Anand Mahindra: హెడ్‌సెట్‌లు ధరించిన జాంబీలతో రూమ్‌ నిండిపోతుందా..?

యాపిల్ ఆవిష్కరించిన విజన్‌ ప్రో(Apple Vision Pro) సాంకేతికత ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra)ను ఆకట్టుకుంది. ట్విటర్ వేదికగా దానిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

Published : 07 Jun 2023 01:33 IST

ముంబయి: ఎప్పటికప్పుడు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. అనూహ్యమైన ఫీచర్లతో అబ్బరపడేలా చేస్తోంది. తాజాగా వరల్డ్‌వైడ్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌(WWDC) మొదటి రోజున సోమవారం ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్.. విజన్ ప్రో(Apple Vision Pro)ను ఆవిష్కరించింది. ఇది వర్చువల్‌, రియల్‌ ప్రపంచం మధ్య యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఈ గాగిల్స్‌ పనితీరు వివరించే వీడియోను యాపిల్ సీఈఓ టిమ్‌కుక్(Tim Cook) ట్విటర్‌లో షేర్ చేశారు. ‘యాపిల్‌ విజన్‌ ప్రోతో ఇంతకుముందెన్నడూ చూడని స్పేషియల్‌ కంప్యూటింగ్ యుగానికి స్వాగతం’అంటూ కుక్ ఆ వీడియోకు వ్యాఖ్యను జోడించారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీనిపై ప్రముఖ వ్యాపారవేత ఆనంద్‌ మహీంద్రా( Anand Mahindra) స్పందించారు. 

‘భారీ తెరలు కలిగిన టీవీలకు కాలం చెల్లినట్లేనని భావించాలా..? ఇప్పుడు శామ్‌సంగ్, సోనీ బోర్డ్‌రూమ్‌లు ఎలా స్పందిస్తాయో..? ఈ కొత్త సాంకేతికత వల్ల అందరూ కలిసి వీక్షించే సినిమాలు, మ్యాచ్‌ల పరిస్థితి ఏంటి..? ఇప్పుడు హెడ్‌సెట్‌లు ధరించిన జాంబీలతో రూమ్‌ నిండిపోతుందా..?’అని మహీంద్రా ట్వీట్ చేశారు. వెంటనే దీనిపై నెటిజన్లు స్పందించారు. జాంబీస్ ప్రపంచానికి స్వాగతమంటూ కామెంట్లు పెడుతున్నారు.  

‘విజన్ ప్రో’గా (Apple Vision Pro) పేర్కొంటున్న ఈ గాగిల్స్‌ ధర 3,500 డాలర్లు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇవి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఈ గాగిల్స్‌లో 12 కెమెరాలు, ఆరు మైక్రోఫోన్లు, వివిధ రకాల సెన్సార్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించి యూజర్లు కళ్లు, చేతులతోనే వివిధ రకాల యాప్‌లను నియంత్రించొచ్చు. ఇదిలా ఉంటే.. ఈ సాంకేతికతనే ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ‘మెటావర్స్‌ (metaverse)’గా వ్యవహరిస్తున్నారు. ‘క్వెస్ట్‌’ పేరిట మెటా విక్రయిస్తున్న వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ (virtual reality headset)కు ఇప్పుడు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని