Ola CEO భవీశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌.. ఆ రెండు కంపెనీలను ఉద్దేశించేనా?

Bhavish Aggarwal on motorcycle brands: కొన్ని కంపెనీలు ఇంకా పరాయి దేశాలకు చెందిన కంపెనీల వాహనాలను దేశీయంగా తయారుచేస్తున్నాయంటూ ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

Updated : 11 Jul 2023 19:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విద్యుత్‌ వాహనాల తయారీలోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టినా.. తనదైన మార్కెటింగ్‌ వ్యూహంతో దూసుకెళుతోంది ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Elctric). విద్యుత్‌ వాహన విక్రయాల్లో మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ధర విషయంలోనూ పెట్రోల్‌తో నడిచే వాహనాలకు పోటీ ఇచ్చేందుకు ఎస్‌ 1 ఎయిర్‌ (S1 Air) పేరిట తక్కువ ధరలో విద్యుత్‌ స్కూటర్‌ను ఆ సంస్థ తీసుకొచ్చింది. ఓ విధంగా పెట్రోల్‌తో నడిచే వాహనాలకు తాము ప్రత్యామ్నాయం కావాలని ఆ కంపెనీ ఆశిస్తోంది. పలు సందర్భాల్లో చమురుతో నడిచే వాహనాలకు కాలం చెల్లిందంటూ ఆ కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) పేర్కొన్నారు. తాజాగా ఆయనో ట్వీట్‌ చేశారు. రెండు ప్రధాన ఆటోమొబైల్‌ కంపెనీలనుద్దేశించే ఈ ట్వీ్‌ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

‘‘విదేశీ కంపెనీలకు చెందిన మోటార్‌ సైకిళ్లను దేశీయంగా తయారు చేసేందుకు మళ్లీ కొన్ని భారత కంపెనీలు ఎందుకు ముందుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదు’ అంటూ భవీశ్‌ అగర్వాల్‌ గురువారం ట్వీట్‌ చేశారు. ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ వాహనాల తయారీలో ముందుకెళుతున్నామని, ప్రపంచానికి మేకిన్‌ ఇండియా విద్యుత్‌ వాహనాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుతామని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, భవీశ్‌ చేసిన ఈ ట్వీట్‌ హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటోను ఉద్దేశించేనని తెలుస్తోంది.

హీరో మోటోకార్ప్‌ ఇటీవల అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్‌తో కలిసి దేశీయంగా తయారు చేసిన X440 మోటార్‌ సైకిల్‌ను ఇటీవల రూ.2.29 లక్షలకే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బైక్‌ బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు బజాజ్‌ ఆటో ట్రయంఫ్‌తో కలిసి స్పీడ్‌ 400ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.2.33 లక్షలుగా పేర్కొంది. హార్లే, ట్రయంఫ్‌.. రెండూ విదేశాలకు చెందిన కంపెనీలే కావడంతో భవీశ్‌ చేసిన ట్వీట్‌ వీటి గురించేనని ట్విటర్‌ యూజర్లు చర్చించుకుంటున్నారు. దీనిపై తమ అభిప్రాయాలను సైతం వెలిబుచ్చారు. ‘భవిష్యత్‌లో ఇవే కంపెనీలు అంతర్జాతీయ బ్రాండ్లను కొనుగోలు చేయొచ్చేమో’ అంటూ ఓ యూజర్‌ రాసుకొచ్చాడు. ‘‘ఈవీలదే భవిష్యత్‌.. అంత మాత్రన పెట్రోల్‌ ఇంజిన్ల పూర్తిగా కనుమరుగైపోతాయను కోవడం భ్రమేనని’ మరో యూజర్‌ రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని