ఇక్కడే ఎందుకో ఈ ని‘బంధనాలు’!

‘‘ఇంటింటి ఎన్నికల ప్రచారానికి కూడా అనుమతి తీసుకోవాలా? కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఈ నిబంధన లేదు.

Published : 27 Mar 2024 04:37 IST

‘ఇంటింటి ప్రచారానికి అనుమతి’పై వివిధ పార్టీల నేతల అభ్యంతరం
సీఈఓకు తమ అసంతృప్తి తెలియజేసినట్లు వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘‘ఇంటింటి ఎన్నికల ప్రచారానికి కూడా అనుమతి తీసుకోవాలా? కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఈ నిబంధన లేదు. నిరుడు డిసెంబరులో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో సైతం ఈ తరహా నియమాలేవీ లేవు. మీరు ఇక్కడ పెట్టడమేంటి?’’ అని తెదేపా సహా పలు పార్టీల నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వద్ద అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో తెదేపా, జనసేన, వైకాపా, భాజపా, వామపక్ష, తదితర రాజకీయ పార్టీల నేతలతో సీఈఓ సమావేశం నిర్వహించారు. సభలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలకు 48 గంటల ముందుగానే ‘సువిధ’ పోర్టల్‌ ద్వారా సంబంధిత రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో)కి దరఖాస్తు చేసుకోవాలని.. పోర్టల్‌ పనితీరును  సీఈఓ వివరించారు.  వాటిని పరిశీలించాక 24 గంటల్లోనే అనుమతులిస్తారని ఆయన తెలిపారు.సమావేశంఅనంతరం సీఈఓకు తెలిపిన అభ్యంతరాలను విలేకర్ల సమావేశంలో నేతలు వెల్లడించారు.


మా ఫిర్యాదులపై సీఈఓ స్పందించడం లేదు

- బొండా ఉమామహేశ్వరరావు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు 

‘‘చిన్న స్థాయి ప్రచార కార్యక్రమాలకు సైతం అనుమతులు తీసుకోవటం అభ్యంతరకరమైన విధానమని సీఈఓకి చెప్పాం. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు లేనిపోని నిబంధనలు పెట్టి, అధికార పార్టీ వారు కుక్కర్లు, చీరలు, డబ్బు, మద్యాన్ని యథేచ్ఛగా పంచుతున్నా సీఈఓ స్పందించడం లేదు. చర్చిలు, మసీదులను సైతం ఎన్నికల ప్రచారం కోసం వాడుతున్నారు. వైకాపా నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే సీ-విజిల్‌ ద్వారా ఫిర్యాదులు చేశాం. అయినా వాటిపై చర్యలు లేవు. ఇదేనా పారదర్శకత? తెదేపా ఇచ్చిన ఫిర్యాదులపై సీఈఓ చర్యలు తీసుకోవాలి.’’


సజ్జల భార్గవ్‌రెడ్డి వాహనాన్ని తనిఖీ చేయరా?

-వర్ల రామయ్య, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు

‘‘సజ్జల భార్గవ్‌రెడ్డి వాహనంలో రూ.8 కోట్లు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నా వారిని తనిఖీ చేయడం లేదు. మరోవైపు ఎన్నికల నిబంధనలు పాటిస్తున్న తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రచారానికి వాహనాల తనిఖీల పేరుతో తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు ఇంకా వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని ఓ మసీదులో డబ్బు పంచడంపై ఆధారాలతో సహా సంబంధిత ఆర్వోకి ఫిర్యాదు చేస్తే అధికార పార్టీ కాబట్టి వారిపై చర్యలు తీసుకోలేమని చెప్పడమేంటి? అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతిపైనా సీఈఓకు ఫిర్యాదు చేశాం. ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా ఆర్జించిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వైకాపా ప్రయత్నిస్తోంది. ఇసుక తవ్వకాలపై అన్ని జిల్లాల నుంచి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ కోరినా పంపకుండా కలెక్టర్లు తాత్సారం చేస్తున్నారు’’


నిబంధనలపై పునఃపరిశీలన చేయాలి

- వై.వెంకటేశ్వరరావు, సీపీఐ (ఎం) నేత

‘‘ఎన్నికల ప్రచారంలో కరపత్రాల పంపిణీకి సైతం అనుమతి తీసుకోవాలనే నిబంధన సహా పలు అంశాలపై పునఃపరిశీలన చేయాలని సీఈఓను కోరాం. రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాల దగ్గర ఏర్పాటు చేసిన జెండాలు, బ్యానర్లు తొలగించకుండా ఆదేశాలివ్వాలని, మేడే నిర్వహణకు ఎలాంటి ఆంక్షలూ పెట్టొద్దని విన్నవించాం’’


ప్రతి దానికీ అనుమతులంటే కష్టం

-మల్లాది విష్ణు, వైకాపా ఎమ్మెల్యే

‘‘ఇంటింటి ఎన్నికల ప్రచారానికి, ఆఖరికి పాంప్లెట్ల పంపిణీకి కూడా అనుమతులు తీసుకోవడం చాలా కష్టం. ఇదే విషయాన్ని సీఈఓకు వివరించాం. ప్రచారానికి 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలనే నిబంధనను సడలించాలని కోరాం’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని