Viveka murder case: వివేకా హత్య కుట్ర ఆ ముగ్గురిదే

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డి, డి.శివశంకరరెడ్డిలే కుట్రపన్నినట్లు సీబీఐ మరోసారి స్పష్టం చేసింది.

Updated : 03 Sep 2023 08:31 IST

అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డిల వైపు వేలెత్తి చూపిన సీబీఐ
ఆనవాళ్ల చెరిపివేతలోనూ కీలక భూమిక పోషించినట్లు స్పష్టీకరణ
సాక్ష్యాధారాలు ఇవే చెబుతున్నాయని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డి, డి.శివశంకరరెడ్డిలే కుట్రపన్నినట్లు సీబీఐ మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ-8గా ఉన్న అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సవాలు చేస్తూ సునీతా నర్రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులో సీబీఐ గత నెల 31న కౌంటరు దాఖలు చేసింది. ఇందులో వివేకా హత్యకు దారితీసిన పరిణామాలు, అనంతరం సాక్ష్యాధారాల చెరిపివేతలో నిందితులు పాల్గొన్న తీరును పునరుద్ఘాటించింది.

రాజకీయ విభేదాలు

‘‘వివేకానందరెడ్డి, ఈకేసులో నిందితులుగా ఉన్న వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డి, డి.శివశంకరరెడ్డిల మధ్య రాజకీయ విభేదాలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన్ను ఓడించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ అవినాష్‌రెడ్డికి కాకుండా తనకు కానీ, వైఎస్‌ షర్మిల, వైఎస్‌ విజయమ్మల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని పట్టుబట్టారు. దీన్ని అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి భరించలేకపోయారు. వివేకా హత్యకు ఈ ముగ్గురే కుట్ర పన్నినట్లు హత్యాస్థలంలో లభించిన సాక్ష్యాధారాలు చెబుతున్నాయి. హత్య, తదనంతర పరిణామాలపై అప్రూవర్‌గా మారిన నిందితుడు షేక్‌ దస్తగిరి సీఆర్‌పీసీ 306 సెక్షన్‌ కింద స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. హత్య కుట్రతో పాటు, సాక్ష్యాధారాలను ఆ ముగ్గురి సమక్షంలోనే చెరిపేసినట్లు వెల్లడించారు. ఏ-2 యాదాటి సునీల్‌యాదవ్‌ గూగుల్‌ టేక్‌అవుట్‌ ఫోరెన్సిక్‌ విశ్లేషణ ప్రకారం 2019 మార్చి 15న రాత్రి 1.58 గంటల సమయంలో అతను వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. వివేకా ఇంటికి సమీపంలోని సీసీటీవీ వీడియోలో ఆ రోజు తెల్లవారుజామున 3.15కు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పరిగెత్తి పారిపోయిన దృశ్యాలు ఉన్నాయి.

బ్యాండేజ్‌, కాటన్‌ సరిపోవు...

వైఎస్‌ రాజారెడ్డి ఆసుపత్రికి చెందిన ఫార్మాసిస్ట్‌ ఉసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఉదయం 6.50 గంటలకు కాటన్‌, బ్యాండేజ్‌ తీసుకొని వివేకా ఇంటికి రాగా శివశంకరరెడ్డి, భాస్కరరెడ్డి బయటికి రావడం కనిపించింది. వెంటనే వాళ్లు కాటన్‌, బ్యాండేజ్‌ తీసుకురమ్మని ఆదేశించారు. అతని చేతుల్లో ఉన్న బ్యాండేజ్‌, కాటన్‌ను చూసి అవి సరిపోవని, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రికెళ్లి మరింత తీసుకురమ్మని గద్దించారు. దాంతో అతను అలాగే చేశాడు. ఆ ఫార్మసిస్ట్‌ బెడ్రూంలోకి వెళ్లగా వివేకా శవం బాత్‌రూమ్‌లో ఉంది. అతను గుండెపోటుతో చనిపోవడంతో రక్తం తుడిచేసి, బెడ్‌షీట్‌ మార్చినట్లు శివశంకరరెడ్డి, భాస్కరరెడ్డిలు డాక్టర్‌ వెంకటేష్‌నాయక్‌తో చెప్పడాన్ని ఆ ఫార్మసిస్ట్‌ విన్నాడు. హతుడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, అది గుండెపోటు కాదని డాక్టర్‌ నాయక్‌ వారితో అన్నారు. అదే సమయంలో గంగిరెడ్డి అనే వ్యక్తి బెడ్రూంలో రక్తంతో తడిచిన వివేకా దుస్తులను మార్చడాన్ని, గజ్జల జయప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌ మృతుడి శరీరానికి బ్యాండేజ్‌లు వేయడాన్ని ఫార్మసిస్ట్‌ గమనించాడు. అలాగే బెడ్రూంను శుభ్రం చేయడాన్నీ చూశాడు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు విని అక్కడికి ఉదయం 7.15 గంటలకు వచ్చినట్లు డాక్టర్‌ వెంకటేష్‌నాయక్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అప్పటికే శవాన్ని పక్కనపెట్టిన విషయాన్ని డాక్టర్‌ నాయక్‌ గమనించారు. కాంపౌండర్‌ జయప్రకాశ్‌రెడ్డి వివేకా శరీరంపై ఉన్న గాయాలకు బ్యాండేజ్‌ వేయడం చూశారు. తలవెనుక గాయాలు ఉన్నాయా? అని డాక్టర్‌ నాయక్‌ కాంపౌడర్‌ను అడగ్గా అతను అవునని సమాధానం ఇచ్చారు. మరణం గుండెపోటుతో జరిగింది కాదని డాక్టర్‌ నాయక్‌ విచారణ సందర్భంగా చెప్పారు. హత్య జరిగిన రోజు ఉదయం 7.20 గంటలకు కర్ణ నాగభూషణరెడ్డి అనే హోంగార్డు రాగా తొలుత ఆయన్ను వివేకానందరెడ్డి బెడ్‌రూంలోకి అనుమతించలేదు. తర్వాత అనుమతించారు. అప్పటికే శవాన్ని బెడ్‌రూంలో ఒక పక్కకు ఉంచడాన్ని అతను గమనించాడు. జయప్రకాశ్‌రెడ్డి, ఉసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి శవానికి కట్లు కట్టడం చూశాడు. సీఐ శంకరయ్య ఆదేశాల మేరకు హోంగార్డ్‌ నాగభూషణరెడ్డి బెడ్‌రూం, బాత్‌రూంలను వీడియో తీయడం ప్రారంభించగా డి.శివశంకరరెడ్డి గట్టిగా అరిచి అడ్డుకున్నాడు. అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డిల సమక్షంలోనే సాక్ష్యాధారాల ధ్వంసం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. అవినాష్‌రెడ్డితో చర్చించాక భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి, గంగిరెడ్డి ఆదేశాల మేరకు రాగిరి లక్ష్మి, ట్యాంకర్‌బాషా, పి.రాజశేఖర్‌ బెడ్‌రూం, బాత్‌రూముల్లో రక్తాన్ని తుడిచేసినట్లు దర్యాప్తులో తేలింది. గంగిరెడ్డి ఆదేశాల మేరకే రక్తం తుడిచినట్లు రాగిరి లక్ష్మి స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. గుండెపోటు కథను శివశంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి మొదలుపెట్టినట్లు చెప్పింది. అవినాష్‌రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి హత్యాస్థలానికి వచ్చి, వివేకా శవాన్ని చూశాక విషయాన్ని వెంటనే ఆయన భార్య, కుమార్తెకు చెప్పకుండా గుండెపోటు కథ మొదలుపెట్టి, అక్కడికొచ్చిన వారిని నమ్మించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది’’ అని సీబీఐ ఈ అఫిడవిట్‌లో పేర్కొంది.


సాక్షి టీవీకి చెప్పింది శివశంకరరెడ్డే

‘హత్య వార్త బయటి ప్రపంచానికి తెలియకముందే ఆ రోజు ఉదయం ఎ-5 శివశంకరరెడ్డి వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు అతనే సాక్షి టీవీకి చెప్పాడు. అవినాష్‌రెడ్డి అప్పటి సీఐ శంకరయ్యకు ఫోన్‌ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారు, అక్కడికొచ్చే జనాలను నియంత్రించడానికి కానిస్టేబుళ్లను పంపాలని అడిగారు. కానీ, సీఐ శంకరయ్యనే లోనికి అనుమతించారు. అప్పటికే అక్కడ శివశంకరరెడ్డి, భాస్కరరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి, స్టెనో ఇనయతుల్లా ఉండటం చూశారు. బెడ్‌రూమ్‌, బాత్‌రూముల్లో రక్తాన్ని పనిమనిషి తుడుస్తుండటం గమనించారు. గజ్జల జయప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌ వివేకా శరీరంపై గాయాలకు కుట్లు వేసి, కట్లు కడుతున్న విషయాన్నీ చూసి శంకరయ్య అభ్యంతరం చెప్పగా డి.శివశంకరరెడ్డి అతన్ని నోరుమూసుకొని ఉండాలని బెదిరించాడు’ అని అఫిడవిట్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని