iPhone: లేటెస్ట్‌ ఐఫోన్ల కోసం వేచి చూడాల్సిందే!

చైనాలో విధించిన కరోనా కట్టడి ఆంక్షల వల్ల ఐఫోన్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు యాపిల్‌ తెలిపింది. ఫాక్స్‌కాన్‌ తయారీ కేంద్రంలో ఆంక్షల కారణంగా ఉత్పత్తి నెమ్మదించినట్లు పేర్కొంది. దీంతో లేటెస్ట్‌ ఐఫోన్‌ విక్రయాలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

Published : 07 Nov 2022 18:02 IST

బీజింగ్‌: కొత్త ఐఫోన్‌ (iPhone) మోడళ్లు కొనుగోలు చేయాలనుకునేవారు కొంతకాలం వేచి చూడాల్సి రావొచ్చని యాపిల్‌ తెలిపింది. చైనాలో కరోనా కట్టడి ఆంక్షలు విధించడమే అందుకు కారణమని పేర్కొంది. జెంగ్‌ఝౌలోని ఫాక్స్‌కాన్‌ (Foxconn)కు చెందిన ఐఫోన్‌ (iPhone) తయారీ కేంద్రం పరిసరాల్లో ఆంక్షలు విధించినట్లు తెలిపింది. దీంతో కార్యకలాపాలు కనిష్ఠ సామర్థ్యానికి చేరుకున్నాయని పేర్కొంది. 

ఫలితంగా ఐఫోన్‌-14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్‌-14 ప్రో మ్యాక్స్‌ (iPhone 14 Pro Max) సరఫరా అంచనాల కంటే ఆలస్యంగా జరుగుతోందని యాపిల్‌ తెలిపింది. అందువల్ల కొత్త ఫోన్‌ కొనాలనుకునేవారు ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావొచ్చని పేర్కొంది. ఫాక్స్‌కాన్‌ (Foxconn) ప్లాంట్‌లో వైరస్‌ కేసులు నమోదుకావడంతో గతకొంత కాలంగా అక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్లాంటు వెలుపలి పరిసరాల్లో కూడా కేసులు రావడంతో అక్కడి స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్లాంటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఐఫోన్‌ సరఫరా, కార్మికుల కదలికలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

కరోనా వ్యాప్తిని అరికట్టి తయారీని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ఫాక్స్‌కాన్‌ తెలిపింది. అందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని జెంగ్‌ఝౌ స్థానిక ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పేర్కొంది. అలాగే కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని సంరక్షిస్తూనే ఉత్పత్తిని సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ఫాక్స్‌కాన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు యాపిల్‌ సైతం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని