సుద్దులు చెప్పి.. సున్నం కొట్టి..

‘‘తెలుగుదేశం ప్రభుత్వం కొత్త ప్రభుత్వంపై  రూ.వేల కోట్ల పెండింగు బిల్లుల భారం వేసింది. రూ.42 వేల కోట్ల పెండింగు బిల్లులు వదిలేసింది.

Published : 06 Apr 2024 09:15 IST

ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.60వేల కోట్ల బిల్లులు పెండింగు
మొత్తం పెండింగు రూ.1.50 లక్షల కోట్ల పైమాటే...
చివర్లోనూ సొంత గుత్తేదారులకే జగన్‌ సర్కారు చెల్లింపులు
ఈనాడు, అమరావతి


‘‘తెలుగుదేశం ప్రభుత్వం కొత్త ప్రభుత్వంపై  రూ.వేల కోట్ల పెండింగు బిల్లుల భారం వేసింది. రూ.42 వేల కోట్ల పెండింగు బిల్లులు వదిలేసింది. అంగన్వాడీలు, ఇతరత్రా చెల్లింపులనూ పెండింగులో ఉంచింది. గుత్తేదారులకు బిల్లులు చెల్లించింది.

2019 జులై10, అక్టోబరు 11 తేదీల్లో విలేకర్లతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి


ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వల్లించిన సుద్దులివి. అసలు అప్పులంటేనే తప్పన్నట్లు... అటువైపే చూడబోమన్నట్లు ధర్మప్రభోదాలు చేశారు. అందరికీ బిల్లులు సక్రమంగా చెల్లించే కట్టుతప్పని కఠిన నిబంధనలు తామేదో అమలు చేస్తామన్నట్లుగా అమాయకపు పోజులు పెట్టారు. సీఎం జగన్‌ నోట్లోంచే ఆ మాటలు జాలువారినట్లుగా ప్రభుత్వం గొప్పలను అందరికీ చెవిలో జోరీగలా వినిపించారు. గడిచిన అయిదేళ్లలో జగన్‌ ప్రభుత్వ స్వరూపం ఏమిటో తేటతెల్లమయిపోయింది. ఆఖరికి చివరి ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లోనూ ఈ ప్రభుత్వ ఆర్థిక సొగసు ఏమిటో, ఆర్థికసూత్రాలేంటో మొత్తం బయట పడిపోయాయి. నోరు విప్పి సుద్దులు వినిపించిన వాళ్లేనా.. ఇలా చేసేది అని అంతా నోరు వెళ్లబెట్టవలసి వస్తోంది!

రాబోయే కొత్త ప్రభుత్వంపై జగన్‌ సర్కారు రూ.లక్షల కోట్ల అప్పుల భారం, కార్పొరేషన్‌ రుణాల భారం, రూ.లక్ష కోట్లకు పైగా పెండింగు బిల్లుల భారం నెట్టేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రూ.60వేల కోట్ల మేర పెండింగు బిల్లులు చెల్లించకుండా వదిలేసింది. పాతవన్నీ కలిపితే అనధికారిక లెక్కల ప్రకారం రూ.1.50 లక్షల కోట్ల బకాయిలు ఉంటాయని అంచనా. ఈ లెక్కలను ఆర్థికశాఖ బయటపెట్టడం లేదు. ఇంకా చెప్పాలంటే కొవిడ్‌ కాలం నాటి అత్యవసర బిల్లులనూ ఇంకా చెల్లించలేదు.

బడా గుత్తేదారులంటేనే ఎంతో ప్రేమ

‘పెండింగు బిల్లులు చెల్లించండి మహాప్రభో! ఇలాగైతే మా జీవితాలు ఏం కావాలి.. వడ్డీలు ఎలా చెల్లించాలి అంటూ ఎందరో సామాన్యులు, చిన్న గుత్తేదారులు గగ్గోలు పెడుతున్నా, హైకోర్టు ఆదేశాలిచ్చినా కరుణించకపోగా సొంత అనుయాయులకు జగన్‌ రూ.వేల కోట్లు సమర్పించేశారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా రూ.14వేల కోట్లు పంచారు. చేతిలో డబ్బులు లేకపోతే చివరి నిమిషంలోనూ కార్పొరేషన్ల ద్వారా రూ.4,000 కోట్ల అప్పులు పుట్టించి తనవారికి బిల్లులు ఇచ్చేశారు. మరోవైపు సామాన్యులెందరికో బిల్లులు ఎగ్గొట్టారు. మొదటినుంచి తన అనుయాయులకు మేలు చేయడమే లక్ష్యంగా ఫిఫో (ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ ఔట్‌) విధానానికి జగన్‌ ప్రభుత్వం మంగళం పాడేసింది.

కోడిగుడ్ల బిల్లులూ అంతే... రైతులకూ ఇంతే సంగతులు

పేద విద్యార్థులకు ఆహారం అందించే బిల్లులనూ చెల్లించలేదు. మధ్యాహ్నభోజన పథకంలో భాగంగా విద్యార్థులకు సరఫరా చేసే కోడిగుడ్ల బిల్లులు పెద్దమొత్తంలో పెండింగులో ఉండిపోయాయి. చిక్కీల సొమ్ములూ ఇవ్వలేదు. ఈ రెండూ కలిపి రూ.1,890 కోట్లు పెండింగులో ఉన్నాయి. మరోవైపు రైతులకు పెట్టుబడి సాయం, రైతుభరోసా సొమ్ములు రూ.2,500 కోట్ల వరకు పెండింగులోనే ఉన్నాయి. సూక్ష్మసేద్యం బిల్లులు రూ.4,000 కోట్ల మేర పెండింగులో ఉన్నాయి. జలకళ కింద రూ.100 కోట్లు చెల్లించాలి.

రహదారులకు, నీరు చెట్టు, సాగునీటి ప్రాజెక్టులూ..

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణసాయంతో చేపట్టిన రహదారుల నిర్మాణానికి రూ.200 కోట్లు చెల్లించాలి. కేంద్ర రహదారుల మౌలిక వసతుల నిధి కింద రూ.400 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రుణంతో చేసిన రహదారుల పనులకు రూ.200 కోట్లు పెండింగులో ఉన్నాయి. జలవనరుల శాఖలో ఎప్పటివో నీరు-చెట్టు బిల్లులు రూ.వందల కోట్లు అలాగే ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో చిన్న చిన్న బిల్లులూ పెండింగులోనే ఉన్నాయి. పెద్ద గుత్తేదారులకే ప్రయోజనం కలుగుతోంది.

ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల పైమాటే..

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు రూ.25 వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగసంఘాలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వమే ఈ విషయాన్ని ప్రకటించింది. కరవు భత్యం బకాయిలు, పీఆర్‌సీ బకాయిలు, సరెండర్‌ లీవు అన్నీ పెండింగులోనే ఉంచేశారు. పదవీవిరమణ ప్రయోజనాలు ఇవ్వడం లేదు. సీపీఎస్‌ ఉద్యోగుల పింఛను నిధికి జమచేయాల్సిన మొత్తాలు అనేకం పెండింగులో ఉన్నాయి. పరిశ్రమలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.2,500 కోట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామిక ప్రోత్సాహకాలను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించి.. మళ్లీ వాయిదా వేసింది.


టిడ్కో లబ్ధిదారులకూ కష్టాలు

టిడ్కో గృహాల లబ్ధిదారులకు రూ.320 కోట్ల వరకు పెండింగులో ఉంది. గుత్తేదారులకు రూ.450 కోట్ల వరకు ఇవ్వాలి. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల పనులు చేసిన గుత్తేదారులకు దాదాపు రూ.300 కోట్లు, ఇళ్ల స్థలాల కోసం భూములిచ్చిన రైతులకు రూ.1,150 కోట్లు, పాస్టర్ల గౌరవవేతనం రూ.12 కోట్లు, ఎస్సీ, ఎస్టీ బీసీ వసతిగృహాలకు రూ.50 కోట్లు పెండింగులోనే ఉన్నాయి. చేయూత స్కీం కింద రూ.4,000 కోట్లకు గాను చాలా చెల్లింపులు ఇప్పటికీ పూర్తికాలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద భవన నిర్మాణ పనులకు రూ.600 కోట్ల వరకు ఇవ్వాలి. గడప గడపకు ప్రభుత్వం పనుల్లో రూ.100 కోట్లు ఇప్పటికీ ఇవ్వలేదు. ఏడీబీ నిధులతో గ్రామీణ రహదారుల నిర్మాణాలకు రూ.150 కోట్లు పెండింగులో ఉన్నాయి. తాగునీటి సరఫరా పనులకు రూ.350 కోట్లు ఇవ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని