గుండె పగిలినవారికి వేయండి సార్‌.. స్టిక్కర్లు

‘వరద బాధితులను అక్కున చేర్చుకుని రేపటిపై భరోసా కల్పించాల్సింది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం భరోసానిచ్చిందా? ‘మీరందరూ నా కుటుంబసభ్యులే.

Updated : 21 May 2023 09:52 IST

సాయం హామీలు గట్టుకే పరిమితమా?
ఏడాదిన్నర దాటుతున్నా పలకరింపే లేదు..
అన్నమయ్య ప్రాజెక్టు ముంపు బాధితుల దైన్యంపై సామాజిక కార్యకర్త వివేక్‌ లంకమల ఆవేదన

ఈనాడు, అమరావతి: ‘వరద బాధితులను అక్కున చేర్చుకుని రేపటిపై భరోసా కల్పించాల్సింది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం భరోసానిచ్చిందా? ‘మీరందరూ నా కుటుంబసభ్యులే. ఆరంటే ఆరు నెలల్లోనే మీ జీవితాలను సాధారణ స్థితికి తెస్తా’ అని ముఖ్యమంత్రి స్వయంగా, బహిరంగంగా ప్రకటించాక అలాంటి ఆరు నెలలు మూడు గడిచినప్పటికీ అంటే ఏడాదిన్నర తర్వాత కూడా వరదనాటి రోజుల్లో బతికినట్టే, ఇంకా అంతకన్నా దారుణంగా బతుకుతున్నారంటే.. అసలు ప్రభుత్వమంటూ ఒకటుందా? ఆ వ్యవస్థకు ముఖ్యమంత్రే నాయకుడా? ఆయనే నాయకుడైతే మాటకు విలువుందా? అనే సంశయం కలిగిందంటే తప్పు నాది కాదు. ముమ్మాటికీ ఆ ప్రభుత్వానిది. ప్రభుత్వ అధినేతది’ అన్నమయ్య ప్రాజెక్టు వరద ముంపులో సర్వం కోల్పోయి దయనీయంగా బతుకుతున్న బాధితుల జీవితాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఓ యువకుడి ధర్మాగ్రహం ఇది. బద్వేలుకు చెందిన ఐటీ ఉద్యోగి, సామాజిక కార్యకర్త వివేక్‌ లంకమల ఇటీవల తన మిత్రులతో కలిసి వరద ముంపునకు గురైన పల్లెల్లో పర్యటించారు. వారి దయనీయ పరిస్థితిని చూసి చలించి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఫేస్‌బుక్‌లో పలు పోస్టులు పెట్టారు. ‘ఈనాడు’తోనూ అనుభవాలను పంచుకున్నారు. ఆ అనుభవాలు ఆయన మాటల్లోనే..!

చెవిటి ప్రభుత్వమనాలా?

‘ఎవరి కళ్లలోకి చూసినా అస్తిత్వాన్ని కోల్పోయిన బెదురుచూపులు.. సాయమందించడానికి వచ్చారేమోననే ఎదురుచూపులు.. వరద అనంతరం ఏడాదిన్నర తర్వాత కూడా వరద రోజుల్లో చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. వీళ్ల అవస్థలు చూసి ప్రభుత్వమెలాగూ నీడనిచ్చేట్టు లేదని తెలుసుకుని ఆ నీడను తామివ్వాలని అనుకుంటున్నాయేమో.. సీమ తుమ్మచెట్లు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. ‘ఇళ్లుంటే యట్టన్నా సావనీలే.. గుడారంలాగా వేసుకోవడానికి పట్టక్కూడా నోచుకోలేని బతుకులు మావి’ అని ఒక ముసలామె కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేని గుడ్డి ప్రభుత్వమనాలా? ఏడాదిన్నర తర్వాత కూడా వేరొకరి ఇంటి ముందర బందెరాకు తడికెల చాటున బతుకుతూ.. ‘అప్పుడేదో ఇబ్బందని వేసుకోనిచ్చాం. ఇంగ పోండి’ అంటూ ఆ ఇంటి ఇల్లాలు ఈసడించుకుంటున్నా అట్నే ఒరగబెట్టుకుని బతికే ముగ్గురు పిల్లల తండ్రి బాధను వినలేని చెవిటి ప్రభుత్వమనాలా? వీళ్ల షెల్టర్‌ కోసం వేసిన రేకులు మొత్తం గాలికెగిరిపోతే తిరిగి పెట్టాలనే ఆలోచనలేని చేతగాని ప్రభుత్వమనాలా?’

బేస్‌మెంట్‌, గోడలు కట్టడానికే ఏడాదిన్నర కావాలా?

‘తానా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ పది సెంట్లలో వేసిన తాత్కాలిక షెడ్లలో రేకులు అడ్డం పెట్టుకుని బాత్రూం అంత స్థలంలో 20, 30 కుటుంబాలు బతుకుతున్నాయంటే ఎంత దారుణం? ‘మా పిల్లోనికి పెంచలకోనలో పుట్టెంటికెలు తీపియ్యాల సార్‌. ఏదన్నా సాయం చెయ్యండి’ అంటే.. ఇస్తున్న వంద రూపాయలకు కూడా ఎంతో అపురూపంగా టవల్‌ చాచేడంటే ఎంత దీనస్థితి? ఇవన్నీ అక్కడ మేమున్న అరగంటలో ప్రత్యక్షంగా చూసినవి. ఇక చూడని మౌనవేదనలెన్నో. ఊహకూ అందలేదు. ఇటీవలే ముఖ్యమంత్రిగారు గొప్ప సంక్షేమానికి గుర్తుగా ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ అంటూ ఇంటింటికీ స్టిక్కర్లు అతికించే ప్రోగ్రాం మొదలు పెట్టినట్టున్నారు. చెయ్యేటి వరద పల్లెలకు కూడా వెయ్యండి సార్‌ స్టిక్కర్లు. మొండిగోడలకు, గాలికెగిరే పట్టలకు, రాళ్లు వేలాడకట్టిన డేరాలకు దేన్నీ వదలకుండా వెయ్యండి. అంతకంటే ముఖ్యంగా సాయమందక కారిన కన్నీళ్లకు, సాయమందకపోదా అని నిరీక్షిస్తున్న గుండెలకు బలంగా వెయ్యండి. నేను ఇస్తున్నాను మీరు తీసుకోండి అని విసిరేస్తే సాయం విలువ అర్థమవ్వదు సీఎం సార్‌. మహా అయితే గుమ్మం వద్దకు చేరుతావ్‌. అదే అవసరమైనవాడికి బాసటగా నిలిచి చూడండి.. గుండెల్లో పెట్టుకుంటారు. అదీ ఒకరు అందించే నిజమైన నమ్మకం. జగనన్న కాలనీల్లో శాశ్వత ఇళ్లు కట్టిస్తున్నామనే ఆత్మవంచన బుకాయింపులు వద్దు. అవసరమైనప్పుడు అందని సాయం వ్యర్థం. అయినా సెంటున్నర ఇంటికి బేస్‌మెంట్‌, గోడలు కట్టడానికే ఏడాదిన్నర కావాలా? ఒక్కటైతే నిజం.. చెయ్యేటి వరద పల్లెలకు సాయం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.’

ఆ భూములు దేనికీ పనికిరావు..!

‘అక్కడి పల్లెల్లో ఎక్కువ మంది సన్న చిన్నకారు రైతులే. వారి భూముల్లో వేసిన ఇసుక మేటల్ని తొలగించడానికే ఒక్కొక్కరికి రూ.30-40 వేల ఖర్చవుతుంది. ఇసుకతోపాటు భూమి పైపొర పోతోంది. భూసారం కోల్పోతోంది. మళ్లీ ఆ భూముల్లోకి సారం చేరి పంటలు పండాలంటే ఐదారేళ్లు పడుతుంది. చిన్న రైతులు అంతకాలం చూడలేరు. చివరకు వాళ్లు వ్యవసాయానికే దూరమవుతారు. ఉపాధి మరో పెద్ద సమస్య. ఒక సీజన్‌లో పంటలు వేయకపోతే రైతులతోపాటు వాటిపై ఆధారపడ్డ అనేక కుటుంబాలకు ఉపాధి ఉండదు. వారి సమస్య సీఎం దృష్టికి రాలేదనుకోవడానికో, ఆయన మరిచిపోయారనుకోవడానికో లేదు. ఎందుకంటే అది ఒకరిద్దరి సమస్య కాదు. కొన్ని ఊళ్లకు సంబంధించిన విషాదం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని