Polavaram Project: పోలవరం ప్రాజెక్టు లోపాల లోతుల్లోకి కేంద్రం

పోలవరం ప్రాజెక్టులో తాజాగా ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై   కేంద్రం ఒక స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Updated : 01 Sep 2023 10:58 IST

వరుసగా ఎదురవుతున్న సవాళ్లు.. పరిష్కార మార్గాలపై దృష్టి
అంతా పకడ్బందీగా సాగేందుకు ప్రణాళిక
త్వరలో సంయుక్త భేటీ

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో తాజాగా ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై   కేంద్రం ఒక స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కేంద్రజల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్‌ ఆధ్వర్యంలో ఈ అంశంపై ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. జాతీయ ప్రాజెక్టు పోలవరంలో నిర్మాణ క్రమం, ప్రగతి సరైన మార్గంలో లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కేంద్ర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నిర్మాణ ఏజన్సీ వైపు వేలు చూపుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర అధికారులు నిర్ణయాల ఆలస్యంపై ప్రశ్నిస్తున్నారు. స్పిల్‌వేపై ఒత్తిడి లేకుండా నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగిపోయింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు నిర్మించినా సీపీజే ప్రధాన డ్యాం ప్రాంతాన్ని వరద ముంచెత్తింది.

అంతకుముందు ఎగువ కాఫర్‌ డ్యాం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వరద ఉధృతికి ప్రధాన డ్యాం ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది. పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గైడ్‌బండ్‌ కుంగిపోయిన నేపథ్యంలో బాధ్యులను గుర్తించాలని కేంద్ర మంత్రి ఆదేశించినా ఆ నిర్ణయాలు జరగలేదు. జాతీయ ప్రాజెక్టులో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లకపోతే ప్రమాదమనే ఆందోళనలతో కేంద్ర జల్‌శక్తి పెద్దలు కార్యాచరణకు నడుం బిగించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్‌ నేతృత్వంలో ఇందుకు కసరత్తు సాగుతోంది. కేంద్రం సంస్థలతో ఆయన అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, వ్యాప్కోస్‌, సీఎంఎస్‌ఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ మెటీరియల్‌ అండ్‌ రీసెర్చి స్టేషన్‌) వంటి సంస్థలతో ఆయన సమావేశమయ్యారు.

ప్రతి ఒక్కరితోను విడిగాను మాట్లాడుతున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర సంస్థలను సమన్వయం చేస్తోంది. వ్యాప్కోస్‌ నేరుగా నాణ్యత పర్యవేక్షిస్తోంది. సీఎంఎస్‌ఆర్‌ఎస్‌ కట్టడాలకు సంబంధించిన అవసరమైన పరిశోధనలు చేసి నివేదికలు ఇస్తోంది. నాణ్యత నియంత్రణ సంస్థ ప్రతినిధులు కూడా పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలోనే ఉంటున్నారు. ఇంత పర్యవేక్షణ ఉన్నా ఎందుకు లోపాలు తలెత్తుతున్నాయనే ప్రధాన ప్రశ్న ఆధారంగా పరిష్కార మార్గాలు వెదికే అన్వేషణ సాగుతోంది. సెప్టెంబరు 10 నాటికి ఈ కసరత్తు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.


రాష్ట్ర అధికారులతో త్వరలోనే భేటీ

నివేదిక సిద్ధమయ్యేలోపు వెదిరె శ్రీరామ్‌ రాష్ట్ర జలవనరులశాఖ, పోలవరం అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర సంస్థలు, రాష్ట్ర అధికారులు, నిర్మాణ ఏజెన్సీలతో కీలక సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. కేంద్రజల్‌శక్తిశాఖ మంత్రితో పాటు, కార్యదర్శి, సలహాదారు తదితర ముఖ్యులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. పోలవరంలో స్పష్టమైన బాధ్యతల బదలాయింపునకు ఆ సమావేశం కీలకం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని