Karnataka Road Accident: ఇక్కడే ఉపాధి ఉంటే.. ఈ ఘోరం జరిగేదా?

ఉపాధి వెతుక్కుంటూ బెంగళూరు వంటి మహానగరానికి వలస వెళుతోన్న వారెవరూ ఐటీ ఉద్యోగులు కాదు..! వారు పనిచేస్తోంది బహుళజాతి కంపెనీలూ అసలే కాదు..! వారంతా బడుగు జీవులు. భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్‌మెన్‌లుగా, దినసరి కూలీలుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న అభాగ్యులు..!

Updated : 27 Oct 2023 08:49 IST

‘అనంత’ కన్నీటి వెతలు
ఊరుగాని ఊరు వలసపోవాల్సిన దుస్థితి
ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే, కదిరి

ఉపాధి వెతుక్కుంటూ బెంగళూరు వంటి మహానగరానికి వలస వెళుతోన్న వారెవరూ ఐటీ ఉద్యోగులు కాదు..! వారు పనిచేస్తోంది బహుళజాతి కంపెనీలూ అసలే కాదు..! వారంతా బడుగు జీవులు. భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్‌మెన్‌లుగా, దినసరి కూలీలుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న అభాగ్యులు..! గురువారం కర్ణాటకలోని చిక్కబళ్లాపుర సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఇలాంటి వారే! ఉన్నఊరును, అయినవాళ్లను వదిలేసి.. పొట్టకూటి కోసం అంత దూరం వలస పోవాల్సిన భయంకరమైన దుస్థితిలోకి వారిని నెట్టేసిన పాపం ముమ్మాటికీ ఈ ప్రభుత్వానిదే..! సొంత ఊళ్లోనో, చుట్టుపక్కల ప్రాంతాల్లోనో వ్యవసాయ పనులు దొరికితే, కనీస ఉపాధి కల్పించే పరిశ్రమలు ఉంటే.. పూటగడవడం కోసం పిల్లాపాపలతో ఊరుగాని ఊరు వలసపోవాల్సిన దుస్థితి వారికి తలెత్తేది కాదు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వలసలు ఎప్పటి నుంచో ఉన్నా.. గత నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే కియా వంటి కొత్త పరిశ్రమలేవీ రాకపోవడం వల్ల ఈ ప్రాంతం నుంచి వలసలు మరింత పెరిగాయి.

ఈ ఏడాది తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల మరింతగా కరవు పరిస్థితులు కమ్ముకోవడంతో..ఉన్నచోట పూటగడవడమే కష్టమై వేల సంఖ్యలో ప్రజలు బెంగళూరు వంటి నగరాలకు వలస పోతున్నారు. కాస్తోకూస్తో పని తెలిసినవారు, నైపుణ్యం ఉన్నవారు పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లుగా పనుల్లో కుదురుకుంటే, మిగతా వారు వాచ్‌మెన్‌లు, దినసరి కూలీలుగా బతుకులీడుస్తున్నారు. పని ప్రదేశాల్లో జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డ సంఘటనలు గతంలో చాలా జరిగాయి. గతంలో ఉపాధి కోసం వెళ్లిన కూలీలు కేరళలో రోడ్డు ప్రమాదానికి గురవడంతో... తెదేపా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి వలసలు వెళ్లిన వారి వివరాలు సేకరించారు. కేరళలోని కొచ్చి, కొట్టాయం తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని గుర్తించి, వారిని వెనక్కు పిలిపించి స్థానికంగా ఉపాధి కల్పించారు. ప్రస్తుతం ప్రభుత్వపరంగా అలాంటి చర్యలు కొరవడ్డాయి.

నగరాలకు వలసలు..!

కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లోని పేదలు ఎక్కువగా ఉపాధికోసం బెంగళూరుకు వెళుతున్నారు. కొంతమంది చెన్నై, తిరువనంతపురం, హైదరాబాద్‌ లాంటి నగరాలకు వలస పోతున్నారు. పొరుగు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కదిరి ప్రాంతం నుంచి సుమారు 25 వేల మంది, హిందూపురం ప్రాంతం నుంచి 45 వేల మంది, రాయదుర్గం, కల్యాణదుర్గం ప్రాంతాల నుంచి 10 వేల మంది ఉపాధి కోసం వలసపోయారని అంచనా. వీరితోపాటు రైలు సదుపాయం కలిగిన హిందూపురం నుంచి రోజూ 2 వేల మంది, రాయదుర్గం ప్రాంతం నుంచి 600 మంది పనుల కోసం రోజూ వెళ్లి వస్తుంటారు. వీరితోపాటు కదిరి, గాండ్లపెంట, ఎన్పీకుంట తదితర మండలాల్లో నుంచి వేలసంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వలసపోయారు. అక్కడ అనారోగ్యం, ప్రమాదాలకు గురై మృత్యువాత పడినవారు చాలా మంది ఉన్నారు.

కరవు నేలపై కనికరం లేదా?

కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలంటే అది వ్యవసాయరంగం, పరిశ్రమల వల్లే సాధ్యం. శ్రీసత్యసాయి జిల్లా వంటి కరవు ప్రాంతానికి సాగునీరు అందించి, భూముల్ని సాగులోకి తేగలిగితే వలసలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఆ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఎన్నో ప్రతిపాదనలు ఉన్నా వాటిని కార్యరూపంలోకి తీసుకు రావడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోంది. గురువారం జరిగిన ప్రమాదంలో మృతి చెందినవారిలో గోరంట్ల మండలానికి చెందిన వారే ఎనిమిది మంది ఉన్నారు. గోరంట్ల ప్రాంతానికి హంద్రీనీవా నీళ్లు తీసుకురావాలనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన. గొల్లపల్లి జలాశయానికి శ్రీశైలం జలాలు హంద్రీనీవా పథకం ద్వారా తీసుకువచ్చారు. అక్కడి నుంచి మడకశిర బ్రాంచి కెనాల్‌ ద్వారా నీళ్లు ప్రవహిస్తాయి.

ఆ కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా గోరంట్ల మండలానికి నీళ్లు తీసుకురావాలనే ఆలోచన ఉంది. దానికి ఇప్పటివరకు తుది ప్రణాళిక రూపుదిద్దుకోలేదు. నిధులూ మంజూరు కాలేదు. నీటిని ఎత్తిపోసి గోరంట్ల మండలానికి తీసుకువచ్చి చెరువులు నింపితే వేల ఎకరాలు సాగులోకి వచ్చేవి. వలసలూ తగ్గేవి. పుట్టపర్తి నియోజకవర్గానికి బుక్కపట్నం మాదాల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి కాలువల ద్వారా మళ్లించి చెరువులు నింపేందుకు పాలనాపరమైన అనుమతులిచ్చారు. ఆ పనులు ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. భూసేకరణ జరగలేదు. ఈ పనులు పూర్తైతే పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని చెరువులు నింపి సాగునీటిని అందించే ఆస్కారం ఉండేది. చెర్లోపల్లి జలాశయం నుంచి కూడా ఓబుళదేవరచెరువు, అమ్మడగురు మండలాల చెరువులకు నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకురావాలనే ఆలోచన కూడా పట్టాలెక్కలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని