సముద్ర తీరంలో 144 సెక్షనా?చంద్రబాబు సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా నేతలపై కేసులు

చంద్రబాబుకు సంఘీభావంగా గురువారం బాపట్ల జిల్లా కొత్త ఓడరేవు సముద్ర తీరంలో రూపొందించిన సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్‌, పార్టీ బాపట్ల నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ సహా 14 మంది నేతలపై బాపట్ల గ్రామీణ పోలీసులు కేసు పెట్టారు.

Updated : 23 Sep 2023 09:11 IST

బాపట్ల, న్యూస్‌టుడే: చంద్రబాబుకు సంఘీభావంగా గురువారం బాపట్ల జిల్లా కొత్త ఓడరేవు సముద్ర తీరంలో రూపొందించిన సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్‌, పార్టీ బాపట్ల నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ సహా 14 మంది నేతలపై బాపట్ల గ్రామీణ పోలీసులు కేసు పెట్టారు. 30 పోలీసు యాక్టు, 144 సెక్షన్‌ను వారు ఉల్లంఘించినట్లు తెలిపారు. సముద్ర తీరం వద్ద 144వ సెక్షన్‌ ఉల్లంఘించారంటూ తెదేపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేయటమే చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని పోలీసుల తీరుపై పౌరహక్కుల సంఘాల నేతలు, మేధావులు, ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై నిరసన తెలుపుతూ ఏపీ చీకటిమయమై కన్నీరు కారుస్తోందంటూ బాలాజీ వరప్రసాద్‌ సైకత శిల్పాన్ని రూపొందించారు. సైకత శిల్పం ఏర్పాటును ఎందుకు అడ్డుకోలేదని స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో స్థానిక పోలీసులు గురువారం రాత్రే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు చూపారు. నిరసనలో 30 మంది పాల్గొనగా.. మిగిలినవారి పేర్లూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కేసులు నమోదు ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెదేపా నేతలు విమర్శిస్తున్నారు. సముద్ర తీరంలో 144 సెక్షన్‌ ఏమిటని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని