Go first: గోఫస్ట్‌ ఎఫెక్ట్‌.. విమాన ఛార్జీలు పెరిగే ఛాన్స్‌!

Airfares: విమానాలు రద్దు చేస్తూ గోఫస్ట్‌ విమాన సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రావెల్‌ ఏజెంట్స్‌ గ్రూప్‌ టాయ్‌ పేర్కొంది.

Updated : 03 May 2023 20:06 IST

దిల్లీ: కరోనాతో తీవ్రంగా నష్టపోయిన విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రయాణాల విషయంలో కరోనా ముందునాటి పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో టూరిజం సైతం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో గోఫస్ట్‌ సంస్థ (Go First) విమాన సర్వీసులను మూడ్రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల విమాన ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విమాన టికెట్‌ ధరలు (Air fares) పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

మెజారిటీ విమానాలు నేలకే పరిమితమైన నేపథ్యంలో గోఫస్ట్‌ విమాన సంస్థ 3, 4, 5 తేదీల్లో విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు స్వచ్ఛంద దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల విమానాల కెపాసిటీ తగ్గి కొన్ని రూట్లలో టికెట్‌ ధరల పెరుగుదలకు కారణం కానుందని ట్రావెల్‌ ఏజెంట్స్‌ గ్రూప్‌ టాయ్‌ పేర్కొంది. గోఫస్ట్‌ పరిణామం విమానయాన రంగానికి చేదు వార్త అని సంఘం ప్రెసిడెంట్‌ జ్యోతి మాయల్‌ పేర్కొన్నారు. సెలవుల కారణంగా విమాన ప్రయాణానికి విపరీతమైన డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో గోఫస్ట్‌ పరిణామం వల్ల రాబోయే కొన్ని వారాల్లో టికెట్‌ ధరలు భారీగా పెరగనున్నాయని చెప్పారు. సమ్మర్‌ షెడ్యూల్‌లో భాగంగా మార్చి 26 నుంచి అక్టోబర్‌ 28 మధ్య గోఫస్ట్‌ వారానికి 1538 విమాన సర్వీసులు నడపాల్సి ఉంది.

మరోవైపు విమానాల రద్దు నేపథ్యంలో టికెట్‌ డబ్బులను వెనక్కి చెల్లిస్తామని గోఫస్ట్‌ సంస్థ మంగళవారమే ప్రకటించింది. 3, 4, 5 తేదీల్లో విమానాలను రద్దు చేసిన నేపథ్యంలో ఆయా తేదీల్లో టికెట్ల సొమ్మును పూర్తిగా వాపసు చేస్తామని తెలిపింది. ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారు రిఫండ్‌ కోసం వారిని సంప్రదించాలని, నేరుగా టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి తమ తమ ఖాతాల్లోనే టికెట్‌ మొత్తాన్ని జమ చేస్తామని పేర్కొంది. ప్రయాణికులకు కలిగిస్తున్న అసౌకర్యానికి క్షమించాలని కోరింది. గోఫస్ట్‌ తీసుకున్న ఈ నిర్ణయం 55 వేల నుంచి 60వేల మందిపై ప్రభావం ఉంటుందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని