Nirmala Sitharaman: ముందస్తు బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరిస్తున్నాం: ట్రేడ్‌ యూనియన్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వర్చువల్‌ విధానంలో నిర్వహించనున్న ముందస్తు బడ్జెట్‌ సమావేశాలను తాము బహిష్కరిస్తున్నట్లు ట్రేడ్‌ యూనియన్ల ఫోరం స్పష్టం చేసింది. ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన సమావేశానికి తాము హాజరు కావడం లేదంటూ కేంద్ర మంత్రికి ఫోరం లేఖ రాసింది.

Published : 26 Nov 2022 22:46 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వర్చువల్‌ విధానంలో నిర్వహించనున్న ముందస్తు బడ్జెట్‌ సమావేశాలను తాము బహిష్కరిస్తున్నట్లు ట్రేడ్‌ యూనియన్ల ఫోరం స్పష్టం చేసింది. ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన సమావేశానికి తాము హాజరు కావడం లేదంటూ కేంద్ర మంత్రికి ఫోరం లేఖ రాసింది. మాట్లాడేందుకు తగిన సమయం ఉండేందుకు వీలుగా భౌతిక సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేసింది.

ముందస్తు బడ్జెట్‌ సమావేశాలను ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ వర్గాలతో ఆమె సమావేశమయ్యారు. ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా ఈ నెల 28న ట్రేడ్‌ యూనియన్లకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, వర్చువల్‌గా హాజరు కావాలని సూచించడం పట్ల ట్రేడ్‌ యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. వర్చువల్‌ సమావేశంలో మాట్లాడేందుకు మూడేసి నిమిషాలు సమయం ఇస్తామని చెప్పడం పట్ల నిరసన తెలియజేశాయి.

కొవిడ్‌ నిబంధనలు సడలించినా.. భౌతిక సమావేశం ఏర్పాటు చేయకపోవడాన్ని ట్రేడ్‌ యూనియన్లు తప్పుబట్టాయి. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు 10 సంఘాలతో కూడిన ఫోరం ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. సమయ పరిమితి లేకుండా భౌతిక సమావేశం ఏర్పాటు చేయాలని తమ లేఖలో కోరాయి. భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ మినహా ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ వంటి 10 ట్రేడ్‌ యూనియన్లు ఈ ఫోరంలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని