Supreme Court: అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారం.. సెబీ అభ్యర్థనకు సుప్రీం ఓకే, కానీ!

అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవహారంపై విచారణ జరిపేందుకు గడువు పొడిగించాలని కోరుతూ సెబీ (SEBI) దాఖలు చేసిన పిటిషనపై సుప్రీం ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విచారణ గడువును పొడిగించేందుకు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తిం చేసింది. 

Published : 12 May 2023 19:09 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు సెబీ (SEBI)కి గడువును పొడిగించేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) సుముఖత తెలిపింది. ఈ మేరకు సెబీ పిటిషన్‌పై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్థీవాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అయితే, సెబీ కోరినట్లు ఆరు నెలల సమయం కాకుండా మూడు నెలల గడువు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. సెబీ అభ్యర్థనపై తదుపరి విచారణను మే15కు వాయిదా వేసింది. అలానే, అదానీ గ్రూప్‌- హిండెన్‌బర్గ్‌ వివాదంపై విచారణ జరిపేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే నేతృత్వంలో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ తన నివేదికను ధర్మాసనానికి సమర్పించింది. మే 15లోగా ఈ నివేదికలోని అంశాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg) విడుదల చేసిన నివేదిక అనంతరం, సంస్థ షేర్ల విలువ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో షేర్ల అవకతవకలపై రెండు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సెబీని సుప్రీం కోర్టు మార్చి 2న ఆదేశించింది. అయితే, ఈ విచారణకు ఆరు నెలల గడువు కావాలని కోరుతూ సుప్రీం కోర్టు వద్ద సెబీ దరఖాస్తు చేసుకుంది. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాది విశాల్‌ తివారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలు సేకరించేందుకు సెబీ కావాల్సినంత సమయం దొరికిందని ఆయన వాదించారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం మూడు నెలల గడువుకు సుముఖత వ్యక్తం చేసింది. దీనిపై మే15న మరోసారి విచారణ జరుపుతామని తెలిపింది.

కొద్దిరోజుల క్రితం అదానీ గ్రూప్‌కు తమ దేశంలో ఎలాంటి షెల్‌ కంపెనీలు లేవని మారిషస్‌ ప్రభుత్వం సైతం వెల్లడించింది. హిండెన్‌ బర్గ్‌ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని మారిషస్‌ ఆర్థిక సేవల మంత్రి మహేన్‌ కుమార్‌ సీరుత్తన్‌ ఆ దేశ పార్లమెంటుకు తెలిపారు. ఓఈసీడీ విధించే తప్పనిసరి పన్ను నిబంధనలను మారిషస్‌ పాటిస్తోందని ఆయన పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని