రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు!

‘‘అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్స్‌’’ గురించి తెలుసు కదా..! ఎవరైనా బ్యాంకు నుంచి నగదు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు.. అక్కడే మాటు వేసి ఉండే ఈ దొంగల ముఠాల సభ్యులు రూ.100 నోటు ఒకటి కింద పడేసి.. సార్‌! మీ డబ్బులే పడిపోయినట్లున్నాయి చూడండని చెబుతారు.

Updated : 18 Sep 2023 06:50 IST

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆందోళనల్లో తెదేపా శ్రేణులు
ఇదే అదనుగా నకిలీ ఓట్ల చేర్పులపై వైకాపా దృష్టి
జనాభాకు తగ్గట్లు ఓటర్లు పెరగలేదని ఫిర్యాదులు
పెద్దఎత్తున ఫారం-6, 7 దరఖాస్తుల దాఖలు
‘‘దృష్టి మళ్లించి దోచుకునే ముఠాల’’ తరహాలో వైకాపా మోడెస్‌ అపరెండీ

ఈనాడు-అమరావతి: ‘‘అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్స్‌’’ గురించి తెలుసు కదా..! ఎవరైనా బ్యాంకు నుంచి నగదు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు.. అక్కడే మాటు వేసి ఉండే ఈ దొంగల ముఠాల సభ్యులు రూ.100 నోటు ఒకటి కింద పడేసి.. సార్‌! మీ డబ్బులే పడిపోయినట్లున్నాయి చూడండని చెబుతారు. మనం అటువైపు చూసే లోపు. దృష్టి మళ్లించి మన చేతిలో ఉన్న నగదు సంచి లాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతారు. అచ్చం ఆ ‘‘అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్‌లు’’ అనుసరించే ‘‘మోడెస్‌ అపరెండీ’’నే ఏపీలో జగన్‌ ప్రభుత్వం, వైకాపా నాయకులు ఇప్పుడు అమలు చేస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయటంతో.. తెదేపా శ్రేణులన్నీ దాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో తలమునకలై ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం దృష్టంతా అటువైపు మళ్లటంతో.. వైకాపా తన ఓట్ల రాజకీయానికి తెర లేపింది. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, తమ పార్టీ శ్రేణులు, అనుకూలమైన అధికారులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించటం, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్లు తొలగించటం వంటి కార్యకలాపాల్లో మునిగి తేలుతోంది.

ఫిర్యాదు వెనక సరికొత్త పన్నాగమా?

రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదని, నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వీటిపై సమగ్ర విచారణ జరపాలంటూ వైకాపా తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని రెండు రోజుల కిందట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నకిలీ ఓట్ల నెపంతో గుట్టు చప్పుడు కాకుండా తెదేపా సానుభూతిపరుల ఓట్లు తొలగించటం, జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్ల పెరగుదల లేదనే సాకుతో తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించాలనే పన్నాగం, కుట్ర దీని వెనక ఉందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్ల రాష్ట్రంలో విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో యువతరం పొరుగు రాష్ట్రాలకు వలస బాట పడుతోంది. వృద్ధులు, నడి వయస్కులే ఇక్కడ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 18 ఏళ్లు నిండిన నవతరం ఓటర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఓటర్ల సంఖ్య ఎలా పెరుగుతుంది? ఇవి తెలిసి కూడా ఇలాంటి ఫిర్యాదులు చేయటం వెనక మర్మమేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తెదేపా అప్రమత్తంగా లేని సమయాన్ని చూసుకుని

రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితా చూసినా అవకతవకలు, అక్రమాలు కోకొల్లలుగా వెలుగు చూశాయి. ప్రధానంగా తెదేపాకు పట్టున్న నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు. ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే.. భార్యకు లేకుండా చేశారు. దశాబ్దాల తరబడి ఒకే చిరునామాలో నివసిస్తున్న వారి పేర్లు ఆ ప్రాంత ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు.  బతికున్న వారి ఓట్లు గల్లంతు చేసి. చనిపోయిన వారికి మాత్రం కొనసాగించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్ల జాడ ప్రస్తుత జాబితాలో దొరక్కుండా చేశారు. ఒకే కుటుంబంలోని కొందరి ఓట్లు ఒక పోలింగ్‌ కేంద్రం పరిధిలో మరికొందరి పేర్లు మరో పోలింగ్‌ కేంద్రంలో పరిధిలో చేర్చారు. కొన్ని కుటుంబాలకు సంబంధించి మొత్తం అందరి ఓట్లు గల్లంతైన పరిస్థితి. మరోవైపు ఒకే డోర్‌ నంబర్‌లో వందల సంఖ్యలో ఓటర్లున్నట్లు నమోదు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన తెదేపా కొంత కాలంగా క్షేత్రస్థాయిలో ఈ అక్రమాలు, అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి ఆ అక్రమాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియ ఉద్ధృతంగా సాగుతున్న దశలో చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేశారు. తెదేపా దృష్టంతా అటు మళ్లటంతో వారు అప్రమత్తంగా లేని సమయాన్ని చూసుకుని వైకాపా నాయకులు ఇప్పుడు కొత్త ఎత్తుగడ అవలంబిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో వాలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఓట్ల తొలగింపు కోసం ఫారం-7 దరఖాస్తులు, నకిలీ ఓట్లు చేర్పించడానికి ఫారం-6 దరఖాస్తులను పెద్ద ఎత్తున దాఖలు చేయిస్తున్నారు.


కొత్త ఓటర్లు చేర్పించటానికి భారీగా దరఖాస్తులు

తెదేపా శ్రేణులన్నీ ఆందోళనల్లో తలమునకలై ఉండటంతో ఇదే అదునుగా కొన్ని నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ఓటర్లుగా చేరటం కోసం, ఉన్న ఓట్లు తొలగించటానికి నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఎన్నికల అధికారులకు అందుతున్నాయి. ఈ దరఖాస్తుల వెనక వైకాపా నాయకులే ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై ఎవరూ అభ్యంతరం తెలిపే అవకాశం లేనందున తమకు అనుకూలంగా నకిలీ ఓట్లు చేర్పించేందుకు, ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్లు తీసివేసేందుకు ఇదే అనువైన సమయంగా వైకాపా నాయకులు ఎంచుకున్నారు. ఉదాహరణకు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఓటర్లు నమోదు కోసం ఏప్రిల్‌ నుంచి ఈ నెల 15 వరకు ఏకంగా 32,417 దరఖాస్తులొచ్చాయి. ఒకే నియోజకవర్గంలో ఇంత భారీ మొత్తంలో రావటంపై అనేక అనుమానాలున్నాయి. వీటిల్లో అత్యధిక శాతం ఈ మధ్య కాలంలో అందినవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని