భద్రతా వైఫల్యమా.. కుట్ర కోణమా!

సీఎం జగన్‌ పర్యటన అంటే పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ.. వేలమంది పోలీసు సిబ్బందిని మోహరిస్తుంటారు. సీఎం పర్యటించే మార్గంలో పరదాలు కట్టి, ఇనుప బారికేడ్లు పెట్టి దుకాణాల మూసివేయడం వంటి అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తుంటారు అధికారులు.

Updated : 09 Apr 2024 07:21 IST

సీఎం వాహన శ్రేణిలోకి చొరబడిన యువకుడు
కాన్వాయ్‌లోని ఓ వాహనం అద్దాల ధ్వంసం
సీఎం జగన్‌ ప్రకాశం పర్యటనలో కలకలం

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ పర్యటన అంటే పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ.. వేలమంది పోలీసు సిబ్బందిని మోహరిస్తుంటారు. సీఎం పర్యటించే మార్గంలో పరదాలు కట్టి, ఇనుప బారికేడ్లు పెట్టి దుకాణాల మూసివేయడం వంటి అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తుంటారు అధికారులు. అటువంటిది ఆయన కాన్వాయ్‌ వద్దకు ఓ యువకుడు ప్రవేశించి ఒక వాహనం అద్దాలను తల, చేతులతో మోది బద్దలుగొట్టడం కలకలం రేపుతోంది. ఇది భద్రతా వైఫల్యమా.. లేక ఇందులో మరేదైనా కోణం ఉందా.. అనే చర్చ సాగుతోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో ఆదివారం జగన్‌ సభ సందర్భంగా ఈ ఉదంతం జరిగింది. బయట నిలిపి ఉన్న కాన్వాయ్‌లోని ఓ వాహనంపై పొదిలి మండలం కంభాలపాడుకు చెందిన విష్ణు అనే యువకుడు దాడి చేశాడు. తాను సీఎం జగన్‌కు వీరాభిమానినని చెబుతున్న అతడు సీఎం వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతోనే వచ్చానని అంటున్నాడు.

గత ఎన్నికలకు ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై కోడికత్తి దాడి తరహాలో ఇక్కడా ఏదైనా నాటకానికి తెర లేపారా.. అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. తనకు తల్లి, సోదరి, సోదరుడు ఉన్నారని, కుటుంబ పోషణ భారం తన మీదే ఉందని, సోదరుడి చదువుకు ఏటా రూ. 2.20 లక్షలు చెల్లించాల్సి ఉందని ఆ యువకుడు చెబుతున్నాడు. సమస్యలపై ఏ నాయకుడికి విన్నవించినా పట్టించుకోలేదనీ, దీంతో సీఎంను కలవడానికి వచ్చానని వివరించాడు. దారిలో మద్యం తాగానని చెప్పాడు. ఓ స్నేహితుడు ఇక్కడకు వెళ్లమన్నాడని తెలిపాడు. సీఎం జగన్‌ కోసం తాను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమని కూడా అంటున్నాడు. అతను మద్యం మత్తులో ఉన్నాడని స్థానిక పోలీసులు చెబుతున్నా, పోలీసులతో మాట్లాడిన సమయంలో అతని మాటలు స్పష్టంగానే ఉండటం గమనార్హం. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది.

రాష్ట్ర ఉన్నతాధికారుల సీరియస్‌..

పటిష్ఠమైన భద్రతా వలయాన్ని ఛేధించుకుని మరీ ఆ యువకుడు అక్కడి వరకు ఎలా వెళ్లగలిగాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. భద్రత నిర్వహణలో డొల్లతనంగా భావించి ఆగ్రహించిన ఉన్నతాధికారులు.. జిల్లా అధికారులను వివరణ కోరినట్లు సమాచారం. సదరు యువకుడి మానసిక పరిస్థితి సరిగా లేదని, పైగా మద్యం మత్తులో ఉండటంతో అతనలా ప్రవర్తించాడని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. స్థానిక అధికారుల వివరణతో సంతృప్తి చెందని అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. దీంతో సదరు యువకుడిని ఇప్పటికే తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సోమవారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అతని కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని