EPFO - Higher EPS: అధిక పింఛను అర్హులకు ఊరట

అధిక పింఛనుకు అర్హత ఉన్నవారికి ఈపీఎఫ్‌వో ఊరటనిచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌)లో జమ చేయాల్సిన బకాయిలపై వడ్డీ భారాన్ని తగ్గించింది.

Updated : 11 Jul 2023 08:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: అధిక పింఛనుకు అర్హత ఉన్నవారికి ఈపీఎఫ్‌వో ఊరటనిచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌)లో జమ చేయాల్సిన బకాయిలపై వడ్డీ భారాన్ని తగ్గించింది. బకాయిలను మూడు నెలల్లోగా ప్రతి నెలా 24 శాతం చొప్పున వడ్డీ సహా చెల్లించాలని నెల క్రితం వరకు జారీ చేసిన డిమాండ్‌ నోటీసుల్లో పేర్కొంది. తాజాగా దీన్ని 8 శాతానికి తగ్గించింది. ఈపీఎఫ్‌ ఖాతాలో నిల్వపై భవిష్యనిధి సంస్థ చెల్లిస్తున్న వడ్డీ తరహాలోనే బకాయిలపైనా వసూలు చేయాలని నిర్ణయించింది. డిమాండ్‌ నోటీసులో పేర్కొన్న గడువులోగా బకాయిలు చెల్లించాలని..  లేకుంటే అధిక పింఛను ఉమ్మడి ఆప్షన్‌పై ఆసక్తి లేదని భావిస్తూ దరఖాస్తును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది.

నెల క్రితం 24 శాతం చొప్పున..

హైదరాబాద్‌కు చెందిన ఓ ఉద్యోగి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తూ అత్యున్నత పదవిలో పదవీ విరమణ చేశారు. ఈపీఎఫ్‌వో అధిక పింఛనుకు దరఖాస్తు చేయగా ఆమోదం లభించింది. దరఖాస్తుకు ఆమోదం లభించిన రోజు (2023 మే 31) నాటికి ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్‌) బకాయి రూ.17,69,290గా ఈపీఎఫ్‌వో లెక్కకట్టింది. దీన్ని చెల్లించేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఇందులోని మొదటి నెలలో చెల్లిస్తే సాలీనా 24 శాతం వడ్డీ చొప్పున రూ.18,04,856 చెల్లించాలి. రెండో నెలలో అయితే రూ.18,52,278, మూడో నెలలో రూ.19,11,555 చెల్లించాలంటూ నోటీసు పంపించింది. ఈ లెక్కన మూడో నెలలో అయితే సుమారు 32 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా ఉందన్న తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని ఈపీఎఫ్‌వో తగ్గించింది.

ప్రస్తుతం ఇలా..

ఓ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అధిక పింఛను కోసం చేసిన దరఖాస్తు జూన్‌ 16న ఆమోదం పొందింది. అతనికి అందుతున్న వాస్తవిక అధిక వేతనంపై ఈపీఎస్‌కు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీ సహా (2014 సెప్టెంబరు 1 వరకు 8.33 శాతం వడ్డీ, సెప్టెంబరు 1 తరువాత సర్వీసుకు 8.33 శాతంతో పాటు అదనంగా 1.16 శాతం కలిపి) లెక్కించింది. జులై 31లోగా చెల్లిస్తే రూ.8,47,497, రెండో నెలలో (ఆగస్టు 31లోగా) చెల్లిస్తే 8 శాతం వడ్డీ చొప్పున రూ.8,53,100, మూడో నెలలో (సెప్టెంబరు 31లోగా) చెల్లిస్తే రూ.8,58,704 కట్టాలని సూచించింది. ఇలా తాజాగా జారీ చేస్తున్న డిమాండ్‌ నోటీసుల్లో వడ్డీ భారాన్ని ఏడాదికి 24 నుంచి 8 శాతానికి తగ్గించింది.

నిధుల బదిలీకి మరోసారి అంగీకారం చెప్పాలి

ఈపీఎస్‌ డిమాండ్‌ నోటీసు మేరకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఉద్యోగుల భవిష్యనిధి ఖాతా నుంచి మళ్లించేందుకు దరఖాస్తుదారులు ఇప్పటికే ఆన్‌లైన్లో అంగీకారం తెలిపారు. అయితే దాని ప్రకారం నేరుగా నిధులు బదిలీ చేయకుండా.. డిమాండ్‌ నోటీసు జారీ చేసిన తరువాత మరోసారి అంగీకారం చెప్పాలని ఈపీఎఫ్‌వో సూచిస్తోంది. భవిష్యనిధి ఖాతాలో తగినన్ని నిధులుంటే.. ఉద్యోగి అంగీకారంతో వాటిని ఈపీఎస్‌కు మళ్లిస్తారు. నిధుల్లేకుంటే స్థానిక ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ వ్యవస్థ లేదా ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ పేరిట డీడీ తీసి పంపించాలి. నిర్ణీత గడువులోగా ఈపీఎస్‌ బకాయిలు చెల్లించాలని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. గడువులోగా బకాయిలు చెల్లించకుంటే దరఖాస్తుపై పీఎఫ్‌ కమిషనర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని