NEET UG 2023 Results: నీట్‌ చక్రవర్తి.. శ్రీకాకుళం కుర్రాడికి దేశంలోనే ప్రథమ ర్యాంక్‌

నీట్‌ యూజీ పరీక్షలో శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి ప్రథమ ర్యాంకును సాధించి సత్తా చాటాడు. తమిళనాడు విద్యార్థి జె.ప్రభంజన్‌తో కలిసి ఈ ర్యాంకును పంచుకున్నాడు.

Updated : 14 Jun 2023 06:27 IST

తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌కు సైతం
తెలంగాణకు చెందిన రఘురామిరెడ్డికి 15వ ర్యాంకు
టాప్‌-50 ర్యాంకుల్లో ఏడుగురు తెలుగు విద్యార్థులు

ఈనాడు, దిల్లీ, అమరావతి: నీట్‌ యూజీ పరీక్షలో శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి ప్రథమ ర్యాంకును సాధించి సత్తా చాటాడు. తమిళనాడు విద్యార్థి జె.ప్రభంజన్‌తో కలిసి ఈ ర్యాంకును పంచుకున్నాడు. మంగళవారం రాత్రి నీట్‌ యూజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ మే 7న దేశవ్యాప్తంగా 499 నగరాల్లోని 4,097 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 20,38,596 మంది హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల్లో 11,45,976 మంది (56.12%) అర్హత సాధించారు. తెలంగాణ నుంచి పరీక్ష రాసిన 72,842 మందిలో 42,654 (58.55%), ఏపీ నుంచి హాజరైన 68,578 మందిలో 42,836 (62.46%) మంది అర్హత సాధించారు. టాప్‌-50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు ఏడుగురు ఉండగా, వారిలో అయిదుగురు ఆంధ్రప్రదేశ్‌ వారే. వీరిలో వరుణ్‌ చక్రవర్తి (1, ఆంధ్రప్రదేశ్‌), కాంచాని గేయంత్‌ రఘురాంరెడ్డి (15, తెలంగాణ), యల్లంపల్లి లక్ష్మీ ప్రవర్ధన్‌రెడ్డి (25, ఆంధ్రప్రదేశ్‌), వంగీపురం హర్షిల్‌సాయి (38, ఆంధ్రప్రదేశ్‌), కణి యశశ్రీ (40, ఆంధ్రప్రదేశ్‌), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి (45, ఆంధ్రప్రదేశ్‌), జాగృతి బోడెద్దుల (49, తెలంగాణ) ఉన్నారు.

తెలుగులో రాసింది 1295 మందే

మొత్తం 13 భాషల్లో నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్షను ఇంగ్లిష్‌లో అత్యధికంగా 16,72,914 మంది, హిందీలో 2,76,180 మంది రాయగా, తెలుగులో 1,295 మందే రాశారు. హిందీ, ఇంగ్లిష్‌ తర్వాత గుజరాతీ (53,027), బెంగాలీ (43,890), తమిళం (30,536)లో అత్యధికులు పరీక్ష రాశారు.

నీట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

జాతీయ ర్యాంకుల్లో మనవాళ్లు

  • మహిళల కేటగిరీలో కణి యశశ్రీ 6వ ర్యాంకు (జాతీయ ర్యాంకు 40), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి 9 (జాతీయ ర్యాంకు 45), జాగృతి బోడెద్దుల 10 (జాతీయ ర్యాంకు 49), గంధమనేని గిరివర్షిత 11 (జాతీయ ర్యాంకు 51), లక్ష్మీరష్మిత గండికోట 12 (జాతీయ ర్యాంకు 52), గిలడ ప్రాచి 17 ర్యాంకు (జాతీయ ర్యాంకు 65)వ సాధించారు.
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో మొదటి ర్యాంకు వై.లక్ష్మీప్రవర్ధనరెడ్డి (జాతీయర్యాంకు 25)
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 5వ ర్యాంకు తెల్లావరుణ్‌రెడ్డి (జాతీయ ర్యాంకు 105)
  • ఎస్సీ విభాగంలో 2వ ర్యాంకు యశశ్రీ (జాతీయ ర్యాంకు 40)
  • ఎస్సీ విభాగంలో 7వ ర్యాంకు కొల్లాబత్తుల ప్రీతం సిద్ధార్థ (జాతీయ ర్యాంకు 299)
  • ఎస్టీ విభాగంలో మొదటి ర్యాంకు   ఎం.జ్యోతిలాల్‌ చవాన్‌ (జాతీయ ర్యాంకు 119)
  • ఎస్టీ విభాగంలో 3వ ర్యాంకు లావుడ్య మధు బాలాజీ (జాతీయ ర్యాంకు 445)

కిందటేడాది కంటే పెరిగిన విద్యార్థులు

నీట్‌లో కిందటేడాది 40,344 మంది, ఈ సారి 42,836 మంది అర్హత సాధించారని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్‌ ఉషారెడ్డి తెలిపారు. నీట్‌ను తెలుగు మాధ్యమంలో రాసేందుకు 1,295 మంది దరఖాస్తు చేశారు.

ఏపీలో సీట్ల వివరాలు

ప్రాథమిక సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రానున్న అయిదు వైద్య కళాశాలల్లోని 750 సీట్లతో కలిపితే ప్రభుత్వ వైద్యకశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లు 2,785 వరకు ఉన్నాయి. ఇందుకు అదనంగా తిరుపతిలోని పద్మావతి మెడికల్‌ కాలేజీ ఫర్‌ వుమెన్‌లో 175 సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలలోని సీట్ల భర్తీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారానే జరుగుతుంది. అలాగే 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,000 వరకు సీట్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని