అప్పు.. పెనుభారమవుతోంది

ఎలాంటి హామీ అవసరం లేకుండా బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాలు ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటాయి. మిగతా రుణాలతో పోలిస్తే దీనికి వడ్డీ కాస్త ఎక్కువే.

Updated : 04 Dec 2022 05:10 IST

వ్యక్తిగత రుణాలపై 20% మించిన వడ్డీ
దరఖాస్తుల తిరస్కరణా అధికంగానే

ఈనాడు, హైదరాబాద్‌: ఎలాంటి హామీ అవసరం లేకుండా బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాలు ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటాయి. మిగతా రుణాలతో పోలిస్తే దీనికి వడ్డీ కాస్త ఎక్కువే. కొవిడ్‌ పరిణామాల తర్వాత ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండటం, అన్ని రంగాలూ కోలుకోవడంతో రుణాలకు గిరాకీ పెరిగింది. అదే సమయంలో ప్రజల నగదు అవసరాలూ అధికమవుతున్నాయి. అందువల్లే ఎక్కువ వడ్డీ అయినా, వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకులకు వెళ్తున్నారు. ఈ రుణ దరఖాస్తులను బ్యాంకులూ అంత వేగంగా ఆమోదించడం లేదు. క్రెడిట్‌రేటింగ్‌ బాగున్నవారికే ప్రాధాన్యమిస్తున్నాయి.

బంగారం హామీగా..

కొవిడ్‌ పరిణామాల్లో దెబ్బతిన్న చిరు వ్యాపారులు కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు అవసరమైన నగదు కోసం బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, రుణాలు తీసుకున్నారు. 2021-22 చివరి త్రైమాసికంలో బ్యాంకుల రుణాల్లో అత్యధికం బంగారం తాకట్టు రుణాలే. తక్కువ వడ్డీ,  సులువుగా అప్పు లభించడమే ఇందుకు కారణం. క్రెడిట్‌ స్కోరు, ఆదాయ ధ్రువీకరణలతో సంబంధం లేకపోవడమూ కలిసొచ్చింది. ఇప్పుడు ఈ రుణాలపైనా వడ్డీ రేట్లు పెరుగుతున్నందున, భారం అధికమవుతోంది.

నిధుల లభ్యత తగ్గడంతో..

రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటికీ లక్ష్యమైన 6% కంటే అధికంగానే ఉన్నందున, దీన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతూ పోతోంది. ప్రస్తుతం ఇది  5.90 శాతానికి చేరింది. రుణాలకు గిరాకీ 17 శాతానికి పైగా పెరగ్గా, ఆ స్థాయిలో డిపాజిట్లు రాకపోవడంతో బ్యాంకుల్లో నగదు లభ్యత తక్కువగా ఉంటోంది. ఇటీవల వరకు తక్కువ వడ్డీ ఉండటంతో చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు బదులు అధిక ప్రతిఫలం వస్తుందనే భావనతో షేర్లు, డెట్‌ ఫండ్లలో మదుపు చేయడం ప్రారంభించారు. దీంతో బ్యాంకులు నిధుల కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇవి 8 శాతానికి మించడంతో, రుణ రేట్లూ ఇంకా పెరిగే అవకాశాలుండటం చిరు రుణగ్రహీతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.

పెద్ద రుణాలపైనే

వడ్డీ రేట్లు పెరుగుతున్నందున బ్యాంకులు వాణిజ్య, గృహరుణాలు లాంటి పెద్ద రుణాలు ఇచ్చేందుకే ఆసక్తి చూపుతున్నాయి. పలు బ్యాంకులు తాము అందిస్తున్న వ్యక్తిగత రుణ రేట్లను అమాంతం పెంచేశాయి. కొన్ని బ్యాంకులు 16-21% వడ్డీకి ఈ రుణాలను ఇస్తున్నాయి. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల్లో 31% వరకు వడ్డీ ఉండగా.. వార్షిక వడ్డీ 49% అని చెబుతున్నవీ ఉన్నాయి.

తిరస్కరణే ఎక్కువ..

క్రెడిట్‌ స్కోరు 750కి పైగా ఉన్న వారికి రుణాలు ఇటీవల వరకు సులువుగానే లభించేవి. ఇప్పుడు క్రెడిట్‌ స్కోరు బాగున్నా రూ.5లక్షల లోపు రుణాలివ్వడానికి బ్యాంకులు ఇష్టపడటం లేదు. ఫిన్‌టెక్‌ సంస్థలు నిధుల కొరత ఎదుర్కొంటుండటంతో ఇవి ఇచ్చే రుణ వితరణ మొత్తం తగ్గింది. ద్రవ్యలభ్యత మెరుగు పడితేనే ఈ సమస్యలకు పరిష్కారం లభించే వీలుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు