AI Tools: ‘ఏఐ టూల్స్‌తో అసభ్య కంటెంట్‌’.. లోపాలు గుర్తించానంటున్న మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి!

AI Tools: అత్యాధునిక ఏఐ టూల్స్ వల్ల హానికర, అభ్యంతరకర కంటెంట్‌ క్రియేట్‌ అవుతోందని మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కోపైలట్‌లో తాను పలు లోపాలను గుర్తించినట్లు వెల్లడించారు.

Updated : 07 Mar 2024 11:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) ఆధారిత సాంకేతికతలు ఇప్పుడు టెక్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ అత్యాధునిక టెక్నాలజీ వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉంటాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు దీన్ని దుర్వినియోగం చేస్తే తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయనే హెచ్చరికలూ వస్తున్నాయి. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఉద్యోగి షేన్ జోన్స్ రాసిన లేఖ తాజాగా చర్చనీయాంశంగా మారింది. కంపెనీకి చెందిన ఏఐ ఇమేజ్‌ జనరేషన్‌ టూల్‌ అసభ్యకర కంటెంట్‌ సృష్టికి దారితీస్తోందని ఆయన ఆరోపించారు. దీన్ని అరికట్టేందుకు సంస్థ తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ మేరకు ఆయన కంపెనీ బోర్డుతో పాటు ‘ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌’, చట్ట సభ్యులకు లేఖ రాశారు.

ఓపెన్‌ఏఐకి చెందిన సరికొత్త DALL-E ఇమేజ్ జనరేటర్ మోడల్‌లో భద్రతాపరమైన లోపాన్ని కనుగొన్నట్లు షేన్ జోన్స్ వెల్లడించారు. ఇది హానికరమైన చిత్రాలను సృష్టించకుండా టూల్‌లో ఏర్పాటు చేసిన కట్టుబాట్లను దాటవేయడానికి అనుమతించినట్లు తెలిపారు. DALL-E మోడల్‌ను కో-పైలట్ డిజైనర్‌ సహా మైక్రోసాఫ్ట్‌కు చెందిన అనేక ఏఐ సాధనాలలో పొందుపర్చారు.

తాను గుర్తించిన విషయాలను మైక్రోసాఫ్ట్‌కు (Microsoft) నివేదించినట్లు జోన్స్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో మరిన్ని భద్రతా ఏర్పాట్లను పొందుపర్చే వరకు కోపైలట్‌ను ఉపయోగంలో నుంచి తొలగించాలని కోరినట్లు వెల్లడించారు. హానికర చిత్రాలను సృష్టించేలా అంతర్గతంగా లోపాలున్నట్లు తెలిసినప్పటికీ.. దాని డిజైనర్‌ను కంపెనీ సురక్షితమైన టూల్‌గా ప్రమోట్‌ చేస్తోందన్నారు. రాజకీయపరమైన వివక్ష, మాదకద్రవ్యాల వినియోగం, మేధో హక్కుల ఉల్లంఘన, కుట్రపూరిత సిద్ధాంతాలు, మతపరమైన అంశాల్లోనూ కోపైలట్‌ అభ్యంతరకర కంటెంట్‌ను ఇస్తోందని తెలిపారు.

దీనిపై మైక్రోసాఫ్ట్‌ స్పందిస్తూ.. ఉద్యోగులు లేవనెత్తిన అన్ని ఆందోళనలను కంపెనీ నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని తెలిపింది. తమ అత్యాధునిక సాంకేతికతల భద్రతను మరింత మెరుగుపర్చడం కోసం ఉద్యోగులు చేస్తున్న అధ్యయనాన్ని ప్రశంసిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని