Botsa: మద్యం తాగుతామంటే మేమేం చేస్తాం!

మందుబాబులను మద్యానికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నామని.. అయినా వారు తాగుతామంటే తామేం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Updated : 26 Oct 2023 07:55 IST

అప్పులు చేసి సంక్షేమానికి వినియోగిస్తున్నాం
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు

ఈనాడు, విజయనగరం: మందుబాబులను మద్యానికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నామని.. అయినా వారు తాగుతామంటే తామేం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బుధవారం విజయనగరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందని, దానిపై దర్యాప్తు జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. దర్యాప్తు చేసుకోమని సూచించారు. తెదేపా, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోలు తీసుకొచ్చినా వచ్చే ఎన్నికల్లో తమదే విజయమన్నారు. ‘అప్పులు చేసి.. ఆ నిధులను అభివృద్ధికి, సంక్షేమానికి వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేశాం. ఈ నాలుగున్నరేళ్లలో ఎంతో చేశాం. వచ్చే ఎన్నికల్లో మాకు ఎందుకు ఓటేయరని ప్రజలను అడుగుతాం’ అని బొత్స పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటిని న్యాయస్థానాలు నమ్మాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి జరిగిందని తామూ నమ్ముతున్నామన్నారు. సమగ్ర దర్యాప్తు పూర్తయిన తరువాత నిజాలు బయటపడతాయని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రపై ఆయన వ్యాఖ్యానిస్తూ ‘ఏ నిజం గెలవాలో స్పష్టత ఉండాలి..’ అని అన్నారు. ఈ నెల 26 నుంచి ప్రజా సామాజిక బస్సు యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని