ఉద్యోగాల విప్లవం.. జగన్‌ మార్కు మోసం!

ప్రజలకు హామీలిచ్చి ఓట్లేయించుకుని తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయని వారిని కాలర్‌ పట్టుకుని నిలదీయాలి! జనం అలా నిలేస్తారనే భయం రాజకీయ నాయకుల్లో రావాలి! ఎవరి మాటలో తెలుసా ఇవి... జగన్‌మోహన్‌రెడ్డివే! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనే అలా జనానికి పిలుపిచ్చారు.

Updated : 18 Apr 2024 16:43 IST

ఆంధ్రావనిని అగ్రస్థానంలో నిలుపుతానన్న జగన్‌...మాట నిలబెట్టుకున్నారు!
ఐదేళ్ల ఆయన పాలనలో.. నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది.
ప్రభుత్వ కొలువులు నింపక ఐటీ కంపెనీలు నిలవక... పరిశ్రమలు రాక... ఉపాధి లేక ...ఆంధ్ర యువత ప్రవాసం బాటపడుతోంది!

ప్రజలకు హామీలిచ్చి ఓట్లేయించుకుని తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయని వారిని కాలర్‌ పట్టుకుని నిలదీయాలి! జనం అలా నిలేస్తారనే భయం రాజకీయ నాయకుల్లో రావాలి! ఎవరి మాటలో తెలుసా ఇవి... జగన్‌మోహన్‌రెడ్డివే! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనే అలా జనానికి పిలుపిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తెస్తానని చెప్పి సీఎం అయిన ఆయన మాట నిలబెట్టుకోలేదు. మన పిల్లలకు మన రాష్ట్రంలోనే మంచి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి హోదాలో సెలవిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి- ఆ పని కూడా చేయలేదు. అలాంటప్పుడు ఆయన కాలర్‌ పట్టుకుని ప్రశ్నించే హక్కు యువతకు ఉంది కదా! ఏమంటారు జగన్‌- రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను నాశనం చేసిన మిమ్మల్ని నిలదీయడానికి నవతరం ‘సిద్ధం’ అయితే, వారికి సమాధానం చెప్పే దమ్ముందా మీకు?


యువత జీవితాలతో జగన్‌ ఆటలు

కడుపు కట్టుకుని రూపాయి రూపాయి కూడబెట్టి కన్నబిడ్డలను చదివించుకుంటారు చాలామంది. అవసరమైతే అప్పులు చేసి మరీ పిల్లలను ఉన్నత చదువులకు పంపుతారు. ఆ చదువులకు తగిన కొలువుల్లో బిడ్డలు కుదురుకుంటే- తమ కష్టాలు అవే తీరిపోతాయని అమ్మానాన్నలు ఆశపడతారు. కానీ, పిల్లల చేతుల్లోకి డిగ్రీలొచ్చి ఏళ్లకేళ్లు గడచిపోతున్నా ఉద్యోగాలు దొరకకపోతే- ఆ సామాన్య కుటుంబాల గతేంటి? కష్టపడి చదువుకున్నా సరే, జీవితంలో స్థిరపడటానికి సరైన దారి కనపడకపోతే- పిల్లలు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతారు. వారి ఆవేదనను తీర్చలేక, కుటుంబాలను పోషించుకోలేక తల్లిదండ్రులు ఇంకా చితికిపోతారు. గడచిన అయిదేళ్లలో ఏపీలో అటువంటి దయనీయ దౌర్భాగ్యస్థితినే సృష్టించారు జగన్‌మోహన్‌రెడ్డి. అభివృద్ధి రథాన్ని ముందుకు సాగనివ్వని జగన్‌- యువతకు ఉపాధి అవకాశాలను కల్పించలేదు. ఖాళీగా ఉన్న సర్కారీ కొలువులనూ భర్తీ చేయలేదు. ఆ విధంగా యువతరం కలలను కాలరాసిన జగన్‌- గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో నంబర్‌.1గా ఏపీని తయారుచేశారు.


జగన్‌ ఏలుబడిలో ఏపీ అధోగతి

కేంద్ర ప్రభుత్వ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదిక ఇటీవలే విడుదలైంది. జులై 2022- జూన్‌ 2023 మధ్యకాలానికి సంబంధించిన ఆ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రాడ్యుయేట్లలో 24శాతం మంది నిరుద్యోగులే. ఏపీలో ఉన్నంత ఎక్కువగా మరే రాష్ట్రంలోనూ నిరుద్యోగ పట్టభద్రులు లేరు. ‘పీఎల్‌ఎఫ్‌ఎస్‌’ ప్రకారం- గ్రాడ్యుయేట్‌  నిరుద్యోగ రేటులో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆ దుష్కీర్తి జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఏపీ- జాతీయస్థాయిలో పరువుమాసింది. తెలంగాణ సంగతి అలా ఉంచితే- బిహార్‌, ఒడిశా, ఉత్తర్‌ ప్రదేశ్‌ వంటి వాటికన్నా ఏపీ పరిస్థితి దిగజారిపోయింది. అద్భుతమైన సహజ వనరులు, అతిచురుకైన మానవ వనరులు కలిగిన ఏపీని అధోగతి పాల్జేసింది జగమొండి జగనే. ఆయన కక్షపూరిత రాజకీయాలు, వివక్షాపూరిత విధానాలు, మతిమాలిన పనులే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయి. ధ్వంసరచనే తప్ప దార్శనికతకు అర్థం తెలియని జగన్‌ పాలన మూలంగా రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా యువతకు స్థానికంగా సరైన ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి.


ఐటీకి సోకిన జగన్‌ వైరస్‌!

దేశంలో యువతకు అత్యధికంగా ఉద్యోగాలిస్తోంది ఐటీ-బీపీవో రంగమే. దానికి అమిత ప్రోత్సాహం దక్కుతున్న తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య తొమ్మిది లక్షలకు పైబడింది. మరి ఏపీలో ఎంతమంది ఉన్నారంటే- సమాధానం చెప్పలేం! దీనికి కారణం- జగన్‌ పెడసరపు పాలనే! రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు సర్కారు కృషితో ఏపీలో ఐటీ రంగం కొత్తగా మొగ్గతొడిగి మారాకు వేయడం ప్రారంభించింది. అంతలోనే అధికారంలోకి వచ్చిన జగన్‌ సర్కారు- ఐటీపై సవతితల్లి ప్రేమ చూపించింది. యువతకు ఉపాధిని, రాష్ట్రానికి రాబడిని అందించే కీలక ఐటీ రంగానికి జగన్‌ చేయూతనివ్వలేదు. పైగా గత ప్రభుత్వ శ్రమ ఫలితాలనూ దుంపనాశనం చేశారు. ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేందుకు డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ విధానాన్ని పాటించింది చంద్రబాబు ప్రభుత్వం. దాని ప్రకారం దరఖాస్తు చేసుకున్న కంపెనీలకు అద్దెలో రాయితీ, విద్యుత్‌, ఇంటర్నెట్‌ సౌకర్యాలను సమకూర్చేవారు. ఆయా సంస్థలు కల్పించే ఉద్యోగాలను బట్టి వాటికి నగదు ప్రోత్సాహకాలనూ అందించేవారు. మూర్ఖత్వమే తప్ప ముందుచూపు లేని జగన్‌ ఈ విధానాన్ని తీసిపడేశారు. దాంతో దాదాపు వంద చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. పెద్ద కంపెనీలైన ఐబీఎం, హెచ్‌ఎస్‌బీసీ సైతం జగన్‌ జమానాలోనే ఏపీకి వీడ్కోలు పలికేశాయి. దేన్నయినా సరే, పడగొట్టడమే తప్ప నిర్మించడం, నిలబెట్టడం వంటివి జగన్‌కు తెలియవు. ఆయన సీఎం పీఠం ఎక్కగానే విశాఖపట్నంలోని ‘స్టార్టప్‌ విలేజ్‌’కి రాంరాం చెప్పేశారు. దాంతో అంకుర సంస్థలెన్నో కుదేలయ్యాయి. కొత్త ఉద్యోగాల వెల్లువను సృష్టించని జగన్‌- తన పెడపోకడలతో ఉన్న ఉపాధి అవకాశాలకూ గండికొట్టారు. స్వరాష్ట్రంలో ఉద్యోగాలు లేక పరాయి రాష్ట్రాలకు యువత వలసపోవాల్సిన దుస్థితిని ఆయన తీవ్రతరం చేశారు. ఐటీ-బీపీవో కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌, రిటైల్‌, రవాణా, ఆహార, వినోదాలతో పాటు ఇతరేతర సేవల రంగాలూ వేగంగా అభివృద్ధి చెందుతాయి. కొన్ని లక్షల మందికి అవి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను అందిస్తాయి. ఏపీకి ఆ భాగ్యం లేకుండా చేయడమే కాదు- యువత భవితనూ జగన్‌ అన్యాయంగా చిదిమేశారు.


నైపుణ్య శిక్షణ.. జగనన్న భక్షణ!

మాటలతో ఆకాశానికి నిచ్చెనలు వేసే జగన్‌- ఆచరణలోకి వచ్చేసరికి అడుగు ముందుకు వేయరు. రాష్ట్రంకోసం ఏమీ చేయకపోగా- గత ప్రభుత్వం చేపట్టిన ఎన్నో మంచి పనులనూ ఆయన అకారణంగా అటకెక్కించారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకూ జగన్‌ అలాగే పాతరేశారు. ‘‘మన పిల్లలకు హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పించాలి’’ అని అధికారులకు సూక్తి ముక్తావళి బోధించారు జగన్‌. అదే చేతల్లోకి వచ్చేసరికి చంద్రబాబు మీద దుగ్ధతో సీమెన్స్‌ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటైన నైపుణ్య కేంద్రాలకు తాళాలు వేయించారు. రెండు లక్షల మందికి పైగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించింది సీమెన్స్‌ ప్రాజెక్టు. 70వేల మందికి పైగా పిల్లలు మంచి ఉద్యోగాలు పొందేందుకు అది దారిచూపించింది. అన్ని కుటుంబాల్లో వెలుగు నింపిన ప్రాజెక్టుపై బురదజల్లిన జగన్‌ చివరకు సాధించిందేంటి? చంద్రబాబు మీద అక్కసు తీర్చుకోవాలనే విపరీత మనస్తత్వంతో విద్యార్థులకు తీరని అన్యాయం చేశారాయన.


యువతకు శత్రువు.. రాష్ట్రానికి రాహువు!

‘‘యువతలో నైపుణ్యాలు పెంపొందించి వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు’’ అని సకల శాఖల మంత్రి సజ్జల ఆమధ్యన ఊదరగొట్టారు. జగన్‌కు నిజంగా అంత మంచి బుద్ధి ఉంటే- విశాఖపట్నం, తిరుపతిల్లో ఏర్పాటు చేస్తానన్న నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఎందుకు గాలికొదిలేశారు? సజ్జల మద్దెల కొట్టినట్టు జగన్‌కు అంత ఆలోచనే ఉంటే- నైపుణ్య కళాశాలల నిర్వహణను ఎందుకు తూతూమంత్రంగా మార్చారు? యువత మేలుకోసం ఉపాధి కల్పన కార్యాలయాలను మోడల్‌ కెరీర్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సమున్నతాశయానికి నీరుగార్చిన పాతకుడు ఎవరు- జగన్‌ కాదా? ఉద్యోగాల వేటలో నిరుద్యోగులకు మార్గదర్శనం చేస్తూ, వారికి తగిన కొలువులను చూపించేందుకు ఉపాధి కల్పన కార్యాలయాల ఆధునికీకరణకు కేంద్రం నడుంకట్టింది. 26 జిల్లాలతో పాటు ఆంధ్ర, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లోని మోడల్‌ కేరీర్‌ కేంద్రాల్లో ఒక్కో దానికి రూ.37.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నిధులిచ్చింది. వాటిని జగన్‌ సర్కారు వాడేసుకుంది కానీ, ఆయా కేంద్రాల అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదు. ఈ వాస్తవాలను మరుగునపడేసి, ‘‘ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం’’ అని మాటల గారడీ చేస్తున్న జగన్‌- యువతకు శత్రువు, రాష్ట్రానికి రాహువు!


జనం ముందు ఊసరవెల్లి వేషాలు

ప్రభుత్వోద్యోగాల భర్తీపై ప్రతిపక్షనేతగా జగన్‌ ఎన్ని చోట్ల ఎన్నెన్ని హామీలిచ్చారో లెక్కతేల్చడం కన్నా చుక్కలను లెక్కపెట్టడమే సులువు. ‘‘మనం అధికారంలోకి రాగానే చేయబోయే మొట్టమొదటి పని ఏమిటంటే.. ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ ఇస్తాం’’ అని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా యువతకు జగన్‌ వాగ్దానం చేశారు.  నిరుద్యోగులను అలా బులిపించి సీఎం అయిన ఆయన- ఆపై సొంత అజెండాతో అనేక విధ్వంసాలు చేశారు. అంతేతప్ప ఎన్నికలకు ముందు మాటిచ్చినట్లు- ఏపీపీఎస్సీ ద్వారా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనేలేదు. మొన్న ఫిబ్రవరి 20వ తేదీ నాటికి ఏపీపీఎస్సీ ద్వారా 2,210 పోస్టుల భర్తీకి మాత్రమే ప్రకటనలు జారీచేయించారు జగన్‌. వాటిలోనూ సగం గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే. మొత్తమ్మీద ఏపీపీఎస్సీ ద్వారా చేస్తానన్న పోస్టుల భర్తీలో వైకాపా అధినేత చేసింది.. కేవలం 1.1శాతం! అలాంటి జగన్‌ ఇప్పుడు జనం ముందుకొచ్చి ఊసరవెల్లి వేషాలు వేస్తున్నారు. మ్యానిఫెస్టోలో తామిచ్చిన హామీల్లో 99శాతాన్ని నెరవేర్చేశామని సిగ్గుమాలిన సొంతడబ్బా కొట్టుకుంటున్నారు.


జగన్‌ వాగ్దానాలు.. కాకమ్మ కథలు!

ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్న వాగ్దానానికి జగన్‌ సమాధి కట్టేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే కడప స్టీల్‌ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించి, మూడేళ్లలో వాటిని పూర్తిచేసి, 10వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చూస్తానని జగన్‌ ఇంకో ఒట్టు వేశారు. అలవాటు ప్రకారం దాన్నీ గట్టున పెట్టేశారు. పోలీసు శాఖలో నాలుగేళ్ల పాటు ప్రతి ఏటా 6500 ఉద్యోగాలను భర్తీచేస్తామని 2020లో జగన్‌ యమగట్టిగా హామీ ఇచ్చారు. తరవాత ఏం జరిగిందో ఎవరం అడగకూడదు... జగన్‌ అలా హామీ ఇచ్చి ఊరుకున్నారంతే! ఇక మెగాడీఎస్సీ అని ఊరించి ఊరించి నిరుద్యోగులను నిలువునా దగా చేసిన వైకాపా అధినేత కుటిలత్వమైతే మాటల్లో వర్ణించలేనిది. సకాలంలో నియామకాలు చేపట్టని జగన్‌ ప్రభుత్వం కారణంగా ఎంతోమంది యువతీ యువకులకు సర్కారీ కొలువులకు వయసు దాటిపోయింది. అటు పరిశ్రమలను చావుదెబ్బ తీసి, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలను పేరపట్టిన జగన్‌- నిరుద్యోగులను నరకయాతనకు గురిచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని