సీమెన్స్‌ కేసులో లోకేశ్‌ పేరు చెప్పండి

సీమెన్స్‌ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఒప్పించేందుకు.. అందులో చంద్రబాబు, లోకేశ్‌ పేర్లు చేర్చేందుకు ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలోని వ్యక్తులే తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు.

Updated : 23 Sep 2023 08:33 IST

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారిపై  ఇద్దరు మంత్రుల ఒత్తిళ్లు
అంగీకరించకపోవడంతో బదిలీ వేటు

ఈనాడు, అమరావతి: సీమెన్స్‌ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఒప్పించేందుకు.. అందులో చంద్రబాబు, లోకేశ్‌ పేర్లు చేర్చేందుకు ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలోని వ్యక్తులే తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. ఇద్దరు మంత్రులు సహా కొందరు అధికారులు ఇదే పనిపై.. కొన్ని నెలల పాటు పనిచేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిని.. సతాయించిన తీరే దీనికి నిదర్శనం. అయినా ఆయన అంగీకరించకపోవడంతో అక్కడ నుంచి బదిలీ చేశారు. సీమెన్స్‌ ఒప్పందంలో చంద్రబాబు, లోకేశ్‌ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పమంటూ డిజైన్‌టెక్‌ ఎండీ ఖన్వీల్కర్‌ సహా మరికొందరిని వేధించారని, అవసరమైతే రూ.25 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. అంతే స్థాయిలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఉన్నతాధికారి విషయంలోనూ ఓ మంత్రి వ్యవహరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్‌కు బాగా దగ్గరగా ఉండే ఆ మంత్రి అప్పట్లో ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. కొంతకాలం కిందట ఆ మంత్రి.. నైపుణ్యాభివృద్ధి సంస్థలో పనిచేసే ఉన్నతాధికారిని పిలిపించి.. సీమెన్స్‌ ప్రాజెక్టు ఒప్పందం, నిధుల మళ్లింపులో లోకేశ్‌ పాత్ర ఉందని చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన లోకేశ్‌ పాత్ర ఎక్కడా కన్పించడం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అయినా పట్టువదలని అమాత్యుడు.. కొన్ని నెలల పాటు ఆయనను వేధించారు. తర్వాత సీఐడీ విచారణ సమయంలోనూ లోకేశ్‌ పేరు చెప్పాలంటూ మరోసారి ఒత్తిడికి గురి చేశారు. స్వయంగా మంత్రివర్యులే తనను మూడుసార్లు పిలిచి వేధించారని సంబంధిత అధికారి పేర్కొనడం గమనార్హం. ‘సీమెన్స్‌ ప్రాజెక్టులో ఒప్పందం ప్రకారం యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను సరఫరా చేసిన మాట వాస్తవం. వాటిని అక్కడి విద్యార్థులు వినియోగించుకున్నారు. ఈ నైపుణ్య శిక్షణతో చాలా మంది ఉద్యోగాలు పొందారు. నిజంగా నిధులు మళ్లించి ఉంటే.. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? యువతకు శిక్షణ ఎలా లభించింది. 70వేల మందికి పైగా ఉద్యోగాలెలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. కేసులో తననూ లక్ష్యంగా చేసుకుంటారనే ఆందోళన ఆయనలో వ్యక్తమైంది.

పథకం ప్రకారమే ఫోరెన్సిక్‌ ఆడిట్‌

అసెంబ్లీలోనే కాదు, విలేకరుల సమావేశాల్లోనూ పిట్ట కథలు చెప్పడంలో ఆరితేరిన ఓ అమాత్యుడు సీమెన్స్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేందుకు మొదటి నుంచి కంకణం కట్టుకున్నట్లు కన్పిస్తోంది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కోసం నియమించిన శరత్‌ అసోసియేట్స్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే నివేదిక ఇచ్చేయాలని ఈ అమాత్యుడు ఒత్తిడి చేశారు. ఏదైనా ప్రాజెక్టులో లోపాలున్నాయని చెప్పాలంటే.. దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాల్ని తెలుసుకోవాలి. సీమెన్స్‌ విషయంలో మాత్రం అలాంటి ప్రయత్నమే లేదు. అక్కడి సాప్ట్‌వేర్‌, యంత్రాలు, ప్రయోగశాలలను చూడలేదు. ఇవేవీ లేకుండానే.. ప్రాజెక్టుపై ప్రభుత్వం గుడ్డిగా నివేదికలు తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని