EPFO - Jagan: పింఛను ఇచ్చేది ఈపీఎఫ్‌వో.. క్షీరాభిషేకాలు సీఎం జగన్‌కి..!

ఆర్టీసీ ఉద్యోగుల్లో ఒకరికి అధిక పింఛను ఖరారు చేస్తూ గత నెలలో ఈపీఎఫ్‌వో ఆమోద పత్రాన్ని ఇస్తే.. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోల్లో అధికారులు సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు.

Updated : 19 Jul 2023 08:28 IST

ఆర్టీసీ డిపోల్లో విచిత్రం.. నవ్వుకుంటున్న ఉద్యోగులు

ఈనాడు, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల్లో ఒకరికి అధిక పింఛను ఖరారు చేస్తూ గత నెలలో ఈపీఎఫ్‌వో ఆమోద పత్రాన్ని ఇస్తే.. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోల్లో అధికారులు సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి చూసి ఉద్యోగులు నవ్వుకుంటున్నారు. ఉద్యోగి వాటా చెల్లిస్తే.. ఈపీఎఫ్‌ సంస్థ అధిక పింఛను ఇస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కాకముందు నుంచే పీఎఫ్‌ చెల్లిస్తున్నారు. అధిక పింఛను ఖరారు చేయడంలోనూ రాష్ట్రం ప్రమేయమేమీ లేదు. అయినా.. కృతజ్ఞతగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేయడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్వయంగా డిపో మేనేజర్లే కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. అధిక పింఛను ఖరారు, ప్రభుత్వంలో విలీనమయ్యాక ప్రతినెలా జీతాలకు ఇబ్బందిలేకుండా చూడటం, కారుణ్య నియామకాలు చేపట్టడంతో క్షీరాభిషేకాలు చేస్తున్నట్లు ఆయా కార్యక్రమాల్లో డిపో మేనేజర్లు పేర్కొంటున్నారు. 

అమాత్యుడు చెప్పారు.. అధికారులు పాటించారు

‘ఆర్టీసీ ఉద్యోగులకు వివిధ రూపాల్లో ప్రభుత్వం మేలు చేస్తోంది. ఇది ఉద్యోగుల్లోకి బలంగా తీసుకెళ్లాలి. వారంతా సీఎంకు కృతజ్ఞత చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది’ అని ఇటీవల ఓ అమాత్యుడు ఆర్టీసీ ఉన్నతాధికారుల వద్ద అన్నట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు ఈ క్షీరాభిషేకాలు తలపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలాపురం, గూడూరు, వెంకటగిరి తదితర డిపోల్లో నిర్వహించారు. గూడూరు డిపోలో టపాసులు సైతం పేల్చారు. అన్ని ఆర్టీసీ సంఘాల నేతలు ఇందులో పాల్గొనాలని డిపో మేనేజర్లు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని