కేంద్రం నిధులు వాడేసుకొని జీతాలు ఇవ్వని జగన్‌ సర్కార్‌

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించేసిన ప్రభుత్వం.. 2 నెలలుగా సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.

Published : 09 May 2024 07:30 IST

2 నెలలుగా ఇబ్బందిపడుతున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించేసిన ప్రభుత్వం.. 2 నెలలుగా సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. అధికార పార్టీకి ఎన్నికల్లో ఓట్లు వచ్చే వీలున్న కార్యక్రమాలకు నిధులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి చిరు ఉద్యోగుల కష్టాలు మాత్రం పట్టడం లేదు. మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన జీతాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఎస్‌ఎస్‌ఏకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులిస్తుంది. మిగతా 40% నిధులు కలిపి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. కేంద్రం తన వాటాగా మార్చిలో రూ.360 కోట్లు ఇచ్చింది. దీనికి రాష్ట్రవాటా కలిపి రూ.500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఆర్థికశాఖ అధికారులు, సీఎస్‌ జవహర్‌రెడ్డి సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఎస్‌ఎస్‌ఏలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఉద్యోగులు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు. వీరికి ఇచ్చే జీతాలే తక్కువ. అలాంటిది రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘పీఎంశ్రీ’ కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.55 కోట్లు విడుదల చేసింది. వీటినీ ప్రభుత్వం వాడేసుకుంది. ఎస్‌ఎస్‌ఏ నుంచి అధికారులు ఎన్ని సార్లు ఆర్థికశాఖకు విన్నవించినా అటు నుంచి సరైన సమాధానం రావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని