5G spectrum: నాలుగేళ్ల బకాయిలు ముందుగానే.. డాట్‌కు చెల్లించిన ఎయిర్‌టెల్‌

5G spectrum: నాలుగేళ్లకు గానూ చెల్లించాల్సిన మొత్తాన్ని ఎయిర్‌టెల్‌ ముందుగానే డాట్‌కు చెల్లించింది.

Published : 17 Aug 2022 13:13 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) టెలికాం విభాగానికి (డాట్‌) రూ.8,312.4 కోట్లు చెల్లించింది. ఇటీవల దక్కించుకున్న 5జీ స్పెక్ట్రమ్‌కు (5G spectrum) గానూ ఈ మొత్తాన్ని డాట్‌కు జమ చేసింది. అయితే, నాలుగేళ్లకు గానూ చెల్లించాల్సిన మొత్తాన్ని ఎయిర్‌టెల్‌ ముందుగానే చెల్లించడం విశేషం. ముందస్తు చెల్లింపుల వల్ల 5జీ విస్తరణపై దృష్టి సారించడానికి వీలు పడుతుందని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది.

ఇటీవల కేంద్రం నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో సునీల్‌ మిత్తల్‌ నేతృత్వంలోని ఎయిర్‌టెల్‌ రూ.43,039.63 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను వేలంలో దక్కించుకుంది. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో రూ.87,946 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. టెల్కోలు ఈ మొత్తాన్ని 20 ఏళ్ల పాటు వాయిదాల రూపంలో చెల్లించొచ్చు. ఇప్పుడు ఒక వాయిదా చెల్లించి మిగిలిన మొత్తాన్ని 19 వాయిదాల్లో చెల్లించే వీలుంది. ఈ క్రమంలో నాలుగేళ్లకు సంబంధించిన బకాయిలను ఎయిర్‌టెల్‌ ఒకేసారి చెల్లించింది.

ఇలా ముందస్తు చెల్లింపులు చేయడం వల్ల 5జీ సేవల విస్తరణపై దృష్టి సారించడానికి వీలు పడుతుందని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది. స్పెక్ట్రమ్‌, ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం కొనసాగుతున్నందున 5జీ స్పెక్ట్రానికి సంబంధించి ముందస్తు చెల్లింపులు చేయడం వల్ల నగదు లభ్యత పెరుగుతుందని ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓ గోపాల్‌ విత్తల్‌ పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ 5జీ సేవల విస్తరణపై దృష్టి సారించొచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని