కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్‌?

‘వాన రాకడ.. రాష్ట్రంలో కరెంటు పోకడ’ ఎప్పుడనేది చెప్పడం కష్టమే. గత రెండేళ్లు విద్యుత్‌ కోతలతో ప్రజలకు చుక్కలు చూపిన జగన్‌ ప్రభుత్వం.. ఎన్నికల ఏడాదిలోనూ ఊరట కల్పించలేకపోతోంది. అనధికారిక విద్యుత్‌ కోతలతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Updated : 09 Apr 2024 06:49 IST

రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్‌ కోతలు
ఎన్నికల ఏడాదీ ప్రజలపై కనికరం చూపని ప్రభుత్వం
సాంకేతిక సమస్యలంటూ కోతలను దాచేస్తున్న డిస్కంలు  
247 ఎంయూలకు చేరిన రోజువారీ డిమాండ్‌
థర్మల్‌ కేంద్రాల్లో సరిపడా లేని బొగ్గు నిల్వలు

ఈనాడు, అమరావతి: ‘వాన రాకడ.. రాష్ట్రంలో కరెంటు పోకడ’ ఎప్పుడనేది చెప్పడం కష్టమే. గత రెండేళ్లు విద్యుత్‌ కోతలతో ప్రజలకు చుక్కలు చూపిన జగన్‌ ప్రభుత్వం.. ఎన్నికల ఏడాదిలోనూ ఊరట కల్పించలేకపోతోంది. అనధికారిక విద్యుత్‌ కోతలతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు కోతలకు సాంకేతిక సమస్యలంటూ ముసుగువేస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా ఫీడర్ల పరిధిలో విడతల వారీగా విద్యుత్‌ కోతలను అమలు చేస్తోంది. సోమవారం కొన్ని ఫీడర్ల పరిధిలో 10 గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 43.5 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉండాలంటే కరెంటు లేక.. బయటకు వెళ్దామంటే వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో పడే బాధ వర్ణనాతీతం. పరీక్షల సీజన్‌ కావడంతో కొద్దిసేపు సరఫరా లేకున్నా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఒప్పందాలు, మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోళ్లు జరిపినా కోతల్లేని విద్యుత్‌ ఇవ్వలేక జగన్‌ ప్రభుత్వం చేతులెత్తేయడంతో జనం అల్లాడిపోతున్నారు. 

ఇళ్లకూ సవ్యంగా ఇవ్వలేరా?

ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌లో ప్రభుత్వం 2 గంటలపాటు కోతలు పెట్టింది. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ మౌఖిక ఆదేశాలతో గృహ విద్యుత్‌ వినియోగదారులకు కోతల్లేకుండా చూడాలని అధికారులు భావించారు. ఈ నెల మొదటి వారం నుంచి రోజురోజుకూ విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతూ ప్రస్తుతం 247 ఎంయూలకు చేరడంతో గృహావసరాల విద్యుత్‌లోనూ డిస్కంలు కోతలు పెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో గ్రిడ్‌ గరిష్ఠ డిమాండ్‌ దిశగా పరుగులు పెడుతోంది. సోమవారం గ్రిడ్‌ గరిష్ఠ డిమాండ్‌ 11,876 మెగావాట్లుగా నమోదైంది. డిమాండ్‌ సర్దుబాటు కోసం అందుబాటులో ఉన్న విద్యుత్‌ పోను సుమారు 1,062 మెగావాట్లు మార్కెట్‌ నుంచి సమకూర్చుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ 247 ఎంయూలుగా ఉంది. ఏపీ జెన్‌కో ప్రాజెక్టుల నుంచి 103.57 ఎంయూలు, పవన, సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి 38.01 ఎంయూలు, ప్రైవేటు జనరేటర్ల నుంచి 72.77 ఎంయూలు డిస్కంలు కొనుగోలు చేశాయి. ఎండల తీవ్రత పెరగక ముందే మార్కెట్‌లో విద్యుత్‌ దొరకడం కష్టంగా ఉంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పోటీపడి మార్కెట్‌లో గరిష్ఠ ధరకు విద్యుత్‌ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మే, జూన్‌ నాటికి రోజు విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ఠంగా 270 ఎంయూలకు చేరొచ్చు. ఈ డిమాండ్‌ సర్దుబాటుకు కనీసం 60 ఎంయూలు మార్కెట్‌లో కొనాల్సిందే. విద్యుత్‌ దొరకని పక్షంలో కోతలు తప్ప మరో మార్గం లేదు.

దాచేస్తే దాగుతాయా?
మూడు డిస్కంల పరిధిలో 22,113 గ్రామాలుంటే.. ఆదివారం నాడు ఎలాంటి విద్యుత్‌ కోతలు లేకుండా పూర్తిగా స్థాయిలో విద్యుత్‌ సరఫరా చేశామని డిస్కంలు పేర్కొంటున్నాయి. 33కేవీ, 11 కేవీ ఫీడర్లు 28 బ్రేక్‌డౌన్‌ అయ్యాయని.. సమస్యను పరిష్కరించి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించినట్లు చెప్పాయి. అయితే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ఫీడర్లలో గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో గృహవిద్యుత్‌ వినియోగదారులు గగ్గోలు పెట్టారు. కొన్ని ఫీడర్ల పరిధిలో 10 గంటలకు పైగా కరెంటు లేక ప్రజలు అల్లాడిపోయారు. 17 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడా కోతల్లేవని ప్రభుత్వం చెబుతోంది. సీఎం సొంత జిల్లా కడప నగరంలోనే ఆదివారం సుమారు అరగంటకు పైగా విద్యుత్‌ కోత విధించారు.

  • శ్రీకాకుళం జిల్లా గార మండలం జల్లువలస, జఫ్రాబాద్‌, రాఘవాపురం, వాదాడ, తోనంగి, శాలిహుండం గ్రామాల పరిధిలో సోమవారం ఉదయం 5.34 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కరెంటు లేదు.
  • రాజమహేంద్రవరం జిల్లా గండేపల్లి మండలం కె.సూరంపాలెం గ్రామీణ ఇండస్ట్రియల్‌ ఫీడర్‌ పరిధిలో సోమవారం ఉదయం 7.15 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచింది.  రాజమహేంద్రవరంలోని తాడితోట సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉదయం 8.55 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకూ సరఫరా నిలిచిపోయింది.
  • పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఆలవద్ద, కురుపాం మండలం బర్తంగి గ్రామాల పరిధిలో ఉదయం 9.21 నుంచి సాయంత్రం 4.15గంటల వరకు కరెంటు లేదు.
  • తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)లో 39 ఫీడర్ల పరిధిలోని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రోజు మొత్తంలో సుమారు 100కుపైగా ఫీడర్ల పరిధిలో వివిధ కారణాలతో సరఫరా నిలిపేశారు.
  • దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలో సోమవారం సాయంత్రం 4.15 గంటల సమయానికి 198 ఫీడర్ల పరిధిలో సరఫరాకు ఆటంకం కలిగింది. లైన్‌ నిర్వహణ కోసం 18 ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిపేసినట్లు అధికారికంగా చూపారు. అంటే మిగిలిన ఫీడర్ల పరిధిలో అనధికారిక కోతలను అమలు చేస్తున్నట్లే. సీఎం సొంత జిల్లా కడపలో 33 ఫీడర్ల పరిధిలోని వినియోగదారులు విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు పడ్డారు.
  • కర్నూలు సర్కిల్‌ పరిధిలోని ఆదోని గుండ్లకొండ సబ్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 8.30 గంటలకు కూడా పునరుద్ధరించలేదు. లైన్‌ మెయింటనెన్స్‌ కోసం నిలిపేసినట్లు అధికారులు చెబుతున్నారు.
  • కడప జిల్లా పెద్దముడియం సబ్‌స్టేషన్‌ పరిధిలో సాయంత్రం 4.37 నుంచి, తిరుపతి సర్కిల్‌ పరిధిలోని పూతలపట్టు సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు 4.35 నుంచి, అనంతపురం జిల్లా రాయదుర్గం సబ్‌స్టేషన్‌ పరిధిలోని గుమ్మగట్ట మండలంలోని పలు గ్రామాలకు 5 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా లేదు.
  • కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ మాత్రం విద్యుత్‌ కోతల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టకుండా జాగ్రత్త పడింది. నిబంధనల ప్రకారం ఈ వివరాలు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి.

బొగ్గు నిల్వలు నిండుకున్నాయి..

రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌లో ఏపీ జెన్‌కో నుంచి 45 శాతం విద్యుత్‌ అందుతోంది. థర్మల్‌ యూనిట్లకు అవసరమైన బొగ్గు నిల్వలు రెండు, మూడు రోజలకు మించి లేవు. ప్రస్తుతం విజయవాడ వీటీపీఎస్‌లో 1.20 లక్షల టన్నులు, ఆర్‌టీపీపీలో 1.40 లక్షల టన్నులు, కృష్ణపట్నంలో 40 వేల టన్నుల బొగ్గు అందుబాటులో ఉంది. కృష్ణపట్నం యార్డులో లక్ష టన్నులు, ఒడిశాలోని పారాదీప్‌ ఓడరేవులో మరో 1.50 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు