IPO: అవెలాన్‌ టెక్‌ ఐపీఓకి దరఖాస్తు.. సమీకరణ లక్ష్యం ఎంతంటే?

అవెలాన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకుంది.

Published : 10 Aug 2022 15:19 IST

ముంబయి: అవెలాన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. దాదాపు రూ.1,025 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో రూ.400 కోట్లు తాజా ఇష్యూ కాగా.. రూ.625 కోట్ల విలువైన షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉండనున్నాయి.

సమీకరించిన నిధుల నుంచి రూ.150 కోట్లను రుణాలు తిరిగి చెల్లించేందుకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. జూన్‌ 2022 నాటికి కంపెనీకి రూ.312.27 కోట్ల అప్పులు ఉన్నాయి. మరో రూ.150 కోట్లను నిర్వహణ మూలధన అవసరాలకు వినియోగించనున్నారు. ఐపీఓకి ముందు రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ కూడా జరిగే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. జేఎం ఫైనాన్షియల్‌, డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, నొమురా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

భారత్‌లోని సమగ్ర ఎలక్ట్రానిక్‌ తయారీ, సేవల కంపెనీల్లో అవెలాన్‌ టెక్‌ ఒకటి. అధిక విలువ కలిగిన ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ ఉత్పత్తులకు కావాల్సిన సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల నుంచి పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ వరకూ ఈ కంపెనీ అన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది. డిజైన్‌ నుంచి తయారీ, సేవల వరకూ అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, చైనా, నెదర్లాండ్స్‌, జపాన్‌ వంటి దేశాల్లో ప్రముఖ ‘ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌’ కంపెనీలు అవెలాన్‌కు కస్టమర్లుగా ఉన్నాయి. భారత్‌ సహా అమెరికాలో మొత్తం 12 తయారీ కేంద్రాలున్నాయి.

2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.851.65 కోట్లు. క్రితం ఏడాది నమోదైన రూ.695.90 కోట్లతో పోలిస్తే ఆదాయం గణనీయంగా పెరిగింది. నికర లాభాలు రూ.23.08 కోట్ల నుంచి రూ.68.16 కోట్లకు చేరాయి. EBITDA మార్జిన్‌ 9.58 శాతం నుంచి 11.6 శాతానికి చేరింది. ఆర్డర్‌ బుక్ విలువ రూ.857.87 కోట్ల నుంచి రూ.1,039.15 కోట్లకు పెరిగింది. కస్టమర్ల సంఖ్య 62 నుంచి 81కి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని