ఊరూరా వాలంటీర్లు.. అన్నిచోట్లా జగన్‌ అరాచకాలు!

పైకి... వారు స్వచ్ఛంద వాలంటీర్లు... గౌరవవేతనంతో పనిచేసే వారు... ప్రజలకు సేవలందించాల్సిన వారు..కానీ.. చేస్తున్నది జగనన్న సేవ.. ప్రజలపై అడుగడుగునా నిఘా వాడవాడలా వైకాపా అరాచకాలకు తోడూనీడా ప్రజాప్రయోజనం పేరిట దిగిన అన్నజనం ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటైన ప్రైవేటు సైన్యం!

Updated : 18 Apr 2024 16:21 IST


పైకి... వారు స్వచ్ఛంద వాలంటీర్లు... గౌరవవేతనంతో పనిచేసే వారు... ప్రజలకు సేవలందించాల్సిన వారు..

కానీ.. చేస్తున్నది జగనన్న సేవ.. ప్రజలపై అడుగడుగునా నిఘా వాడవాడలా వైకాపా అరాచకాలకు తోడూనీడా ప్రజాప్రయోజనం పేరిట దిగిన అన్నజనం ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటైన ప్రైవేటు సైన్యం! మీ ఇంటికి ఎవరు వచ్చినా మీరెటైనా వెళ్లినా... సరదాకు మీ ఇంటి వాకిట్లోనో... సరకులకని కొట్లోనో... రాజకీయంగా ఏదైనా నోరుజారినా... వేగుల్లా పట్టేస్తారు.. వైకాపాకు చేరవేస్తారు! ఇంటివద్దకే ప్రభుత్వ సేవలనే తేనె పూసి... కంటికి కనిపించని గూఢచర్యం చేసి... ఆంధ్రుల జీవితాలను అభద్రతలోకి నెట్టిన ఘనుడు... జగనుడు!


సర్కారీ సేవలను గడప గడపకూ చేర్చే స్వచ్ఛంద సేవకులంటూ వాలంటీర్ల వ్యవస్థను జగన్‌మోహన్‌రెడ్డి సృష్టించారు. పూర్తిగా ప్రజాధనంతోనే వాలంటీర్లను పెంచి పోషించిన జగన్‌- వారితో సొంత పార్టీ పనులు చేయించుకున్నారు. వైకాపా చీకటి వ్యవహారాలు అన్నింటినీ వాలంటీర్ల చేతుల మీదుగానే జరిపించారు. 


వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు

వాలంటీర్లు ఎవరు, వారి విధులేమిటి అన్న విషయాలపై జగన్‌ తీపి మాటలన్నీ చక్కెర పూతపూసిన విషగుళికల వంటివే. సేవాదృక్పథం కలిగిన యువతీ యువకులను వాలంటీర్లుగా నియమించామని, వారు పార్టీలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్నారని సీఎం దరువేసుకున్నారు. కానీ, వాలంటీర్లు వైకాపా కార్యకర్తలేనని, పార్టీ అవససరాల కోసమే నియమితులయ్యారంటూ జగన్‌ రాజకీయ కుట్రను ఆయన వందిమాగధులే బయటపెట్టారు. ‘‘వైకాపాలో పనిచేసిన వారికి వాలంటీర్ల నియామకంలో అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాం. ఆ పనులు పూర్తయ్యాయి’’ అని తమ ఘనకార్యం గురించి ఎంపీ విజయసాయిరెడ్డి 2019 ఆగస్టులోనే నిర్లజ్జగా ప్రకటించారు. ‘‘వాలంటీర్‌ పోస్టులిచ్చింది వైకాపా కుటుంబాల వారికే కదా’’ అని హోంమంత్రి తానేటి వనిత జంకుగొంకు లేకుండా ఒప్పుకొన్నారు. ఆర్భాటాల మంత్రి అంబటి రాంబాబు అయితే ‘‘వాలంటీర్లు వైకాపా కోసం పనిచేస్తున్న కార్యకర్తలు’’ అని ఉన్న నిజం కక్కేశారు. కాబట్టే వారితో అడ్డగోలు పనులన్నీ చేయించుకోగలిగారు. ఎంప్లాయ్‌మెంట్‌ సర్వే పేరిట పట్టభద్రుల రాజకీయ ఆసక్తుల గురించి వాలంటీర్లు కూపీ లాగారు. సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ సర్వే అంటూ పాన్‌కార్డుల వివరాలు ఆరా తీశారు. జగన్‌ చెప్పినట్లు నిజంగా సంక్షేమ పథకాల పంపిణీ కోసమే వాలంటీర్లు ఉంటే- ప్రజల వ్యక్తిగత సమాచారం వారికెందుకు? పౌరసేవల వితరణకు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడు- దాన్ని కాదని ఒక గూడుపుఠాణీ వ్యవస్థను జనంపై రుద్దాల్సిన పనేమిటి? ప్రజలపై ప్రత్యక్షంగా నిఘా పెట్టడానికి, జనాన్ని పార్టీల వారీగా విభజించి పాలించడానికి జగన్‌కు వాలంటీర్లు చాలా అవసరం కాబట్టే రాష్ట్రంలో ఆ వ్యవస్థ మొలుచుకొచ్చింది. ‘‘వాలంటీర్లు ఎవరో కాదు... మన పార్టీని అభిమానించే, మనలో నుంచి వచ్చిన మనవారే’’ అన్న జగన్‌ ఇటీవలి వ్యాఖ్యలే అందుకు నిదర్శనాలు.


జవాబుదారీతనం లేని వ్యవస్థ

సంక్షేమ పథకాలకు అర్హులెవరో గుర్తించడం అనేది సర్కారీ సిబ్బంది నిష్పాక్షికంగా నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యత. తనకోసం తనచేత నియమితులైన వాలంటీర్లకు దాన్ని కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను జగన్‌ పెళ్లగించి పారేశారు.  ‘‘వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? వారికి సర్వీస్‌ రూల్స్‌ ఉన్నాయా? అసలు ప్రభుత్వ ఉద్యోగులేనా? లబ్ధిదారుల ఎంపికలో వారి జోక్యమేమిటి’’ అని సాక్షాత్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు సంధించింది. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానేకారు. ఆ విషయం జగనే తేల్చి చెప్పారు. ‘‘మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పనిచేయాలన్న నిబంధనలు ఏమీ లేవు’’ అంటూ ఆయన వాలంటీర్లకు ఒక లేఖ కూడా రాశారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాలకు సమాధికట్టిన జగన్‌- శాసన కట్టుదిట్టాలేమీ లేని సమాంతర వ్యవస్థకు కోరలు తొడిగారు. దాని ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థను చావుదెబ్బ తీశారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. వాలంటీర్లకు ఉన్న అధికారం సర్పంచ్‌లకు లేదు అని పల్లెల ప్రథమ పౌరులు ఆవేదన వెళ్ళగక్కినా, తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంజేసినా జగన్‌ ఏమాత్రం లెక్కజేయలేదు.


జగన్మోసకారితనం

గన్‌ పెత్తందారీ ప్రభుత్వానికి కళ్లూచెవులుగా మెలుగుతున్న వాలంటీర్లలో కొందరు సంఘవ్యతిరేక శక్తులుగా తయారయ్యారు. ఘోర నేరాలకు పాల్పడ్డారు. ఆడపిల్లలపై అత్యాచారాల నుంచి అసహాయులపై అరాచక దాడుల వరకు, నాటుతుపాకుల తయారీ మొదలు హత్యల దాకా కొంతమంది వాలంటీర్లు చేయని అకృత్యాలంటూ లేవు. పింఛన్‌ సొమ్ములను, పంట పరిహారాలను దిగమింగిన వాలంటీర్ల బాగోతాలూ వెలుగుచూశాయి. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య ప్రమాణాలకు కట్టుబడని జగన్‌ విశృంఖలత్వమే దీనికంతటికీ కారణం. జనం సొమ్ముతో జనానికే చేటుచేసిన జగన్మోసకారితనం ఆయనది. సేవాసైన్యం ముసుగులో సొంత కార్యకర్తల దండును ఊరూరా వాడవాడా మోహరించి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యం గుండెల్లో గునపాలు దించిన శీలహీన రాజకీయాలు ఆయనవి!


ప్రజాధనం...  ‘సాక్షి’ పరం

నకు మించిన నిజాయతీపరుడు ఇంకెవరూ లేరన్నట్టు జగన్‌ ఆత్మస్తుతి చేసుకుంటూ ఉంటారు. నిజానికి జనం సొమ్ముతో తన కరపత్రిక ‘సాక్షి’ సర్క్యులేషన్‌ను పెంచుకునే పన్నాగానికి పాల్పడేటంతటి గొప్పది ఆయన ‘నిజాయతీ’! దినపత్రిక కొనుగోలు కోసమంటూ గ్రామ, వార్డు వాలంటీర్లు ఒక్కొక్కరికి నెలకు రూ.200 చొప్పున కేటాయిస్తూ జగన్‌ సర్కారు ఉత్తర్వులిచ్చింది. రెండున్నర లక్షల మందికి పైబడిన వాలంటీర్లతో పాటు 1.45 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ ఇలాగే సొమ్ము మంజూరు చేసింది. ‘సాక్షి’ని కొనాలని సర్కారీ ఆదేశాల్లో నేరుగా చెప్పకపోయినా- ఆయా జీఓల్లోని షరతులు, తన బాకా ఊదని పత్రికలపై జగన్‌ కడుపుమంటను గమనిస్తే అయ్యవారి ఆంతర్యం ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది. ఏడాదికి తొంబై కోట్ల రూపాయలకు పైగా జనం సొమ్మును వెదజల్లి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో తన సొంతపత్రిక ‘సాక్షి’ని కొనిపించడమే నీతిమాలిన జగన్‌ ఉద్దేశమన్నది బహిరంగ రహస్యమే. ప్రజాధనానికి ప్రభుత్వం ధర్మకర్తగా మెలుగుతూ దాన్ని సద్వినియోగ పరచాలి. అందుకు విరుద్ధంగా స్వీయ ప్రచారం కోసం సర్కారీ ఖజానాకు జగన్‌ చిల్లుపెట్టారు.


ఓట్ల తొలగింపులోనూ వాళ్లే!

గన్‌ దొంగ రాజకీయాలకు ఒక పనిముట్టుగా వాలంటీర్ల వ్యవస్థ బాగా ఉపయోగపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలంటూ వాలంటీర్లు జనాన్ని ప్రభావితం చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లోనైతే వైకాపా తరఫున వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం మళ్ళీ రావాలనే లక్ష్యంతో పనిచేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టి మరీ వాలంటీర్లకు కర్తవ్యోపదేశాలు చేశారు. నెల్లూరు జిల్లా సంగంలోనైతే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు వాలంటీర్లతో వైకాపా నేతలు రహస్యంగా భేటీ వేశారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించింది. కానీ, ఆ ఉత్తర్వులకు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్లో కొందరు వాలంటీర్లే కీలకపాత్ర పోషించారు.

ఆ తరవాతా వాలంటీర్ల హవా ఎక్కడా తగ్గలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా బూత్‌స్థాయి అధికారులతో కలిసి ఇంటింటి తనిఖీల్లోనూ వాలంటీర్లు భాగస్వాములయ్యారు. ప్రజాస్వామ్యాన్ని అలా పాతాళానికి తొక్కేసింది చాలక వైకాపా కార్యక్రమాలన్నింటినీ వాలంటీర్లే ముందుండి నడిపించారు. జగన్‌ సభలకు జనాన్ని తరలించడంలోనూ వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం సభలకు రానివారికి సంక్షేమ పథకాలను తొలగిస్తామని లబ్ధిదారులను బెదిరించి మరీ బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఇలా వైకాపా జెండాలు మోయించడం కోసం ఏడాదికి దాదాపు రూ.1900 కోట్ల ప్రజాధనాన్ని వాలంటీర్లకు ధారపోశారు జగన్‌. సొంత పార్టీకోసం జనం డబ్బులను ఇంతగా దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా కనిపించరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు