వొడాఫోన్‌ ఐడియాలో ప్రమోటర్లు మూలధనం జొప్పించాలి

వొడాఫోన్‌ ఐడియాను సంక్షోభం నుంచి బయట పడేసేందుకు, ఆ సంస్థ రుణాలను ఈక్విటీగా మార్చడానికి అవకాశం ఉందని టెలికాం విభాగం(డాట్‌)తో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆధ్వర్యంలోని బ్యాంకులు పేర్కొన్నాయి...

Updated : 14 Dec 2022 10:55 IST

డాట్‌కు బ్యాంకర్ల సలహా

దిల్లీ: వొడాఫోన్‌ ఐడియాను సంక్షోభం నుంచి బయట పడేసేందుకు, ఆ సంస్థ రుణాలను ఈక్విటీగా మార్చడానికి అవకాశం ఉందని టెలికాం విభాగం(డాట్‌)తో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆధ్వర్యంలోని బ్యాంకులు పేర్కొన్నాయి. టెలికాం రంగ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి శుక్రవారం సీనియర్‌ బ్యాంకు అధికారులను డాట్‌ పిలిపించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టెలికాం సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ‘సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) బకాయిల’పై గత నెలలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.93,520 కోట్ల బకాయిలను కట్టడానికి టెల్కోలకు 10 ఏళ్ల గడువును సుప్రీం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘వొడాఫోన్‌ ఐడియా రుణాలను ఈక్విటీగా మార్చొచ్చు కానీ అది స్థిరమైన ఫలితాలను ఇవ్వడం కష్టమేన’ని బ్యాంకర్లు డాట్‌కు తెలిపారు. ఇప్పటిదాకా కంపెనీ తన రుణాలను ఎగవేయలేదని గుర్తు చేశాయి. గతంలో చాలా వరకు ఒత్తిడి రుణాల కేసుల్లో సదరు కంపెనీల అప్పులను బ్యాంకులు ఈక్విటీగా మార్చేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోటర్లు మూలధనాన్ని జొప్పించడం అత్యుత్తమ పరిష్కార మార్గమని బ్యాంకర్లు సూచించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వొడాఫోన్‌ ఐడియాలో వొడాఫోన్‌కు 45% వాటా, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 27% వాటా ఉన్న సంగతి తెలిసిందే. తమ వాటాదార్లు వొడాఫోన్‌ ఐడియాలో అదనపు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా లేనందున, తమ గ్రూప్‌వాటాను ప్రభుత్వ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూ, జూన్‌లో మాతృసంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా కేంద్ర మంత్రివర్గ కార్యదర్శికి లేఖ రాసిన సంగతి విదితమే. వొడాఫోన్‌ ఐడియా నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవి నుంచి కూడా ఆయన వైదొలిగారు.


గిఫ్ట్‌- క్యాష్‌బ్యాక్‌ వోచర్లను వస్తువులుగా పరిగణించాలి
18% జీఎస్‌టీ వర్తిస్తుంది: ఏఏఆర్‌

దిల్లీ: వినియోగదార్లు, సరఫరాదార్లకు ఆయా కంపెనీలు ఇచ్చే బహుమతుల వోచర్లు, క్యాష్‌ బ్యాక్‌ వోచర్లను వస్తువులుగా పరిగణించాల్సి ఉంటుందని, వీటికి 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఏఆర్‌) స్పష్టం చేసింది. వోచర్లకు ఎంత జీఎస్‌టీ వర్తిస్తుందో తెలియజేయాలంటూ ఏఏఆర్‌ కర్ణాటక బెంచ్‌ను బెంగళూరుకు చెందిన ప్రీమియర్‌ సేల్‌ ప్రొమోషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆశ్రయించగా.. ఏఏఆర్‌ ఈ స్పష్టత ఇచ్చింది. ప్రీమియర్‌ సేల్‌ సంస్థ వోచర్లను విక్రయిస్తూ ఉంటుంది. బహుమతి వోచర్లపై ఏఏఆర్‌ స్పష్టతనిస్తూ ‘వోచర్లను ప్రీమియర్‌ సేల్‌ ప్రొమోషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసి, వాటిని తన క్లయింట్లకు విక్రయిస్తుంది. ఆ తర్వాత క్లయింట్లు వీటిని వాళ్ల వినియోగదారులకు పంపిణీ చేస్తారు. వినియోగదార్లు ఈ వోచర్లను ఏదేని వస్తువులు లేదా సేవల చెల్లింపునకు ఉపయోగిస్తారు. అందువల్ల ప్రీమియర్‌ సేల్‌ ప్రొమోషన్‌ లిమిటెడ్‌ సంస్థ వోచర్లను సరఫరా చేసేటప్పుడు అవి ఇంకా ‘డబ్బు’ రూపును సంతరించుకోలేదు. అలాంటప్పుడు వాటిని వస్తువుగానే పరిగణించాల్సి ఉంటుంద’ని పేర్కొంది. క్యాష్‌ బ్యాక్‌ వోచర్లు, ఇ-వోచర్లు లాంటివి కూడా సరఫరా సమయంలో ‘నగదు’ నిర్వచనం కిందకు రావని, చివరి వినియోగదారు వాటిని చెల్లింపునకు వినియోగించినప్పుడే అవి డబ్బు రూపానికి వస్తాయని ఏఏఆర్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో వోచర్ల విక్రయాన్ని పన్ను విధించదగిన వస్తువులుగా భావించాల్సి ఉంటుందని, 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని ఏఏఆర్‌ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని