Viveka Murder Case: ఎంపీ టికెట్‌ షర్మిల, విజయమ్మల్లో ఎవరో ఒకరికన్న వివేకా

గత సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ విజయమ్మ, షర్మిలలో ఎవరో ఒకరికి వస్తుందని, దీనిపై జగన్‌తో మాట్లాడినట్లు వివేకా వెల్లడించారని సింహాద్రిపురం మండల నేత కొమ్మా శివచంద్రారెడ్డి ఏప్రిల్‌ 26న సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు.

Updated : 25 Jul 2023 09:58 IST

అవినాష్‌, భాస్కరరెడ్డిలతో పనిచేయలేకపోతున్నానని చెప్పా
వివేకా హత్య కేసులో కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలం

ఈనాడు, హైదరాబాద్‌: గత సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ విజయమ్మ, షర్మిలలో ఎవరో ఒకరికి వస్తుందని, దీనిపై జగన్‌తో మాట్లాడినట్లు వివేకా వెల్లడించారని సింహాద్రిపురం మండల నేత కొమ్మా శివచంద్రారెడ్డి(Komma Siva Chandra Reddy) ఏప్రిల్‌ 26న సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. అందులో వివరాలు ఇలా.. ‘‘వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కరరెడ్డిలతో పని చేయలేకపోతున్నానని, అందుకే పార్టీ వదిలి వెళుతున్నట్లు వివేకాకు చెప్పాను.. పార్టీ వదిలి వెళ్లవద్దని, తన కొడుకు లాంటి వాడివని, తన మద్దతు ఉంటుందని చెప్పడంతో పాటు ఎంపీ టికెట్‌ అవినాష్‌కు రాదని ఆయన అన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌ అవినాష్‌కు వస్తుందని చెప్పారు.’’ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా గతంలో తెదేపాలో ఉండగా శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసినా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్‌ 26న మరోసారి నమోదుచేసింది. ఈ వాంగ్మూలాన్ని అవినాష్‌ ముందస్తు బెయిలు పిటిషన్‌ విచారణ సందర్భంగా తమ రహస్య సాక్షిగా పేర్కొంటూ సీబీఐ హైకోర్టుకు అందజేసింది. ఎంపీ టికెట్‌ అవినాష్‌రెడ్డికి ఇవ్వట్లేదని వివేకా చెప్పారనడానికి, అవినాష్‌కు ఎంపీ టికెట్‌ ఇవ్వడం వివేకాకు ఇష్టం లేదని చెప్పడానికి తెలంగాణ హైకోర్టుకు ఈ వాంగ్మూలాన్ని అందజేసింది. వైకాపా ఏర్పాటు నుంచి 2018 అక్టోబరు 1 వరకు తాను వైకాపా సింహాద్రిపురం మండల కన్వీనర్‌గా కొనసాగినట్లు శివచంద్రారెడ్డి చెప్పారు. పార్టీనుంచి వెళ్లిపోతున్నానని తెలిసి అదే రోజు సాయంత్రం ఎర్ర గంగిరెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, కొమ్మా శివశంకర్‌రెడ్డి, ఇనయతుల్లాలతో కలిసి వివేకా తన ఇంటికి వచ్చారన్నారు. 2019లో సిట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని