ఇసుకాసురులకు పెద్దన్న

జగన్‌మోహన్‌రెడ్డితో పోలిస్తే- రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు చాలా నయం. కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేచేవాడు.

Updated : 18 Apr 2024 16:25 IST

జగన్‌మోహన్‌రెడ్డితో పోలిస్తే- రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు చాలా నయం. కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేచేవాడు. ఆ ఒక్కరోజు మేసినంత మేసి మళ్లీ గురక తీసేవాడు. జగన్‌ మాత్రం తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాదిలో 365 రోజులూ రాష్ట్రాన్ని నంజుకుని తింటూనే ఉన్నారు. ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను నిరంతరాయంగా నమిలి మింగేస్తున్నారు. దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్లు- రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను వైకాపా నేతలు పంచుకున్నారు. లేదు... లేదు... వారికి అలా పంచిపెట్టి తమ ఇనప్పెట్టెలు నింపుకొన్నారు అధినాయకులు. నదులను తోడేసి తాము పోగేసుకున్న నల్లధనం గుట్టల కింద జనం బతుకులను నలిపేసి నుగ్గునుగ్గు చేశారు ఆ ఇసుకాసురులు!


జగదేక నటచక్రవర్తి

ప్రతిపక్షనేతగా నవరసాలను అద్భుతంగా పండించారు జగన్‌. ‘‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే రాష్ట్రంలో మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు’’ అంటూ భారీ డైలాగులు చెప్పారు. అదే మనిషి ముఖ్యమంత్రి అయ్యాక దేవాలయాలను అపవిత్రం చేసే దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడ్డారు. ఇక సహజ వనరుల సంరక్షణ గురించి జగన్‌ మాట్లాడటం అంటే- ఒక నరహంతకుడు అహింసపై ఉపన్యాసం దంచినట్లే. గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని జగన్‌ అప్పట్లో తెగ ఆడిపోసుకున్నారు. సీఎం కాగానే ఆ విధానానికి చరమగీతం పాడేశారు. ఇసుక తవ్వకాలను ఆపించేశారు. దాంతో ఒక్కసారి ఇసుక అతిఖరీదైన సరుకైంది. గిరాకీకి తగినట్లు సరఫరాలు లేక నిర్మాణదారులు నానా అవస్థల పాలయ్యారు. నిర్మాణ రంగం నేలకరచుకుని పోయింది. దానికి అనుబంధమైన 25 రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అలా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అరాచకత్వానికి జగన్‌ అంటుకట్టారు. పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు కన్నీళ్లతో కడుపులు నింపుకోవాల్సిన దుస్థితిని కల్పించారు.


పక్క రాష్ట్రాలకు స్మగ్లింగ్‌

గన్‌మోహన్‌రెడ్డి డిక్షనరీలో పాలించడం అంటే- జనంపై మాటల మత్తుమందును గుమ్మరించడం! ఆ జగన్మాయ విద్యను ప్రదర్శిస్తూ 2019లో కొత్త ఇసుక విధానాన్ని తీసుకొచ్చారాయన. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ద్వారా రోజుకు సుమారు 2 లక్షల టన్నుల ఇసుకను అందరికీ అందబాటులో ఉంచుతామంటూ కోతలు కోశారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌లని, డోర్‌ డెలివరీలని గప్పాలు కొట్టుకున్నారు. జగన్‌ మాటలను నమ్మి ఇసుకకోసం ఆన్‌లైన్‌ను ఆశ్రయించిన వారికి ఆశాభంగాలు తప్పలేదు. బుకింగ్‌లు తెరుచుకున్న క్షణాల్లోనే నిల్వలన్నీ ఖాళీ అయిపోయినట్లు కనిపించేది. ఇసుక కొరతతో నిర్మాణాలు ఆగిపోయాయి. ఆకలితో అల్లాడుతూ కార్మికులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దౌర్భాగ్య పరిస్థితులు రాజ్యమేలాయి. అలా సామాన్యులకు ఇసుక బంగారమైన రోజుల్లోనే పక్క రాష్ట్రాలకు అక్రమ సరఫరాలు పోటెత్తాయి. తవ్విన ఇసుక నిల్వ కేంద్రాలకు చేరేలోపే దారిమళ్లడం జోరందుకుంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు రాత్రిపూట టిప్పర్లలో పెద్దయెత్తున ఇసుక తరలింపు సర్వసాధారణమైంది. క్షేత్రస్థాయిలో అక్రమార్కులు అలా స్వేచ్ఛగా దోచుకుపోతుంటే- ‘‘ఇసుక స్మగ్లింగ్‌కు ఏమాత్రం అవకాశం లేకుండా సరిహద్దుల్లో నిఘా పెంచాలి’’ అంటూ కాకమ్మ కబుర్లు చెబుతూ కూర్చున్నారు జగన్‌. ఎక్కడికక్కడ స్థానిక పెత్తందారులు భాగస్వాములు కావడంతో ఇసుక దోపిడీవైపు జగన్‌ విధేయ ఖాకీలు కన్నెత్తి చూడలేదు.


ఇసుక దోపిడీకి టెండర్ల నాటకం

కొత్త ఇసుక పాలసీతో అక్రమాలకు గేట్లెత్తిన జగన్‌- తమ విధానం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని తన భుజం తానే చరుచుకున్నారు. అలా సొంతడబ్బా కొట్టుకున్న కొద్ది కాలానికే ఆ పాలసీని పక్కనపెట్టేశారు. 2021లో టెండర్ల నాటకాన్ని మహాద్భుతంగా రక్తికట్టించి రాష్ట్రంలోని ఇసుక తవ్వకాలు, విక్రయాలను ఎక్కడో ఉత్తర భారతానికి చెందిన జేపీ సంస్థకు అప్పగించారు. అప్పటికి కొద్దిరోజుల మునుపే చెన్నైలో పుట్టుకొచ్చిన టర్న్‌కీ సంస్థ- జేపీకి ఉప గుత్తేదారుగా రాష్ట్రంలోకి ప్రవేశించింది. వైకాపాకు దగ్గరి మనిషైన ఓ మైనింగ్‌ వ్యాపారి చేతుల మీదుగా పురుడుపోసుకున్న టర్న్‌కీ- జగన్‌ అంతేవాసుల ఇసుక మేతలకు పనిముట్టుగా పనికొచ్చింది. జేపీ, టర్న్‌కీ పాత్రలన్నీ పేరుకే... వాస్తవానికి జగన్‌ పెంచిపోషించిన ప్రబుద్ధులే జిల్లాల వారీగా సిండికేట్లు ఏర్పాటుచేసి ఇసుకను ఇష్టారీతిన కాజేశారు. అడ్డుకోవాల్సిన అధికారులేమో ఇసుక రీచ్‌లు, నిల్వ కేంద్రాల వైపు కన్నెత్తి చూడకుండా జగన్‌ పార్టీ దందాలకు ఎదురు కాపలా కాశారు. అలా రాష్ట్ర యంత్రాంగాన్ని తమ కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని- కంప్యూటరైజ్డ్‌ వేబిల్లులు, డిజిటల్‌ చెల్లింపులు వంటివి ఏమీ లేకుండా, ఏ రీచ్‌లో ఎంత తవ్వుకుపోయారో ఎవరికీ అంతుబట్టని రీతిలో జగన్‌ అనుచరగణాలు ఇసుకను గుటకాయ స్వాహా చేశాయి.


జగన్‌ బంధుజనం ఆధీనంలో ఇసుక

ర్న్‌కీ ద్వారా తమ ధనదాహం పూర్తిగా తీరడం లేదనో ఏమో కానీ 2022లో ఆ సంస్థను ఉన్నపళంగా తప్పించారు. పేరుకు రికార్డుల కోసం వేరే సంస్థలు రెండింటిని ఉపగుత్తేదారులుగా తెరపైకి తెచ్చి ఇసుక దోపిడీని తీవ్రతరం చేశారు. అధికారిక రాతకోతలు, జీఎస్టీ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురుకావడంతో టర్న్‌కీని మళ్లీ తీసుకొచ్చారు. జేపీ కాంట్రాక్టు కాలపరిమితి పూర్తికావడంతో కొద్ది నెలల క్రితం ప్రతిమా ఇన్‌ఫ్రా(తెలంగాణ), జీసీకేసీ(రాజస్థాన్‌) సంస్థలు రాష్ట్రంలోకి అడుగుపెట్టాయి. జగన్‌కు వరసకు సోదరుడయ్యే వైఎస్‌ అనిల్‌రెడ్డి వాటిని వెనకుండి నడిపిస్తూ ఇసుక దోపిడీకి ఇరుసుగా మెలుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైకి ఏ సంస్థలు కనపడితేనేమి- జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇసుక తవ్వకాలు, అమ్మకాలన్నీ ఆయన సన్నిహితుల కనుసన్నల్లోనే జరిగాయి... జరుగుతున్నాయి. ఇసుక సిండికేట్లకు జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా సొమ్మును వైకాపా పెద్దలు దిగమింగినట్లు అంచనా! అధినాయకులకు అంతగా కప్పంకట్టిన స్థానిక సామంతులు ఇంకెంత వెనకేసుకున్నారో... మొత్తమ్మీద జగన్‌ పార్టీ గజదొంగలు అందరూ కలిసి ఎంత ఇసుకను మాయం చేశారో బయట నరమానవుడికి తెలియదు.


కోర్టులను ధిక్కరించి మరీ...

నుమతులూ నిబంధనలతో నిమిత్తం లేకుండా భారీ యంత్రాలతో నదీగర్భాలను చీల్చేసింది జగన్‌ ముఠా. ‘వాల్టా’ చట్ట నిబంధనలను బేఖాతరు చేస్తూ గోదావరి, కృష్ణా, పెన్నా తదితర నదుల్లో ఇసుకను తోడేశారు. వంతెనలకు సమీపంలోనూ తవ్వకాలు చేపట్టి, వారధులను ప్రమాదం అంచుకు నెట్టేశారు. రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ(సియా) అనుమతించేంత వరకు ఇసుక తవ్వకాలను చేపట్టొద్దని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశించింది. ఎన్‌జీటీ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. జగన్‌ సర్కారు మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. ప్రైవేటు సైన్యాల పహారాల నడుమ ఇసుక రీచ్‌ల్లో తోడివేతలు సాగుతుంటే- ఎక్కడా తవ్వకాలే జరగట్లేదని జగన్‌ ప్రభుత్వం అడ్డంగా వాదించింది. ఏకంగా హైకోర్టుకే అబద్ధాలు చెప్పింది. పర్యావరణ అనుమతులేమీ లేకుండానే పట్టపగలే ఇసుక లూఠీ జరిగిపోతుంటే- అబ్బే అదేమీ లేదు, ఎన్‌జీటీ ఆదేశాలను పాటిస్తున్నామని దొంగ వేషాలు వేసింది జగన్‌ సర్కారు. ఇసుక రీచ్‌లను పరిశీలించి నిజానిజాలను తేల్చమని కలెక్టర్లను ఎన్‌జీటీ ఆదేశించింది. వారేమో చాలాచోట్ల జగన్‌ అనుచరగణాలకు ‘అయ్యా..ఎస్‌’ అని ఉత్తుత్తి తనిఖీలు చేశారు. ప్రజలకు, చట్టాలకు, కోర్టులకు విలువ ఇవ్వని జగన్‌- ప్రజాస్వామ్యానికి పట్టిన వేరుపురుగు అంటే కాదనేదెవరు?


ఎన్నో ప్రాణాలు బలి

దీనదాల జీవం తీస్తూ అట్టడుగు పొరల దాకా ఇసుకను తోడేయడంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. ఊటబావులు అడుగంటిపోవడం నుంచి తాగునీటి పథకాలు డస్సిపోవడం దాకా అనేక ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ‘‘ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. జీవనదులు సైతం వట్టిపోయే పరిస్థితి దాపురిస్తోంది. ఇసుకను తోడుకునేందుకు ప్రభుత్వాలూ సహకరిస్తున్నాయి. నిబంధనల మేరకు మీటరు లోతు మాత్రమే తవ్వాల్సి ఉండగా నదిలో రాయి తేలేవరకు తోడేస్తున్నారు. పెన్నా, చిత్రావతి నదుల్లో ఇసుకను ఖాళీ చేసేశారు. ఇక్కడ రాళ్లు తేలాయి. ఇది ఎంత ప్రమాదకరమన్నది గుర్తించాలి’’ అని ఏపీ లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. నదుల్లో ఇసుక తోడివేతలు ఇలాగే సాగితే భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన జగన్‌ స్వస్థలం కడపలోనే హెచ్చరించారు. అయినా అటువంటి హితవచనాలను చెవికెక్కించుకునే అలవాటు జగన్‌కు ఏనాడుంది? పరిమితికి మించి ఇసుకను తరలించే వాహనాలతో ఒకపక్క రోడ్లు ధ్వంసమైతే- మరోవైపు నదుల్లో తాటిచెట్ల లోతున పడిన గుంతలు ఎన్నో ప్రాణాలను బలితీసుకున్నాయి. సహజసిద్ధమైన ఇసుకను అంగడి సరుకుగా మార్చి, సామాన్యుల నెత్తిన మోయలేని భారం మోపారు జగన్‌. ఏపీలో ఇసుకను కొల్లగొడుతున్న మాట వాస్తవమని కేంద్రమే తాజాగా హైకోర్టుకు తెలియజేసింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోకపోతే అధికారులపై చర్యలు తప్పవని ఉన్నత న్యాయస్థానమూ హెచ్చరించింది. అయినా సరే, జగన్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇసుకాసురులకు పెద్దన్నగా అవతరించిన ఆయన కారణంగానే రాష్ట్ర సంపద అపరిమితంగా మాయమైంది.


సీఎంవో మనుషులట... దోచేస్తారట!

దేశంలో మరే రాష్ట్రంలోనైనా ఇసుక వ్యాపారం చేయడానికి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి మనుషులు వస్తారా? జగన్‌ పాలబడిన మన రాష్ట్రంలో కొందరు అలాగే చెప్పుకొని దందాలు నడిపించారు. మొన్న డిసెంబరులో ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరుల్లోని పలు ఇసుక నిల్వ కేంద్రాల్లో ఉన్నట్టుండి కొత్త వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు. తాము సీఎంవో నుంచి వచ్చామంటూ నానా హడావుడి చేశారు. అనుమతులేమీ లేకుండా దర్జాగా రేవుల్లో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు కానిచ్చేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఇసుక తవ్వాలంటే ప్రభుత్వం అనుమతించాలి. ‘రివర్స్‌’ సీఎం జగన్‌ జమానాలో అలా కుదరదు. ఆయన బంధువులు, సన్నిహితులు, నమ్మినబంట్లదే రాజ్యమంతా! పెన్నా నదిలోని అనధికారిక ఇసుక రీచ్‌కోసం జగన్‌ సమీప బంధువైన దుగ్గాయపల్లె వీరారెడ్డికి తాను రూ.81 లక్షలు చెల్లించినట్లు పి.నారాయణరెడ్డి అనే వ్యాపారి వెల్లడించారు. ఇసుక రేవులను కొంతమందికి సబ్‌ లీజ్‌కు ఇచ్చానని వీరారెడ్డి కూడా అదురూబెదురు లేకుండా ఒప్పుకొన్నారు. జగన్‌ బంధుమిత్ర పరివారజనమంతా ఇలా రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా పంచుకుని అందినకాడికి కొల్లగొట్టేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని