వాత సెలవుల్లో రెండు నెలలు రెండో ఇంటర్న్‌షిప్‌ చేయాలి. మూడో ఏడాదిలో ఐదు లేదా ఆరో సెమిస్టర్‌ మొత్తం ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. 2020-21లో చేరిన విద్యార్థులు ఇప్పుడు మూడో ఏడాదికి వచ్చారు. కొన్ని వర్సిటీలు ఐదో సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్‌కు పంపించగా.. మరికొన్ని ఆరో సెమిస్టర్‌లో పంపించేందుకు ప్రణాళికలు రూపొందించాయి. మూడు విడతలకు కలిపి విద్యార్థులకు 20 క్రెడిట్లు కేటాయిస్తారు. ఇవి పూర్తి చేస్తే విద్యార్థులకు డిగ్రీ పట్టా వస్తుంది. ఇంటర్న్‌షిప్‌ ప్రక్రియను సమన్వయం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు వేసింది.  అన్ని జిల్లాల్లోనూ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం.. పక్క ప్రాంతాలకు వెళ్తే రవాణా ఛార్జీలలు భారం కావడంతో సొంత జిల్లాలోనే ఇంటర్న్‌షిప్‌ ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎలాంటి పరిశ్రమలు లేవు. ప్రైవేటు కంప్యూటర్‌ సంస్థలూ లేవు. ఇలాంటి చోట బ్యూటీపార్లర్‌లు, గ్రామ, వార్డు సచివాలయాలు, మండల కార్యాలయాలు, బేకరీలు, కుట్లు, అల్లికల దుకాణాలు, చిన్నపాటి మార్కెట్లకు పిల్లలను పంపిస్తున్నారు. దాదాపు 8నెలలు ఇంటర్న్‌షిప్‌ చేసినా కొన్నిచోట్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. విద్యార్థుల సంఖ్య.. స్థానికంగా ఉండే పరిశ్రమలను పట్టించుకోకుండానే ఆర్భాటంగా దీన్ని తీసుకురావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఇవేం ఇంటర్న్‌షిప్‌లు..

ద్రవిడ విశ్వవిద్యాలయంలో బీకాం చదువుతున్న ఓ విద్యార్థికి స్థానికంగా ఒక చిన్న బేకరీలో ఇంటర్న్‌షిప్‌కు కేటాయించారు. అక్కడ నేర్చుకునేందుకు ఏమీ లేదంటూ విద్యార్థి వెళ్లడం మానేశారు. నిర్వాహకులకు రూ.5 వేలు ఇచ్చి హాజరైనట్లు ధ్రువీకరణ తీసుకున్నారు.

* విజయనగరంలోని మహారాజా(ఎ) కళాశాల విద్యార్థులకు రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ కోసం స్థానికంగా కంప్యూటర్‌ కోచింగ్‌ సెంటర్‌లో కేటాయించారు. ఐదు కంప్యూటర్లు ఉన్న ఈ కేంద్రానికి పదుల సంఖ్యలో విద్యార్థులను కేటాయించగా ఇక్కడ ఏమీ నేర్చుకోకపోగా.. ధ్రువపత్రం కోసం ఒక్కో విద్యార్థి రూ.800 నుంచి రూ.వెయ్యి చెల్లించాల్సి వచ్చింది.

* విజయనగరం జిల్లాకు చెందిన కొంతమందికి రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ కోసం ఫార్మ కంపెనీలకు కేటాయిస్తే ఈ తక్కువ సమయం నేర్చుకునేందుకు సరిపోదంటూ తిరస్కరించాయి.దీంతోవారు ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌ చేశారు.

* విజయవాడలో ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలకు చెందిన బీఎస్సీ (కంప్యూటర్స్‌) విద్యార్థినికి మొదట రెండు నెలలు ఆన్‌లైన్‌లో పైథాన్‌లో శిక్షణ ఇవ్వగా.. ఇప్పుడు ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కు సోలార్‌, బ్యూటీపార్లర్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని సూచించారు.

* గుంటూరు, శ్రీకాకుళంతోపాటు చాలా జిల్లాల్లో కొందరు విద్యార్థులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంటర్న్‌షిప్‌ చేయిస్తున్నారు. అక్కడికి వెళ్లిన వారికి ఏం పని చెప్పాలో కార్యదర్శులకు తెలియని పరిస్థితి.  పల్నాడు జిల్లాలో ఓ విద్యార్థినిని ఏఎన్‌ఎంతోపాటు ట్యాబ్‌లెట్ల పంపిణీకి పంపించారు.

* పల్నాడు జిల్లాలో ఇంటర్న్‌షిప్‌కు కేటాయించిన సంస్థలు నచ్చక బీకాం కంప్యూటర్స్‌ విద్యార్థులు ప్రైవేటుగా ట్యాలీ కోర్సు నేర్చుకుంటున్నారు.

* రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కంపెనీకి ఇంటర్న్‌షిప్‌ కోసం 60మంది విద్యార్థులను కేటాయించగా.. ఆ కంపెనీ వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.


విద్యార్థులతో వ్యాపారం..

ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్న్‌షిప్‌తో ఇప్పుడు బోగస్‌ ప్రాజెక్టుల వ్యాపారం భారీగా సాగుతోంది. ఇప్పటి వరకు ఇంజినీరింగ్‌కే పరిమితమైన నకిలీ ప్రాజెక్టు సమర్పణ ఇప్పుడు డిగ్రీకీ వ్యాపించింది. కొందరు బోగస్‌ ప్రాజెక్టులను కొనుగోలు చేసి, కళాశాలలకు సమర్పిస్తున్నారు. కొన్నిచోట్ల కళాశాలల యాజమాన్యాలే గంపగుత్తగా కొనుగోళ్లు చేస్తున్నాయి. ఇందుకోసం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. తిరుపతి జిల్లా కేంద్రంలో రెండు, మూడు సంస్థలు నకిలీ ప్రాజెక్టులను తయారు చేసి విక్రయిస్తున్నాయి. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లోనూ కొన్ని సంస్థలకు ఇదే వ్యాపారంగా మారింది. కొన్నిచోట్ల ప్రైవేటు కళాశాలలే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి, ప్రాజెక్టులు అందిస్తున్నాయి. ఇందుకు డబ్బులు వసూలు చేస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు