గుండెలపై ‘ట్యాప్‌’ కుంపటి!

ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయనిపుణులు, జర్నలిస్టులు, చిన్నపాటి నాయకులు, ఒకస్థాయి ఉన్న ఎవర్ని కదిలించినా.. తమను ఎవరో వెంటాడుతున్నారనే భయం... ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారనే వణుకు... దాని ఆధారంగా ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే ఆందోళన.. ఎక్కడైనా నలుగురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కలిసినా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కన్పిస్తున్నాయి.

Updated : 21 Mar 2024 08:30 IST

ప్రతి ఒక్కరిలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ భయం
తన, పర భేదాలు లేకుండా నిరంతర నిఘా
సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటున్న నేతలు, ఉన్నతాధికారులు
జగన్‌ పాలనలో అయిదేళ్లుగా ఇదే పరిస్థితి

‘నేను ఉన్నాను.. నేను విన్నాను...’
ఐదేళ్ల కిందట జగన్‌ స్లోగన్‌ ఇది!
విన్నాను... వింటాను అంటే...
సమస్యలను వింటారేమో...
పరిష్కరిస్తారేమోనని అంతా భావించారు..
అయితే, అందరి చరవాణుల్లో చొరబడి..
చోరవాణి చేస్తారని అనుకోలేదు!
ఎవరైనా ఫోన్లో మాట్లాడితే చాలు...
అదేంటో... అన్నకు చప్పున తెలిసిపోతోంది!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. అన్న మనుషులు ఇంటి ముందు వాలిపోతున్నారు...
విపక్షాలే కాదు... స్వపక్ష నేతలూ...
ఐఏఎస్‌, ఐపీఎస్‌లాంటి ఉన్నతాధికారులు
ఉద్యమకారులు, హక్కుల వీరులు...
ఆఖరికి విలేకరులు... సామాన్యులు... ఎవరిదైనా ఇదే స్థితి!
భయంభయంగా బతకాల్సిన పరిస్థితి!
నోరు తెరవటానికి.. స్వేచ్ఛగా మాట్లాడటానికి.. ఫోన్లు దగ్గర పెట్టుకోవటానికీ భయపడాల్సిన దుస్థితి!
ఇదీ... రాష్ట్రంలో వైకాపా చోరవాణి రాజకీయం...
పరాకాష్ఠకు చేరిన ప్రై‘వశీకరణ’..
ఇవన్నీ వైకాపా సర్కారు వారి ‘ట్యాప్‌’స్టోరీస్‌!!

ఈనాడు - అమరావతి

  • ఆయన అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్‌ రాజకీయ నేత. తనతో మాట్లాడేందుకు ఎవరు వచ్చినా వారి మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్విచ్‌ ఆఫ్‌ చేయిస్తారు. అయినా వాటిలోని మైక్రోఫోన్లు రికార్డు చేస్తాయనే భయంతో వాటిని దూరంగా మరో గదిలో పెట్టిస్తారు. తన ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసి అక్కడే పెడతారు. అక్కడి వరకు వెళ్లలేకపోతే... స్విచ్‌ ఆఫ్‌ చేసి సోఫా సీట్ల మధ్య కుక్కేస్తారు. తమ సొంత పార్టీ పాలనలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ భయం ఆయన్ని అంతగా వెంటాడుతోంది మరి!
  • ఆయనో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. అయిదేళ్ల కిందటి వరకు ఎవరు ఫోన్‌ చేసినా స్పందించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక సాధారణ కాల్స్‌ మాట్లాడటమే మానేశారు. తప్పదనుకుంటే వాట్సప్‌లోనే మాట్లాడేవారు. అదీ సురక్షితం కాదని తోటి అధికారులు చెప్పడంతో తర్వాత టెలిగ్రామ్‌... ప్రస్తుతం సిగ్నల్‌ యాప్‌ ద్వారా మాట్లాడుతున్నారు. ఐఫోన్‌ ఉన్న వారితో మాత్రం ఫేస్‌టైమ్‌లో కాల్స్‌ చేస్తున్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయనిపుణులు, జర్నలిస్టులు, చిన్నపాటి నాయకులు, ఒకస్థాయి ఉన్న ఎవర్ని కదిలించినా.. తమను ఎవరో వెంటాడుతున్నారనే భయం... ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారనే వణుకు... దాని ఆధారంగా ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే ఆందోళన.. ఎక్కడైనా నలుగురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కలిసినా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కన్పిస్తున్నాయి. ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా.. పక్కనున్న ఫోన్‌ నుంచి తమ మాటల్ని ఎవరు వింటున్నారో అని కలవరానికి గురవుతున్నారు. సాధారణ కాల్స్‌ నుంచి మొదట్లో వాట్సప్‌ కాల్స్‌కు మారారు. అదీ సురక్షితం కాదని టెలిగ్రామ్‌ ద్వారా మాట్లాడారు. ఇప్పుడు అది కూడా ట్యాప్‌ చేసే అవకాశం ఉందనే భయంతో.. సిగ్నల్‌ యాప్‌లోకి చేరారు. అప్పు చేసైనా ఐఫోన్‌ కొనుక్కుని మాట్లాడటమే నయమనే భావనకు వస్తున్నారు. కాస్త డబ్బు సమకూర్చుకోగలిగిన వారైతే... 15 రోజులు, నెలకో ఫోన్‌ మార్చుకుంటున్నారు. అరాచకాలకు అడ్డాగా తయారైన జగన్‌ ప్రభుత్వ పనితీరే వీరందరిని ఇంతగా బెంబేలెత్తిస్తోంది. తమను అనుక్షణం ఎవరో వెంటాడుతున్నారనే అభద్రతాభావానికి గురిచేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో  
పోస్టులు పెట్టే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న సర్కారు.. మొబైల్‌ ఫోన్‌లోనూ స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు కల్పిస్తుందనే ఆందోళన వివిధ వర్గాలకు చెందినవారిని అనుక్షణం వెంటాడుతోంది.

మొబైల్‌ ఫోన్‌ ఉందా... నోరు కట్టేసుకోవడమే నయం 

మన మొబైల్‌ ఫోన్‌... జేబులోనే కాదు, సమీపంలో ఎక్కడున్నా మనల్ని ఎవరో వెంటాడుతున్నట్లే లెక్క. మాట్లాడే ప్రతి మాటా.. రహస్యంగా వినేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుకే ఒకస్థాయి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు, మీడియా రంగానికి చెందిన వారంతా నోరు కట్టేసుకోవడమే మంచిదనే నియమాన్ని పాటిస్తున్నారు. నిఘా విభాగంలో పనిచేసే వారూ అనుక్షణం ఆచి తూచి మాట్లాడాల్సిందే. ట్యాపింగ్‌కు తమ, పర భేదం లేదన్నట్లుగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. చాలామంది అధికారులు, నేతలైతే అయిదేళ్లుగా సాధారణ కాల్స్‌ చేయడమనే మాటే మరచిపోయారు. మెసేజెస్‌ కూడా చేయడంలేదు. వాట్సప్‌, సిగ్నల్‌, ఫేస్‌టైమ్‌ ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల్లో 90% మంది ఎవరితో ఫోన్లో మాట్లాడాలన్నా వణికిపోయే పరిస్థితి ఉండటమే.. రాష్ట్రంలోని అరాచకపాలనకు అద్దం పడుతోంది. వాస్తవానికి ఒకరి మొబైల్‌ ట్యాప్‌ చేయకపోయినా.. ఫోన్లో మాట్లాడే అవతలి వ్యక్తి మొబైల్‌ ట్యాప్‌ చేసినప్పుడు వారితో మాట్లాడినవన్నీ బయట కొస్తున్నాయి. కొందరు నేతల విషయంలో ఇదే జరిగింది.

లింక్‌ పంపి ట్రాక్‌ చేసేందుకు అవకాశం

మొబైల్‌కు లింక్‌ పంపి... దాన్ని క్లిక్‌ చేయించేలా చూడటం ద్వారా ఫోన్‌ ట్రాక్‌ చేస్తున్నారు. ట్రాకింగ్‌ మొదలైన తర్వాత మైక్రో ఫోన్‌ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. సంబంధిత వ్యక్తి ఫోన్లోనే కాకుండా, దాన్ని పక్కన పెట్టుకుని ఎప్పుడు, ఎవరితో ఏం మాట్లాడినా అవన్నీ రికార్డు అవుతూనే ఉంటాయి. వీడియో ఆన్‌ చేసి.. చుట్టూ ఎవరున్నారో కూడా రికార్డు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎన్నో స్పైవేర్లు వచ్చాయి. కావాలనే వీటిని నిర్దేశిత వ్యక్తుల ఫోన్లలో చొప్పించి, వారి ఫోన్లను తమ నియంత్రణలోకి తీసుకుంటారు. అందుకే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు, లేనివారు కూడా సాధ్యమైనంత వరకు ఫోన్‌కు దగ్గరగా ఏదీ మాట్లాడటం లేదు. ఫోన్‌ దగ్గర ఉంచుకుని కుటుంబ రహస్యాలు మాట్లాడాలన్నా భయమే. అందుకే చాలామంది పడక గదికి దూరంగా ఉంచుతున్నారు.

హక్కుల పోరాటమా... అదీ వైకాపా ప్రభుత్వంలోనా?

హక్కుల కోసం పోరాడే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాల నేతలు... వివిధ ప్రజా సంఘాల, గుత్తేదారుల యూనియన్ల నాయకులూ వణికిపోవాల్సిందే. ఎవరితోనైనా మాట్లాడితే చాలు.. గంటల వ్యవధిలోనే పోలీసులు వారందరి ఇళ్ల వద్దకు చేరుకుని నిఘా పెడుతున్నారని వివిధ సంఘాల నేతలు వాపోతున్నారు. ‘మేం ఎవరితో ఫోన్లో మాట్లాడామో వారి ఇళ్లకే వెళ్లి సంఘాల సమావేశాలకు వెళ్లొద్దంటూ నోటీసులిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ లేకుంటే.. వారితోనే మాట్లాడామనే సంగతి ఎలా తెలుస్తుంది’ అనే ప్రశ్న వారిలో వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ యూనియన్ల నుంచి.. అంగన్‌వాడీ సంఘాల నేతల వరకు.. హామీ నెరవేర్చాలని కోరే నిరుద్యోగుల సంఘం ప్రతినిధులు మొదలు చేసిన పనులకు బిల్లులు ఇవ్వమని కోరే గుత్తేదారుల సంఘం వరకు అందరిలోనూ ట్యాపింగ్‌ భయమే.

ప్రతికూల వార్త వచ్చిందంటే.. వణుకే...

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో ఏదైనా ప్రతికూల వార్త వచ్చిందంటే.. ఆ రోజు సంబంధిత కార్యాలయ అధికారులంతా భయంతో వణికిపోవడమే. ఉదయం 7 గంటల లోపే సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ వస్తుంది. అక్కడ నుంచి అందరిలోనూ హడావుడే. సంబంధిత విలేకరి కార్యాలయానికి వచ్చి ఎవర్ని కలిశారో ఆరా తీస్తారు. లేదంటే ఆయనతో ఎవరెవరు ఫోన్‌లో మాట్లాడారో తెలుసుకునేందుకు అక్కడి ఉన్నతాధికారులే ప్రయత్నిస్తారు. అందుకే సెక్షన్‌ అధికారుల నుంచి డైరెక్టర్ల వరకు పత్రికా విలేకరుల నుంచి ఏదైనా అంశానికి సంబంధించి ఫోన్‌ వస్తే చాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ వెంటనే ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లి ఫలానా విలేకరి ఫోన్‌ చేశాడని, తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. నాలుగేళ్లుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ అధికశాతం ఉద్యోగులు ఇలాంటి  భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారంటే.. వైకాపా ప్రభుత్వం అధికార వర్గాలను కూడా ఎంతలా వణికిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఏపీలో తెలంగాణను మించిన పరిస్థితులు...?

తెలంగాణలోని ఎస్‌ఐబీ విభాగంలో పనిచేసిన డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్టు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చనీయాంశమైంది. అక్కడ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన ఆధీనంలోని 17 కంప్యూటర్లలో సమాచారాన్ని తొలగించి, హార్డ్‌డిస్క్‌లను ఆయన ధ్వంసం చేశారు. అప్పటి అధికార పార్టీ నేతలే ఆయన ద్వారా తమకు వ్యతిరేకులైన వారి ఫోన్లను ట్యాప్‌ చేయించారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అవన్నీ బయటకొస్తాయనే భయంతోనే.. ఇలా చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతకుమించిన భయాలు అన్ని వర్గాలనూ వెంటాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు.

ఎన్నికల సంఘమే.. స్వేచ్ఛ కల్పించాలి!

ఫోన్‌ ట్యాపింగ్‌పై కిందిస్థాయి ఉద్యోగులు, నేతల నుంచి ఉన్నతస్థాయిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్‌ అధికారుల వరకు అందరిలోనూ భయాందోళనలే. అధికారాన్ని ఉపయోగించి అడ్డదారుల్లో నడుస్తున్న వైకాపా సర్కారు తీరుతోనే వారంతా కలవరపడుతున్నారు. ఇంటెలిజెన్స్‌లో వివిధ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా.. ఎవరి ఫోన్‌ అయినా ట్యాప్‌ చేసేంత సాంకేతికతను సమకూర్చుకున్నారనే ఆందోళనే దీనంతటికీ కారణం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక బృందాలతో నిఘా విభాగాన్ని జల్లెడ పట్టి అక్కడేం జరుగుతుందో తెలుసుకోవడంతోపాటు దాన్ని వందశాతం స్వచ్ఛీకరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది.


ట్యాపింగ్‌కు దొరకొద్దని కష్టాలు

  • తరచూ ఫోన్‌ ఫార్మాట్‌: తమను ట్రాక్‌ చేస్తున్నారనే భయంతో.. కొందరు నేతలు, అధికారులు తమ ఫోన్‌లను తరచూ ఫార్మాట్‌ చేయిస్తున్నారు. ఏ లింక్‌ పంపి.. బగ్‌ను ఇన్‌స్టాల్‌ చేశారో తెలియదని, అందుకే ముందు జాగ్రత్తగా నెలకోసారి అందులోని మొత్తం సమాచారాన్ని తుడిచేయిస్తున్నారు. గతంలో ఫలానా మెసేజ్‌లు ఫార్వర్డ్‌ చేశావంటూ అక్రమ కేసులు పెట్టి వేధిస్తారని కొందరు భయపడుతున్నారు.
  • అవసరమైతే 15-30 రోజులకో కొత్త ఫోన్‌: ఆర్థికంగా ఇబ్బంది లేని కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ప్రతి 15-30 రోజులకు ఫోన్లను మారుస్తున్నారు. కొందరు అధికారులు తాము పెట్టిన మెసేజ్‌లు కొంత సమయం తర్వాత డిలీట్‌ అయ్యేలా ఆప్షన్‌ పెట్టుకుంటున్నారు. రాజకీయ నేతల్లో చాలామంది తాము ఎక్కడున్నామో తెలియకుండా ఫోన్‌ లొకేషన్‌ను ఆపేస్తున్నారు.
  • బంధువుల పేర్లతో నంబరు: తమ ఫోన్‌ ట్యాప్‌ అవుతుందనే భయం ఉన్న వారు... బంధువుల పేర్లతో మరో నంబరు తీసుకుని దాని ద్వారా మాట్లాడుతున్నారు.
  • ఫోన్లకు అనుమతి నిరాకరణ: సచివాలయంలో ఒక ఐఏఎస్‌ అధికారి ఛాంబర్‌లోకి వెళ్లాలంటే... ఫోన్‌ బయటే వదిలేసి వెళ్లాలి. మరో ఐఏఎస్‌ అధికారి అయితే తన దగ్గరకు వచ్చేవాళ్లు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసిందాకా ఊరుకోరు. కీలక విషయాలేమైనా మాట్లాడాల్సి వస్తే తన ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేసేస్తారు. అప్పుడుగానీ ప్రశాంతంగా మాట్లాడలేరు. వాట్సప్‌లో... నిమిషం మాట్లాడాక కట్‌ చేస్తారు. నిమిషం దాటితే ట్యాపింగ్‌కు అవకాశం ఉంటుందనేది ఆయన అనుమానం.
  • ఏడాదికి రూ.10 వేలతో వీపీఎన్‌: ప్రముఖ ఐటీ సంస్థల ఉద్యోగులు సమాచార భద్రతలో భాగంగా వీపీఎన్‌ (వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌) ఉపయోగిస్తుంటారు. దీనికి ఏడాదికి రూ.10 వేల వరకు అవుతుంది. ఇదెంతో సురక్షితం. ఎవరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారో గుర్తించే అవకాశాలు ఉండవు. అది ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేస్తుంది. కాల్స్‌ చేసే సమయంలో ఐపీ చిరునామాను దాచిపెట్టి, అదనపు భద్రత కల్పిస్తుంది. వివిధ దేశాల సర్వర్లతో ఈ నెట్‌వర్క్‌ అనుసంధానమై ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్‌ పుణ్యమా అని అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వీపీఎన్‌ ఉపయోగించుకోవాల్సి వస్తోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు