తెలంగాణలో భేష్‌.. ఏపీలో తుస్‌!

ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రం మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారింది.

Updated : 27 Mar 2024 06:15 IST

రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది కొరత
హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల వెనకడుగు
గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల పనులూ నత్తనడక
తెలంగాణలో రూ.5 వేల కోట్లతో ఐదు సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాల నిర్మాణం
మెడికల్‌ కళాశాలల ఏర్పాటులోనూ ముందంజే..
పక్క రాష్ట్రాన్ని చూసి కూడా పాఠాలు నేర్వని జగన్‌
ఈనాడు, అమరావతి

నవజాత శిశువుల కోసం ఆసుపత్రులు కడతామన్నారు..
స్థల సేకరణతో ఆపేశారు.
గిరిజనుల కోసం అయిదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులన్నారు..
పునాదుల దశ దాటడమే కష్టమైంది.
దవాఖానా కడతామంటే స్థలం ఉచితంగా ఇస్తామన్నారు.
నమ్మకం లేక పారిశ్రామికవేత్తలెవరూ ముందుకు రాలేదు.
సరిపడా సూపర్‌ స్పెషలిస్టు వైద్యులు లేక.. నర్సులు, సిబ్బందిని నియమించక.. ఆంధ్రావనిలో మెరుగైన వైద్యం మిథ్యగా మారింది.


  • అందుకే.. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ.. ఏపీకి టాటా చెబుతూ వైద్యం కోసం తెలంగాణ బాట పడుతున్నారు.
  • వైద్య రంగంలో అక్కడి పురోగతిని పోల్చుకొని సిగ్గుపడుతున్నారు.
  • జగన్‌ పాలనలో నాడి పట్టే వ్యవస్థ గాడి తప్పి అస్తవ్యస్తమైంది. 

ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రం మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఈ విషయంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ దూసుకెళ్తుంటే.. జగన్‌ పాలనా వైఫల్యంతో ఆంధ్ర వెనకబడిపోయింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతోపాటు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల్లోనూ తెలంగాణ పకడ్బందీ ప్రణాళికలతో ముందుంది. ఆ రాష్ట్రంలో కొత్తగా ఐదు సూపర్‌ స్పెషలిటీ ఆసుపత్రులు రాబోతున్నాయి. మన దగ్గర మాత్రం అందుకు భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లుగా ప్రకటనలతోనే కాలయాపన చేస్తూ.. రోగులకు చుక్కలు చూపించింది. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత వేధిస్తున్నా.. భర్తీ మాటే ఎత్తలేదు. అవసరానికి తగినట్లుగా వైద్య సేవలను విస్తరించలేదు. ఇక్కడి ప్రజాప్రతినిధులంతా మెరుగైన వైద్యానికి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు బాట పడుతుండటమే ఇందుకు నిదర్శనం. చిన్నారులకు వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రే దిక్కుగా మారింది. ‘నాడు-నేడు’లో భాగంగా రూ.3,500 కోట్లతో బోధనాసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని జగన్‌ గొప్పలకు పోయినా.. నిధులు లేక అడుగు కూడా ముందుకు పడలేదు.


వైద్యులు లేరు.. నర్సులు, సిబ్బంది సరిపోరు.. 

ఏపీలో వైద్య విద్య సంచాలకులు (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌-డీఎంఈ) పరిధిలో 22 బోధనాసుపత్రులు ఉన్నాయి. గతేడాది నుంచి రెండు దశల్లో కొత్తగా 10 బోధనాసుపత్రులు (వైద్య కళాశాలలు) డీఎంఈ పరిధిలోకి వచ్చాయి. అన్ని బోధనాసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల కొరత వేధిస్తోంది. రోగులు వస్తున్నా.. వారి అవసరాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు లేవు. గతేడాది ఏర్పాటైన ఏలూరు, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాల బోధనాసుపత్రుల్లో సరిపడా నర్సులు, ఇతర సిబ్బంది లేరు. ఒక్కో ఆసుపత్రిలో నాలుగో తరగతి సిబ్బంది కనీసం వంద మంది వరకు అవసరం ఉంటుంది. వారు లేకపోవడంతో రోగుల బాగోగులను బంధువులే చూసుకోవాల్సి వస్తోంది. మాతా, శిశు సంరక్షణ ఆసుపత్రుల్లో ఒక పడకపై ఇద్దరు బాలింతలు చికిత్స పొందే పరిస్థితులు గుంటూరు, విజయవాడల్లోనూ కనిపిస్తున్నాయి.


కాగితాలపైనే చిన్న పిల్లల ఆసుపత్రులు

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని 2021 జూన్‌ 7న వైకాపా సర్కారు ప్రకటించింది. ఒక్కోదానికి రూ.186 కోట్ల చొప్పున మొత్తం రూ.558 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్ల కోసం ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణ జరిగినా ఇప్పటివరకు ఇటుక కూడా పడలేదు. ఒక్కో ఆసుపత్రిలో 500 పడకలు ఉండేలా.. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులతో అన్ని రకాల శస్త్రచికిత్సలు జరిగేలా చూస్తామని జగన్‌ చెప్పినా.. అవి ఉత్తుత్తి మాటలేనని తేలిపోయింది. ఆరోగ్యశ్రీ కింద చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేసే ఆసుపత్రులు రాష్ట్రంలో రెండు మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.


తెలంగాణలో 50వేలు... ఆంధ్రాలో 32వేలు

తెలంగాణలో అందుబాటులోకి రానున్న సూపర్‌ స్పెషాలిటీల్లోని 8,500 పడకలతో కలిపితే.. ప్రభుత్వ పరంగా మొత్తం 50 వేల పడకలు అందుబాటులో ఉన్నట్లు లెక్క. రూ.5,435 కోట్లతో చేపట్టిన ఈ కొత్త ఆసుపత్రుల నిర్మాణాలు హైదరాబాద్‌ చుట్టుపక్కల, వరంగల్‌ నగరంలో జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన సిబ్బంది నియామకాల ప్రక్రియ కూడా మొదలైంది. ఇవన్నీ జాతీయ రహదారులకు చేరువలోనే ఉండటంతో క్షతగాత్రులకు అత్యవసర సమయం(గోల్డెన్‌ అవర్‌)లో మెరుగైన చికిత్స అందనుంది. ఏపీలో మాత్రం వైద్య సేవలు మెరుగుపరుస్తామని జగన్‌ పలుమార్లు ప్రకటించినా.. అవేమీ కార్యరూపం దాల్చలేదు. 2022లో గిరిజన ప్రాంతాల్లో అయిదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల భవన నిర్మాణాలు ప్రారంభించగా.. పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 హెల్త్‌ క్లబ్బులు ఏర్పాటు చేస్తామని జగన్‌ ప్రకటించినా.. అమలుకు నోచుకోలేదు.

రూ.100 కోట్ల పెట్టుబడితో ఆసుపత్రుల ఏర్పాటుకు ముందుకు వస్తే.. ఉచితంగా భూమి ఇస్తామని ప్రభుత్వం 2021 నవంబరులో ప్రకటించింది. పలుమార్లు టెండర్లు కూడా పిలిచింది. అయినా ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థలు ఆసక్తి కనబరచకపోవడం గమనార్హం. రాజమహేంద్రవరం, ఒంగోలులో ఏర్పాటుకు రెండు వేర్వేరు సంస్థలు అతికష్టంపై ముందుకొచ్చినా పనులు మాత్రం కార్యరూపం దాల్చలేదు. విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాల్లో పిల్లల ఆసుపత్రుల నిర్మాణ పనులూ కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో అన్ని రకాల ఆసుపత్రుల్లో కలిపి 32 వేల వరకు పడకలు ఉండగా.. ఇందులో 3 వేల వరకు మాత్రమే సూపర్‌ స్పెషాలిటీ విభాగంలోనివి. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో రోజూ నమోదయ్యే ఓపీలో 25 శాతం నుంచి 30 శాతం వరకు ఏపీ వాళ్లే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


బోధనాసుపత్రుల వారీగా సూపర్‌ స్పెషలిస్టు వైద్యుల కొరత

  • విశాఖలోని ‘విమ్స్‌’లో ఇప్పటి వరకు కార్డియో థొరాసిక్‌ సర్జరీ, నెఫ్రాలజీ, రేడియేషన్‌  ఆంకాలజీ విభాగాల్లో  వైద్యులు లేరు.
  • విశాఖ కేజీహెచ్‌లో ఈఎన్‌టీ సర్జరీ, సైకియాట్రీ, ఆఫ్తామాలజీ సర్జరీ, రుమటాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కాకినాడ జీజీహెచ్‌లో ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ సర్జరీ, రుమటాలజీ విభాగాల్లో వైద్యుల కొరత ఉంది.
  • విజయవాడ జీజీహెచ్‌లో ఎండో క్రైనాలజీ, రేడియేషన్‌ ఆంకాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, గుంటూరు జీజీహెచ్‌లో సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ విభాగాల్లో వైద్యులు లేరు.
  • ఒంగోలు జీజీహెచ్‌లో కార్డియో థొరాసిక్‌ సర్జరీ, మెడికల్‌ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెల్లూరు జీజీహెచ్‌లో కార్డియో థొరాసిక్‌ సర్జరీ, కార్డియాలజిస్టుల అవసరం ఉంది. 
  • తిరుపతి రుయాలో కార్డియో థొరాసిక్‌ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, రేడియేషన్‌ ఆంకాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఆంకాలజీ విభాగాల్లో   స్పెషలిస్టులు లేరు.
  • అనంతపురం జీజీహెచ్‌లో కార్డియో థొరాసిక్‌ సర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ, రుమటాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, యూరాలజీ విభాగాల్లో వైద్యుల కొరత ఉంది.

గిరిజనులపై కపట ప్రేమ

గిరిజనులపై వైకాపా ప్రభుత్వం కపట ప్రేమను కనబరుస్తోంది. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాల (ఐటీడీఏ)లలో రూ.49.26 కోట్ల చొప్పున రూ.246.30 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి 2020 సెప్టెంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సంబంధిత పనులను 2021లో సీఎం వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ నిర్మాణాలు పూర్తయితే.. ఓపీ సేవలతోపాటు జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనిక్‌, డెంటల్‌, పీడియాట్రిక్‌ సేవలు రోగులకు అందుబాటులోకి వచ్చేవి. సుమారుగా 50మంది వైద్య నిపుణులు నియామకం కానున్నారు. 20 డయాలసిస్‌, 20 జనరల్‌ ఐపీ, 21 ఎస్‌ఐసీయూ, 10 ఎంఐసీయూ, ఆర్థో విభాగంలో 30 పడకలు అందుబాటులోకి వచ్చేవి. కానీ, పనులన్నీ నత్తనడకన సాగుతుండటంతో గిరిజనులకు మెరుగైన వైద్యం కలగానే మిగిలింది. వాటి నిర్మాణాల పురోగతిపై సమీక్షించే వారే కరవయ్యారు.  


ఇలాగేనా క్యాన్సర్‌కు వైద్యం? 

ర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్‌ ఆసుపత్రిని ఇటీవల ప్రారంభించినా.. అది ప్రాథమిక వైద్య సేవలకే పరిమితమైంది. కీలకమైన లీనియర్‌ యాక్సిలరేటర్‌-1 విభాగాన్ని ఏర్పాటు చేయలేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఈ ఒక్క పరికరం ఖరీదే రూ.54కోట్లు ఉంటుంది. మొత్తం 250 మంది వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది అవసరం ఉండగా.. 17 మంది వైద్యులు, 20 మంది ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. కీలకమైన ఉపకరణాలు లేకుండా క్యాన్సర్‌ వైద్యం ఎలా అందించాలో జగన్‌కే తెలియాలి. కర్నూలు జీజీహెచ్‌లోనూ సాధారణ క్యాన్సర్‌ వైద్య సేవలే అందుతున్నాయి.  


అవయవ మార్పిడిలోనూ వెనకబాటే..

ప్రభుత్వ వైద్య సేవల్లో అవయవ మార్పిడిని కూడా తెలంగాణ ప్రభుత్వం ఓ భాగంగా చేసింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌తోపాటు గాంధీ ఆసుపత్రిలోనూ అందుకు అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ కిడ్నీ, కాలేయం, గుండె తదితర అవయవ మార్పిడిలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏపీ నుంచి ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే ఈ రకమైన శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ విషయంలోనూ ఏపీ వెనకబడింది. ఇటీవలే కర్నూలు జీజీహెచ్‌, విశాఖ కేజీహెచ్‌లో ఒక్కో కిడ్నీ మార్పిడి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని