అరాచక వైకాపాను ఓడిద్దాం

‘చంద్రబాబును అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన్ని జైల్లో కలిసినప్పుడు తన కోసం ప్రాణాలు విడిచిన ప్రతి కుటుంబాన్నీ పరామర్శించి ధైర్యం చెప్పమన్నారు.

Updated : 27 Mar 2024 06:12 IST

‘నిజం గెలవాలి’ యాత్రలో నారా భువనేశ్వరి

ఈనాడు, ఏలూరు: ‘చంద్రబాబును అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన్ని జైల్లో కలిసినప్పుడు తన కోసం ప్రాణాలు విడిచిన ప్రతి కుటుంబాన్నీ పరామర్శించి ధైర్యం చెప్పమన్నారు. ప్రస్తుతం మీరు కుటుంబసభ్యులను కోల్పోయి ఎంత బాధలో ఉన్నారో నాకు తెలుసు. మీరెవరూ అధైర్యపడొద్దు. మీ కుటుంబాలకు మేం అండగా ఉంటాం. వైకాపా అరాచక శక్తిని ఓడించి నిజాన్ని గెలిపిద్దాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ‘నిజం గెలవాలి’ యాత్రను మంగళవారం ఆమె ప్రారంభించారు. 3 రోజులపాటు నిర్వహించే యాత్రలో తొలిరోజు ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట, కన్నాయగూడెం, బయ్యనగూడెం, జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట, జంగారెడ్డిగూడెంలలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన ఎర్రంపేటకు చెందిన చాండ్ర చినకన్నయ్య, కన్నాయగూడెం వాసి దర్శిపోము వెంకటలక్ష్మి, బయ్యనగూడెం మార్గాని వెంకటేశ్వర్లు, పేరంపేటలోని భీమడోలు వెంగయ్య, జంగారెడ్డిగూడెం వాసి నల్లజర్ల కృష్ణ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. వారికి ధైర్యం చెబుతూ చంద్రబాబు ఇచ్చిన భరోసా పత్రాన్ని అందజేశారు.

ఎర్రంపేట, పేరంపేటలలో మృతుల నివాసాల వద్దకు తరలివచ్చిన అభిమానులు, మహిళల సమక్షంలో ఆమె మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. చంద్రబాబు అయిదేళ్లపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపించారు. ఆయన్ని నమ్మి ఎన్నో పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి. వైకాపా అరాచకాలతో పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి’ అని వివరించారు. ‘14 ఏళ్లు సీఎంగా పనిచేసినా చంద్రబాబుపై ఒక్క అవినీతి ఆరోపణా లేదు. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబు దార్శనికతను నమ్మి రైతులు 33 వేల ఎకరాలను ఇస్తే వైకాపా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. చిన్న పిల్లలు, మహిళలకు గంజాయి అలవాటు చేస్తున్నారు. వైకాపా పాలనలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. వారు ఎక్కడికెళ్లారో కూడా తెలియదు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని