Polavaram: పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్‌!

పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ను కొత్తగా పూర్తిస్థాయిలో నిర్మించాలనే ఆలోచన వైపు కేంద్రం మొగ్గు చూపుతోంది. 2020లో వచ్చిన భారీ వరదలకు డి వాల్‌ కొంత దెబ్బతింది. దాని సామర్థ్యం తేల్చేందుకు జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం అధ్యయనం చేసింది.

Updated : 05 Jul 2023 09:44 IST

పాక్షికంగా నిర్మించే బదులు అదే మంచిదా అంటూ తర్జనభర్జనలు
సమయం, ఖర్చూ ముఖ్యం కాదు
నిర్మాణ భద్రతే ప్రధానం అంటున్న కేంద్రం
తుది నిర్ణయం కేంద్ర జలసంఘానిదే

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ను కొత్తగా పూర్తిస్థాయిలో నిర్మించాలనే ఆలోచన వైపు కేంద్రం మొగ్గు చూపుతోంది. 2020లో వచ్చిన భారీ వరదలకు డి వాల్‌ కొంత దెబ్బతింది. దాని సామర్థ్యం తేల్చేందుకు జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం అధ్యయనం చేసింది. పరీక్షలు నిర్వహించి, పాత డి వాల్‌ కొద్ది మేర మాత్రమే ధ్వంసమయిందని తేల్చింది. దెబ్బతిన్నంత మేర ఎక్కడికక్కడ చిన్నచిన్నగా ‘యు’ ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించి, దాన్ని ప్రస్తుత డయాఫ్రం వాల్‌తో అనుసంధానించాలని జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం, పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ సంయుక్తంగా నిర్ణయించాయి. పోలవరంలో గైడ్‌బండ్‌ కుంగిన నేపథ్యంలో ఈ నిర్ణయంపై కేంద్ర జల్‌శక్తి శాఖలో మళ్లీ అంతర్గత చర్చ ప్రారంభమయింది. పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల దిల్లీలో జరిగిన రెండు సమావేశాల్లోనూ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ వద్ద సోమవారం నిర్వహించిన సమావేశంలోనూ డయాఫ్రం వాల్‌ అంశంపై చర్చ జరిగింది. కొత్తగా పూర్తి స్థాయి డయాఫ్రం వాల్‌ నిర్మిస్తే చాలా ఖర్చవుతుందని, ఎక్కువ సమయం పడుతుందని అంటే.. ఆ కోణంలో ఆలోచించవద్దని కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి సూచించారు. అన్నింటికన్నా డ్యాం భద్రతే ముఖ్యమని, ఆ దిశగానే ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆదివారం దిల్లీలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

డయాఫ్రం వాల్‌ ఎక్కడెక్కడ దెబ్బతింది?

1) గ్యాప్‌-1: ప్రధాన డ్యాం నిర్మించే గ్యాప్‌-1 ప్రాంతంలో డయాఫ్రం వాల్‌ను ఈ మధ్యే 393 మీటర్ల మేర నిర్మించారు. వరదల తర్వాతే నిర్మాణం పూర్తయినందున దానికి నష్టమేమీ సంభవించలేదు.

2) గ్యాప్‌-2: జి.కొండ తర్వాత కుడివైపు ఛానల్‌ 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకు మొత్తం 1,396 మీటర్ల మేర డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని 2018 నాటికే పూర్తి చేశారు. ఇది అక్కడక్కడా ధ్వంసమైందని ఎన్‌హెచ్‌పీసీ తేల్చింది.

* ఎడమ చేతి వైపు ప్రధాన డ్యాం నిర్మించే చోట భారీ వరదలకు పెద్ద ఎత్తున కోత ఏర్పడింది. డయాఫ్రం వాల్‌ కూడా 175 మీటర్ల నుంచి 360 మీటర్ల వరకు (185 మీటర్లు) ధ్వంసమయింది.

* రెండో గ్యాప్‌లోనే 480- 510 మీటర్ల మధ్య మరో 30 మీటర్ల మేర దెబ్బతింది.

* రెండో గ్యాప్‌లోనే ఛానల్‌ 950 మీటర్ల నుంచి 1020 మీటర్ల వరకు దాదాపు 70మీటర్ల మేర ధ్వంసమయింది.

* కుడి వైపున కూడా పెద్ద ఎత్తున గోదావరి గర్భం కోత పడింది. 200 మీటర్లు ధ్వంసమయింది.

* ఎడమ, కుడి వైపున భారీ వరదలకు కోతపడ్డ ప్రాంతంలో అటూ ఇటూ కలిపి దాదాపు 385 మీటర్ల మేర డయాఫ్రం వాల్‌ ధ్వంసమయింది. మధ్యలో మరో 100 మీటర్ల మేర దెబ్బతింది.

* ఇది కాకుండా గ్యాప్‌-2 డయాఫ్రం వాల్‌లోనే 363 మీటర్ల ఛానల్‌ నుంచి 1,035 మీటర్ల వరకు దాదాపు 672 మీటర్ల మేర పైభాగంలో 5 మీటర్ల మేర దెబ్బతింది.

* అది కాకుండా 672 మీటర్ల మేర పైభాగంలో దాదాపు 5 మీటర్ల లోతున అంతా దెబ్బతిందని.. అదంతా సరిదిద్దుకోవాల్సి ఉంటుందని ఈ పరీక్షల్లో తేలింది.

* దెబ్బతిన్నంత మేర ఎక్కడికక్కడ చిన్నచిన్నగా ‘యు’ ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఆ చిన్న డి వాల్‌లను ప్రస్తుత డయాఫ్రం వాల్‌తో అనుసంధానించాలని మార్చి నెలలో నిర్ణయించారు.

తాజాగా సందేహాలు

దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ స్థానంలో పాక్షిక నిర్మాణం సరిపోతుందని మార్చి నెలలో నిర్ణయించినా ఇప్పుడు దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్షిక డయాఫ్రం వాల్‌ కొత్తగా నిర్మించి, పాత డి వాల్‌తో అనుసంధానించడం సాధ్యమేనా అని కేంద్ర జల్‌శక్తి శాఖ సందేహిస్తోంది. గైడ్‌బండ్‌ కుంగిన నేపథ్యంలో డి వాల్‌ నిర్ణయంపై తిరిగి చర్చలు ప్రారంభించారు. అన్నింటికన్నా డ్యాం భద్రతే ముఖ్యమని.. దాన్ని దృష్టిలో ఉంచుకునే నిర్ణయించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దీనిపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ స్పష్టం చేశారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటే కుదరదని, సాంకేతికంగా ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర జలసంఘానిదే తుది బాధ్యతని తేల్చి చెప్పారు. డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ నిర్ణయం తీసుకుందని, తమకు సంబంధం లేదని అనడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. అన్నింటినీ సమన్వయం చేసుకునేలా పోలవరం అథారిటీ బాధ్యత వహించాలనే సూచనలూ వచ్చాయి. ఆదివారం దిల్లీలో నిర్వహించే సమావేశంలో కేంద్ర సంస్థలతో పాటు ఏపీ జలవనరులశాఖ, మేఘా, బావర్‌ కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ, ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు పాల్గొంటారు. గైడ్‌బండ్‌ వైఫల్యంతోపాటు డి వాల్‌ నిర్మాణంపై కీలకంగా చర్చ జరగనుంది.


ఏమిటీ డయాఫ్రం వాల్‌?

పోలవరంలో రాతి, మట్టితో గోదావరికి అడ్డంగా దాదాపు 2.5 కిలోమీటర్ల మేర డ్యాం నిర్మించనున్నారు. దీన్ని నదీ గర్భం నుంచి కడుతూ వస్తారు. నదీగర్భంలో డ్యామ్‌ దిగువన నీటి ఊట చేరకుండా ఉండాలి. దిగువన ఊరే నీరు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లకుండా చూసేదే డయాఫ్రం వాల్‌. ‘బావర్‌’ అనే విదేశీ కంపెనీ గోదావరి గర్భంలో దిగువన ఎక్కడ రాయి ఉందో అక్కడి వరకు ప్లాస్టిక్‌ కాంక్రీటుతో డయాఫ్రం వాల్‌ నిర్మించింది. పోలవరంలో గ్యాప్‌-1లో 584.5 మీటర్ల మేర, గ్యాప్‌-2 లో 1750 మీటర్ల మేర ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మించాల్సి ఉంది. ఈ రెండింటి మధ్యలో 584.5 మీటర్ల వెడల్పున ఎత్తయిన జి.కొండ ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని