‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?

‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్‌ చేయడానికి స్పెషల్‌ సీఎస్‌గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పీవీ రమేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 08 May 2024 07:14 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తే సమస్యలెన్నో
వారసత్వ భూమి మ్యుటేషన్‌కు ఇన్ని చిక్కులా..
స్పెషల్‌ సీఎస్‌గా పనిచేసిన నన్నే ఇబ్బంది పెడుతున్నారు
ఇక సామాన్యుల పరిస్థితేంటి?
విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌

ఈనాడు-అమరావతి: ‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్‌ చేయడానికి స్పెషల్‌ సీఎస్‌గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పీవీ రమేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ ప్రత్యక్ష బాధితుడిని తానేనంటూ ఎక్స్‌లో సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. కొత్త చట్టమని ఒకసారి.. రీసర్వే అని మరోసారి.. ఎల్‌పీ నంబర్లని ఇంకోసారి చెబుతూ రెవెన్యూ అధికారులు ఆయన్ను సతాయిస్తుంటే సామాన్య రైతుల పరిస్థితి ఏంటన్న ఆందోళన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన రమేశ్‌.. వివిధ జిల్లాల్లో సబ్‌ కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌, కలెక్టర్‌గా పనిచేశారు. పదవీ బాధ్యతల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యలు, వివాదాల పరిష్కారానికి కృషి చేశారు. ఏపీ రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ యాక్ట్‌ అమలు సమయంలో కీలకపాత్ర పోషించారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన భూముల మ్యుటేషన్‌కే తహసీల్దారు పలకడం లేదు.. ఆర్డీవో కాగితాలు తిప్పి పంపుతున్నారంటే.. ఇక రైతుల గోడు పట్టించుకునేదెవరు.. జగన్‌ పాలనలో అది సాధ్యమా..? తమ భూమి మ్యుటేషన్‌ కోసం తాను పడిన అవస్థలను ఆయన ‘ఈనాడు’కు వివరించారు.

రైతులకు న్యాయం జరిగేదెలా?

‘వైకాపా నేతలు, ఆ పార్టీ మీడియా చెబుతున్నట్లు నాకు రాజకీయాలతో సంబంధం లేదు.. జగన్‌, చంద్రబాబు ఇద్దరివద్దా పనిచేశా. వారిద్దరి వ్యక్తిత్వాలూ నాకు తెలుసు. నేను మాట్లాడటం మొదలుపెడితే బాగుండదు’ అంటూ కొందరు వైకాపా నేతలు తనపై చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ హెచ్చరించారు. ‘మహమ్మద్‌ ఘోరీ పాలనలో కొత్త రాజ్యం వచ్చినప్పుడు.. కొత్త పేర్లు పెడతారు. ఇది ఆంధ్రప్రదేశ్‌. మద్రాసు ప్రెసిడెన్సీ సమయం నుంచి భూ చట్టాలు, విధానాలున్నాయి. వాటన్నిటినీ పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు’ అని ఆందోళన వెలిబుచ్చారు. ‘దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో మాత్రమే పార్టీ కార్యకర్తలను ప్రభుత్వంలోకి తీసుకున్నారు. వీరు ప్రభుత్వం కోసం పనిచేస్తారా? పార్టీ కోసం పనిచేస్తారా? గ్రామ మునసబు, కరణం వ్యవస్థను తీసేయడానికి కారణ ఇదే. పెట్టుబడిదారులు, భూస్వాముల మోచేతి నీళ్లు తాగి పేదలకు అన్యాయం చేస్తున్నారని తీసేశారు. ఇప్పుడు పార్టీ వర్కర్లను తీసుకుని.. పెత్తందారీ పనులు అప్పగించారు.. దీని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. ఇది ప్రజలు భయపడాల్సిన విషయమే’ అని వివరించారు. ‘గతంలో పేదలకు ప్రభుత్వం పంచిన భూములను అమ్ముకోవచ్చని వైకాపా వచ్చాక చట్టం తెచ్చారు. పండించుకుని బతకమని ఆ భూమి ఇచ్చారు. ఈ ప్రభుత్వ నిర్ణయం కారణంగా.. ఆరు నెలలుగా లక్షల ఎకరాలు భూస్వాములు, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లాయి’ అని వివరించారు.

వారసత్వంగా వచ్చిన భూమికి మ్యుటేషన్‌ చేయమంటే

పీవీ రమేశ్‌ తండ్రి సుబ్బారావుకు కృష్ణా జిల్లా విన్నకోటలో వారసత్వంగా వచ్చిన 9.50 ఎకరాలు, తల్లి పేరుతో 7.50 ఎకరాల పట్టా భూములున్నాయి. వాటికి పక్కనున్న మరికొందరు రైతుల భూములతో కలిపి సుమారు 100 ఎకరాల్లో 2003లో చేపల చెరువులు తవ్వి ఏటా లీజుకిస్తున్నారు. రమేశ్‌ తల్లి 2023 మే 18న, తండ్రి అక్టోబరు 20న చనిపోయారు. అనంతరం జగనన్న భూపట్టా పథకం కింద తన తండ్రి పేరుతో 9.50 ఎకరాలు, తల్లి పేరుతో 7.50 ఎకరాల భూమికి హక్కు పత్రాలిచ్చారు. ‘మా నాన్న వీలునామా ఆధారంగా.. భూములను నాకు, మా ఇద్దరు తమ్ముళ్ల పేరుతో మ్యుటేషన్‌ చేయాలని 2023 డిసెంబరు 12న అధికారులకు లేఖ రాశా. కొత్త చట్టం ప్రకారం రైతులకు సంబంధించిన చేపల చెరువులకు సర్వే నంబర్లు ఇవ్వడం లేదని, ఎల్‌పీ(ల్యాండ్‌ పార్సెల్‌) నంబర్లు ఇస్తున్నామని.. కాబట్టి మ్యుటేషన్‌ జరగదని తహసీల్దారు తెలియజేశారు. మీ సర్వే నంబరు చెల్లదన్నారు. ప్రత్యక్షంగా వచ్చి హద్దులు చూపాలన్నారు. చేపల చెరువులో రైతులు హద్దులెలా చూపిస్తారు’ అని రమేశ్‌ ప్రశ్నించారు.

‘మ్యుటేషన్‌ చేయనని తహసీల్దారు చెప్పడం చట్టప్రకారం తప్పని ఈ ఏడాది ఫిబ్రవరి 12న సీసీఎల్‌ఏకే దరఖాస్తు చేశా. ఫిబ్రవరి 22న జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి వివరించా. 28న చేపల చెరువును జాయింట్‌ సర్వే చేయించాలని ఆదేశించారు. సర్వేకు రావాలంటూ అప్పటికే మరణించిన మా తల్లిదండ్రుల పేరుతో ఆర్డీవో నోటీసులిచ్చారు. చనిపోయిన వారికి నోటీసులేంటి’ అని రమేశ్‌ ప్రశ్నించారు. ‘మా భూమి చేపల చెరువు కింద ఉందని.. ఆ రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని ఆర్డీవోకు పత్రాలు పంపడంతోపాటు.. లేఖ రూపంలో రిజిస్టర్‌ పోస్టు చేశా. వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తూ తిప్పి పంపారు. కొత్తగా భూమి బదలాయింపు చట్టం అమల్లోకి రాలేదని, రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ చట్టం కింద వెంటనే మ్యుటేషన్‌ చేయాలని సీసీఎల్‌ఏ మార్చి 13న ఆదేశాలిచ్చింది. ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు’ అని వివరించారు. ‘వాస్తవంగా రైతుల వారీగా భూముల్ని సర్వే చేసి కొలతలు వేసి అప్పగించాలి. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలి. అలా చేయడం లేదు. చేపల చెరువులకు పట్టా నంబరు తీసేసి.. ఎల్‌పీ అని పెడుతున్నారు. తర్వాత జాయింట్‌ సర్వే చేయించి మీ భూముల్ని మీరే రుజువు చేసుకోవాలంటున్నారు. చట్టం పూర్తిగా అమలు కాకముందే ఇంత భయంకరంగా ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని